Home ఎడిటోరియల్ ఫేస్ బుక్ మరో ఆగడం

ఫేస్ బుక్ మరో ఆగడం

ecit

కేంబ్రిడ్జ్ ఎనలిటికా డేటా లీక్ కేసులో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న ఫేస్ బుక్ ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెరతీసింది. కేంబ్రిడ్జి ఎనలిటికా కేసులో ఇరుక్కున్న తర్వాత కూడా ఫేస్ బుక్ ప్రజల జీవితాల్లోకి చొరబడే ప్రయత్నాలు మానలేదు. మరోసారి నిప్పుతో చెలగాటమాడడానికే నిర్ణయించుకుంది.
డేటా సెక్యూరిటీ, ప్రయివసీ గురించి ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబుకుతున్నప్పటికీ, ఫేస్ బుక్ సిఇఒ మార్క్ జుకర్ బర్గ్ కొత్తగా మళ్ళీ డేటా దొంగిలించే పనికి పూనుకున్నాడు. అందుకు అవసరమైన పేటెంట్ కోసం దరఖాస్తు చేశాడు. ఇప్పుడీ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ ద్వారా ఎవరు టివిలో ఏం చూస్తున్నారో తెలుసుకునే కొత్త టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు.
ఫేస్ బుక్ సిఇఒ అమెరికా కాంగ్రెషనల్ కమిటీ ముందు హాజరై, కేంబ్రిడ్జి ఎనలిటికా డేటా కుంభకోణం విషయమై క్షమాపణలు చెప్పి, డేటా దొంగతనాలు జరక్కుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కొన్ని వారాలకే ఫేస్ బుక్ ఈ కొత్త ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. ఫేస్ బుక్ పేటెంట్ కావాలని కోరిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఫేస్ బుక్ సిఇఒగా జుకర్ బర్గ్ చెప్పిన క్షమాపణలు, ఇచ్చిన హామీలు కేవలం ఉత్తమాటలు మాత్రమే అనిపిస్తోంది.
ఫేస్ బుక్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన సాంకేతిక పరిజ్ఞానం పేరు, “బ్రాడ్ కాస్ట్ కాంటెంట్ వ్యూ ఎనాలిసిస్ బేసెడ్ ఆన్ యాంబియంట్ ఆడియో రికార్డింగ్‌”. క్లుప్తంగా చెప్పాలంటే ఆడియో రికార్డు చేయడం ద్వారా టివిలో ఎవరేం చూస్తున్నారో తెలుసుకుని విశ్లేషించే సాంకేతిక పరిజ్ఞానం. ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోనులో ఫేస్ బుక్కు ఉంటుంది. టివి చూస్తున్నప్పుడు స్మార్ట్ ఫోనులోని ఫేస్ బుక్ నిశ్శబ్దంగా చుట్టుపక్కల వినిపించే ఆడియో మొత్తం రికార్డు చేసి పంపిస్తుంటుంది. ఇదెలా జరుగుతుందంటే, టివి కార్యక్రమాల్లో ఈ ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపించగానే ఇది యాక్టివేట్ అవుతుంది. మైక్ ఉపయోగించి రికార్డింగ్ మొదలు పెడుతుంది. టివిలో వినిపించే ఆ శబ్దం మనిషికి వినిపించే శబ్దం కాదు. డిజిటల్ శబ్దం ఒకటి వినిపించగానే మైక్ యాక్టివేట్ అవుతుంది. ఈ శబ్దాన్ని మెషీన్ మాత్రమే వినగలదు. ఆ శబ్దం వినిపించగానే పని ప్రారంభిస్తుంది. ఈ శబ్దం సాధారణంగా టివి కార్యక్రమాల నుంచి ప్రసారమయ్యే శబ్దం. మనిషి వినగలిగే స్థాయికన్నా కాస్త ఎక్కువ పిచ్ ఉండే శబ్దం. రికార్డింగ్ ప్రారంభించిన మైక్ కేవలం టివిలో వచ్చే శబ్దాలను మాత్రమే కాదు, అక్కడ ఆ గదిలో ఎవరేం మాట్లాడుకుంటున్నా ఆ సంభాషణ అంతా రికార్డు చేస్తుంది. ఈ రికార్డింగ్ నడుస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడితే అవి కూడా రికార్డవుతాయి.
ఇలా రికార్డయి ఫేస్ బుక్ సేకరించిన రికార్డింగులన్నీ అక్కడ సర్వర్లలో అంతకు ముందు ఉన్న రికార్డింగులతో పోల్చి చూడడం జరుగుతుంది. ఇలా ఈ డేటా సేకరించడం ద్వారా దాన్ని పోల్చి చూడడం ద్వారా ఎంత మంది ఎలాంటి ప్రోగ్రాములు చూస్తున్నారు? టివి చూసే వీక్షకులు ఎలాంటి కార్యక్రమాలు ఎక్కువ చూస్తున్నారు, వారి అలవాట్లేమిటన్నది విశ్లేషించడం సాధ్యపడుతుంది. ఈ అలవాట్ల గురించి తెలిస్తే అందుకు అనుగుణమైన వ్యాపార ప్రకటనలు తయారు చేసి మార్కెటింగ్ వ్యూహాలు తయారు చేస్తారు. ఇదీ భవిష్యతులో ఫేస్ బుక్ చేయాలనుకుంటున్న పని.
ఇదంతా కేవలం ప్రేక్షకులు ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారో తెలుసుకోడానికి మాత్రమే చేస్తున్నామని, ఇదంతా వ్యాపార ప్రకటనల కోసమేనని చెబుతున్నారు. కాని దీని వల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి.
స్మార్ట్ ఫోను రికార్డింగ్ ప్రారంభించినప్పుడు కేవలం టివిలో వస్తున్న కార్యక్రమాన్ని మాత్రమే రికార్డు చేయదు. ఆ గదిలో జరిగే ప్రతి సంభాషణల రికార్డింగ్ మొత్తం ఫేస్ బుక్ చేతికి వెళుతుంది. రహస్యమైన విషయాలు మాట్లాడుకున్నా, భార్యాభర్తలు ముద్దుమురిపాలు మాట్లాడుకున్నా అన్నీ ఫేస్ బుక్ చేతికి వెళతాయి. ఈ విషయం ఫేస్ బుక్ యూజర్లకు చెప్పకుండానే చేస్తుంది. రికార్డింగ్ చేస్తున్నట్లు ఫేస్ బుక్ యూజర్లకు చెప్పదు. అంటే, స్మార్ట్ ఫోనులో ఫేస్ బుక్ ఉంటే అది మన జీవితాలపై గూఢచార్యం చేస్తుంటుందని అర్థం. ప్రయివసీ అనేది లేనే లేకుండా పోతుంది. ఇటీవల ఫేస్ బుక్ ఎలాంటి డేటా కుంభకోణాల్లో ఇరుక్కుందో గమనిస్తే ఈ డేటాను ఫేస్ బుక్ ఎలా వాడవచ్చో అర్ధం చేసుకోవడం కష్టం కాదు.
మన వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో అంతా ఫేస్ బుక్ వింటూ ఉంటుంది. కేవలం ఆడియో మాత్రమే రికార్డ్ అవుతుందా? కెమెరా కూడా యాక్టివేట్ అయ్యే అవకాశాలున్నాయా? విడియో రికార్డింగ్ కూడా జరుగుతుందా ఇలాంటి అనేక ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలు అసంబద్ధమైనవి కావు. సిబి ఇన్ సైట్స్ అనే టెక్నాలజీ విశ్లేషణ సంస్థ గత సంవత్సరం ఇలాంటి విషయమే బట్టబయలు చేసింది. స్మార్ట్ ఫోను కెమెరాను ఉపయోగించి ఫేస్ బుక్ ఒక మనిషి ఎలాంటి మూడులో ఉన్నాడన్నది తెలుసుకునే ప్రయత్నాలు చేసిందన్న వార్తలు వచ్చాయి. ఫేస్ బుక్ చేస్తున్న ఈ ప్రయోగాలు వ్యక్తిగత జీవితం, ప్రయివసీల విషయంలో ఎంత ప్రమాదకరమైనవో వేరే చెప్పాలా?
ఫేస్ బుక్ ఏం చెబుతుందంటే, ప్రతి యూజర్‌కు నచ్చే సమాచారం, టివి కార్యక్రమం అందజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతుంది. కాని వాస్తవమేమంటే, ఫేస్ బుక్ ఉన్న ప్రతి ఫోనులోని కెమెరాను వాడుకుని, ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. పైగా రికార్డింగ్ జరుగుతున్న విషయం యూజర్‌కు తెలియనే తెలియదు. కనీసం కన్ఫర్మేషన్ అడగడమూ ఉండదు. ఈ పేటెంట్ ఫేస్ బుక్ లభిస్తే అది మన జీవితాల్లో చొరబడి గూఢచర్యం నిరాటంకంగా కొనసాగిస్తుంది.
పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన ఆ టెక్నాలజీ తయారైపోయినట్లు కాదు. మార్కెట్‌లోకి వచ్చినట్లు కాదు. పోటీ ప్రపంచంలో మార్కెటులో పోటీ పడడానికి కూడా పేటెంట్ కోసం ముందే దరఖాస్తులు చేసుకుంటారు. కాని ఫేస్ బుక్ యూజర్ల మూడ్ తెలుసుకోడానికి కెమెరా వాడినట్లు తెలిసిన తర్వాత, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కేసులో డేటా విషయంలో ఫేస్ బుక్ తప్పు చేసినట్లు నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి పేటెంట్ కోసం అది దరఖాస్తు చేయడం చూస్తుంటే ఈ పరిజ్ఞానం ప్రయోగ దశలో కాదు సిద్ధంగానే ఉందనిపిస్తోంది. వ్యక్తిగత ప్రయివసీకి ఫేస్ బుక్ ఏమాత్రం విలువ ఇవ్వదని కూడా నిర్ధారణ అవుతోంది.
ఇలాంటి పేటెంట్లు పొందడం ద్వారా ఫేస్ బుక్ నైతికంగా హద్దులను చెరిపేస్తోంది. ఆడియో రికార్డింగుల పేటెంట్ పొందితే ఆ తర్వాత మరింతగా వ్యక్తుల జీవితాల్లో చొరబడే ప్రయత్నాలు చేస్తుంది. ప్రయివసీ అనే మాటకు అర్ధం లేకుండా పోతుంది. కాని ప్రస్తుతమున్న ప్రయివసీ చట్టాల ప్రకారం ఫేస్ బుక్ ను అడ్డుకోవడం కూడా సాధ్యం కాదు. ఇక మిగిలిన ప్రత్యామ్నాయం ఒక్కటే, ఫోను నుంచి ఫేస్ బుక్ తీసిపారేసి వదిలించుకోవడమే.

* సుశాంత్ తల్వార్  (డైలీ ఓ)