Friday, April 19, 2024

దేశాలు కార్పొరేట్ల వశాలు

- Advertisement -
- Advertisement -

Facebook announced its own currency Libra in June 2019

 

కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర సార్వభౌమ దేశాల విధులను ఆక్రమించాయి. సామ్రాజ్యవాద అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోందనుకుంటాం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్టని అమానవీయ సంస్థలు యూనియన్ కార్బైడ్, ఐబిఎం, ఐటిటి, ఎటి&టి, డుపాంట్, డౌ, ఎక్సాన్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. వీటి వాణిజ్య నిబంధనలు విశ్వగమనాన్ని, పాలనా పద్ధతులను, సమాజ స్థితిగతులను నిర్ధారిస్తున్నాయి. పాలకులు కార్పొరేట్ల వశమై కార్పొరేట్ దేశాలు ఏర్పడ్డాయి.

ప్రపంచ సామాజిక మాధ్యమ దిగ్గజం అమెరికన్ సంస్థ ఫేస్‌బుక్ 2019 జూన్‌లో సొంత కరెన్సీ ‘లిబ్ర’ను ప్రకటించింది. జూన్ 2020 కు డిజిటల్ వాణిజ్య ద్రవ్యంగా లిబ్ర రూపురేఖలు, విధి విధానాలు నిర్ణయిస్తానంది. లిబ్ర డీమ్ గా మారింది. వెంటనే ఇంగ్లండ్ బ్యాంక్ పూర్వ గవర్నర్ మార్క్ కార్నీ ప్రపంచ వస్తు సముదాయ ఆధారంగా కొత్త డిజిటల్ కరెన్సీని ప్రతిపాదించారు. ప్రాచీన రోమ్‌లో లిబ్ర బరువు కొలమానం. బూడిద రంగు తోడేలు రూపంలో న్యాయ సత్య దేవత. ఆర్థికరంగం బయట కోటీశ్వరుల సృష్టి ప్రపంచ డిజిటల్ వాణిజ్య లక్షణం. శరీర శ్రమ, క్రియాశీల మేధోశక్తి, వస్తూత్పత్తి, సేవల కల్పన లేకుండా చట్ట వ్యాపార, లాటరీ పద్ధతుల్లో డబ్బు పోగేసుకోటంలో ఈ వాణిజ్యం స్థిరపడింది. 260 కోట్ల ఫేస్ బుక్ వినియోగదారులు లిబ్రతో వస్తువులు, సేవలు పొందవచ్చు. పెట్టుబడిదారీ విధానాలు సామాన్యుల జీవితాలను కాలరాసి బహుళజాతి సంస్థల, సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్నాయి. ఈ నేపథ్యంలో లిబ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచీకరణ సరళీకృత విధానాలు ఆర్థిక విశృంఖలతకు, సమస్యల పునరావృతానికి కారణం. కఠిన పొదుపు పద్ధతులు ప్రజలపై రుద్దారు. బడుగుల జీవనోపాధులు దెబ్బతిన్నాయి. ఆర్థిక లావాదేవీల డిజిటల్ కరెన్సీ సార్వభౌమ కరెన్సీ స్థానాన్ని భర్తీ చేయలేదు. దురుపయోగాలకు, ఆర్థిక ఉగ్రవాదానికి దారితీస్తుంది. సార్వభౌమత్వం రాజ్యం దగ్గర ఉండాలి. ప్రైవేట్ల ప్రయోజనాలు కాపాడే బహుళ జాతి సంస్థలకు బదిలీ కారాదు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రునో లీ మైర్ స్పందించారు. ఫేస్ బుక్ ప్రకటించిన రహస్య ద్రవ్యం అపాయకర ఆర్థిక పరిణామాలకు సంకేతం. ప్రభుత్వ కరెన్సీ ముద్రణ, పంపకం సార్వభౌమత్వ లక్షణాలు. కార్పొరేట్లు ఈ అధికారాన్నీ లాక్కుంటున్నాయి. ప్రకృతి వనరుల, ఉత్పత్తి, సంపదల పంపకంలో ప్రభుత్వ విధానాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రజా సాధికారితను నిర్ధారిస్తాయి. పాలక విధానాలు ప్రజానుకూలం కావు. సంపన్నుల, కార్పొరేట్ల ప్రయోజనకరాలు. పాలక పక్షాల జుట్టు కార్పొరేట్ల చేతుల్లో ఉంది. లిబ్ర చెల్లింపుల విధానమేనని, స్వతంత్ర కరెన్సీ కాదని, అధికార కరెన్సీకి లోబడి ఉంటుందని ఫేస్ బుక్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. కానీ 2019 జులై 16న పార్లమెంటులో కొత్త కరెన్సీని ఎలా క్రమబద్ధీకరిస్తారన్న ప్రశ్నకు ఫేస్‌బుక్ కార్యనిర్వహణాధికారి డేవిడ్ మార్కస్ జవాబు చెప్పలేదు.

ప్రజా సేవల వినియోగదార్ల పేర్లు, పాస్ వర్డ్, అధికార గుర్తింపు, ఆర్థిక, ఆరోగ్య, లింగ, బయోమెట్రిక్, కుల, మత, తెగల వివరాలు, లైంగిక జీవిత విన్యాసాలు, మత నమ్మకాలు, రాజకీయ అనుబంధాలు కీలక వ్యక్తిగత సమాచారంలో సేకరించి పొందుపరుస్తారని మన శ్రీకృష్ణ కమిటీ తెలిపింది. ఈ సమాచారం కార్పొరేట్లు సేకరించాయి. ప్రజల జుట్టు పట్టుకున్నాయి. బాధ్యత, జవాబుదారీతనం లేని నిర్ణయాధికారం, ఆర్థిక విధానాలు వాటి సొంతమే. బలహీన ప్రభుత్వాలను బెదిరించి వాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక విధానాల్లో జోక్యం చేసుకుంటాయి. రాజ భవంతులు నిర్మించుకున్నాయి. మౌలిక, సేవా సౌకర్యాలు, గృహ సముదాయాలతో చిన్న స్వతంత్ర దేశాలుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రజల నివాస వసతి హక్కును పట్టించుకోదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కార్పొరేట్ సంస్థలు పట్టణ ప్రణాళికల్లో తలదూర్చాయి. కోట్ల డాలర్ల గృహ సముదాయాలు నిర్మించాయి. వీటిల్లో నివసించే తమ ప్రజలతో పోరాటాలు చేయించి ప్రభుత్వ విధానాలను అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ పద్ధతుల్లో ఉబర్ తన వ్యాపారాల్లో ప్రభుత్వ క్రమబద్ధీకరణ లేకుండా చేసింది. ఎయిర్ బి.ఎన్.బి. తన వాణిజ్య వ్యవహారాల్లో ప్రభుత్వ ఆర్థిక పరిశీలన తొలగించుకుంది. కార్పొరేట్లు పెద్ద మొత్తంలో వాణిజ్య పన్నులు రద్దు చేయించుకున్నాయి.

2018లో అమెజాన్ 11.2 బిలియన్ డాలర్ల (రూ.81,783 కోట్ల) లాభాలపై పన్ను చెల్లించలేదు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కార్పొరేట్ సంస్థలు దురుపయోగపరిచిన విధానాన్ని కేంబ్రిడ్జ్ అనలిటిక కుంభకోణం బయటపెట్టింది. కార్పొరేట్లు ఈ సమాచార నిధిని వాణిజ్య ప్రకటనలకు, ప్రజాభిప్రాయ వక్రీకరణకు, ప్రజా సమ్మతి నిర్మాణానికి, రాజకీయ ఉద్దేశాల మార్పుకు, తమ జాతీయత గుర్తింపునకు వాడుకుంటున్నాయి. ప్రత్యేక రాజ్య లక్షణాల గొప్పలతో ‘కార్పొరేట్ దేశాలు’ స్థాపించుకున్నాయి. రాజ్య కార్యాచరణల్లో చొరబడ్డాయి. సంప్రదాయ సార్వభౌమ లక్షణాలను హరిస్తున్నాయి. రాజ్యాలు పరిపాలన ప్రాసంగికతను కోల్పోతున్నాయి. బలహీన ప్రభుత్వాలు పాలనా విధాన విఫలతను కప్పిపుచ్చుకోటానికి దేశభక్తి ముసుగులో జాతివాద, జాత్యహంకార చర్యలకు పాల్పడుతున్నాయి. పాలనాపటుత్వం, నియంత్రణను నటిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.

అమెరికా తమ దేశ బహుళజాతి సంస్థల లాభాలు పెంచటానికి ప్రపంచ దేశాల్లో వాటి ఉత్పత్తుల, సేవల పన్నులు తక్కువ చేసే చర్యలు తీసుకుంటుంది. ఆమోదించని దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. అమెరికా సంస్థలు గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, యాపిల్, ఎయిర్ బి.ఎన్.బి. ఉబర్ ఫ్రాంస్ లాంటి దేశాల్లో తమ వ్యాపార లావాదేవీలపై అతి తక్కువ పన్నులు చెల్లిస్తాయి. పన్నుల ఎగవేతకు ఐరోపాలో అనుకూల దేశాల్లో వ్యాపార కేంద్రాలు స్థాపించుకుంటాయి. ఐరోపా దేశా ల్లో అమెరికా సంస్థల వ్యాపారం 83.5 కోట్ల డాలర్లు దాటితే పన్ను చెల్లించేటట్లు, ఫ్రెంచ్ సంస్థల వ్యాపారం 2.7 కోట్ల డాలర్లు దాటగానే పన్ను చెల్లించాలని నిబంధనలు విధించారు. ఇది అమెరికా, చైనా, ఐరోపా దేశాల్లో 30 కంపెనీలపై ప్రభావం కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యవాదులకు కొన్ని సందేహాలున్నాయి. కార్పొరేట్లు ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాయి? ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచీకరణల అవలక్షణాలను సవరించే రాజకీయ నిర్ణయాలను ప్రభుత్వాలు ఎందుకు తీసుకోలేకపోతున్నా యి? కార్పొరేట్ల పన్నుల రద్దుకు ప్రభుత్వాలు ఎందుకు పోటీపడుతున్నాయి? బహుళ జాతి సంస్థల ఉమ్మడి ఆర్థిక విధానాలను ఎందుకు రూపొందించవు?

ప్రజాప్రయోజన చర్యలు మాని కార్పొరేట్లకు అపరిమిత ఆదాయాలు అందించే విధానాలను ఎందుకు అవలంబిస్తున్నాయి? కాలం చెల్లిన జాతీయ రాజకీయాలు కార్పొరేట్లపై అధీనతను తిరిగి సాధిస్తాయా? పాలకులు బహుళజాతి సంస్థలకు అమ్ముడుపోయి ప్రజాశ్రేయస్సు వదిలేయటం కారణమని పై ప్రశ్నలకు జవాబు. ఆకలి, పేదరికం, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం, వలసవాదం, కృత్రిమ మేధస్సు వంటి సవాళ్లను అధిగమించి సమస్యలను పరిష్కరించుకుంటా యా? తప్పకుండా. అయితే ప్రపంచ దేశాలు ఉమ్మడి అపాయాలు గుర్తించాలి. సరిహద్దులు దాటి ఏకమవ్వాలి. ఐక్య కార్యాచరణ రూపొందించుకోవాలి. సమ సమాజ నిర్మాణానికి పూనుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News