Home తాజా వార్తలు ఒక్కసారి ఓడిపోయి చూడు!

ఒక్కసారి ఓడిపోయి చూడు!

Failure

“ఎప్పుడూ గెలుపేనా… ఒక్కసారి ఓడిపోయిచూడు. జీవితం నీకింకో కొత్త కోణంలో కనిపిస్తుంది” అని ఒక సినిమా డైలాగ్. ఇది చాలా కరెక్ట్ అంటారు మనో విశ్లేషకులు. వైఫల్యాలు మనిషికి విజయ మార్గాన్ని చూపిస్తాయి అంటారు. అందుకే ఓడిపోతే భయ పడకండి. బాధ పడకండి. వైఫల్యంతో పోయేది ఏమీ లేదు. అహాలు అహంకారాలు తప్ప.. ఓడితేనే గెలుపు విలువ తెలుస్తుంది.

ఓటమి చెపితేనే గెలుపు పాఠం అర్థం అవుతుంది.. ఈ ఫెయిల్యూర్‌ని రెండు రకాలుగా చెప్తారు నిపుణులు. పాజిటివ్ ఫెయిల్యూర్, నెగిటివ్ ఫెయిల్యూర్. పాజిటివ్ ఫెయిల్యూర్ అప్పటికప్పుడు కాస్త బాధ పెడుతుంది. ఒకటి రెండు రోజులే. ఆ తర్వాత మటుకు మన చుట్టూ కోటగోడలా నిలబడి కాపాడుతుంది. అదే నెగిటివ్ ఫెయిల్యూర్ ఒక ఊబి లాంటిది. అందులో పడి మునిగిపోవటం తప్ప ఇక లేవటం అంటూ ఉండదు. అందుకే మనుష్యులు వైఫల్యాలను పాజిటివ్ ఫెయిల్యూర్స్‌గా తీసుకోవాలి. ఓటమికి భయపడితే గెలుపు దగ్గరకు రాదు కదా!

ఎంతో కష్టపడితేనే గెలుపు : జీవితంలో జయాపజయాలు సహజం. ఒకవేళ అపజయం ఎదురైతే ఓ దారి మూసుకుని వంద దార్లు మన ముందు నిలబడి ఆహ్వానం పలుకుతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఓటమి ఒక కచ్చితమైన తూనికరాయి వంటిది. అది మనలోని లోపాల్ని, ఆత్మన్యూనతలను, భయాలు, భ్రమలు, అజ్ఞానం, అహంకారం అన్నింటిని నిష్పక్షపాతంగా ఎత్తి చూపెడుతుంది. ఏ సైకాలజిస్టూ అంత పని చేయలేడు. ఓటమి ఒక చిన్న మందలింపు ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఇబ్బందుల్లో పడతావని ఒక ప్రేమ పూర్వకమైన హెచ్చరిక లాంటిది. ఇంతకంటే మొహమాటం లేని స్నేహితులు మనకు దొరకరు. ఓటమిని గౌరవించి, హుందాగా స్వాగతం చెపితే, ఇక చేయవలసిన పని శ్రద్ధగా, నేర్పుగా, పట్టుదలగా చేయబోతున్నామని చెప్పినట్లు అర్థం. ఒక్కసారి ఓటమి ఎన్నో అద్భుతాలు చేయిస్తుంది. బల్బ్ తయారీలో విఫలం అయినందుకు థామస్ ఎడిసన్ బద్ధ్దకిస్తే మనకు ఎలక్ట్రిక్ బల్బ్ ఎక్కడ నుంచి వచ్చేది. పచ్చిమాంసం తినే రోజులనుంచి మనుషులు అన్వేషించటం మొదలుపెట్టి చీకటిని జయిస్తూ రాకపోతే ఇవ్వాళ ఇంత అభివృద్ధి ఉండేదే కాదు. ఇవన్నీ వైఫల్యాలలోంచి వచ్చిన విజయాలే.

బిల్‌గేట్స్ దగ్గర నుంచి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనవంతులు అందరూ వైఫల్యాల్లోంచి వచ్చినవాళ్లే. నిజానికి గెలుపంటే ఏమిటీ? ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, సన్మానాలు, సత్కారాలు కాదు. మనం నమ్మిన మార్గంలో ధైర్యంగా చేసే ప్రయాణం గెలుపు… ఈ ప్రయాణంలో ఓడి పోయామా, గెలిచామా అనేది ప్రశ్న కాదు. ఎంత ఆత్మ విశ్వాసంలో జీవితంతో, సమస్యలతో, పోరాడతాం అన్నది ముఖ్యం. నమ్మిన విలువలకు ఏ మేరకు కట్టుబడి ఉన్నామన్నది ముఖ్యం. ఓటమి జీవితంలో ఒక భాగం. మన చుట్టూ ప్రపంచంలో చూస్తే రాజకీయాల్లో, సినిమాల్లో, సాహిత్యాల్లో ఎక్కడికి వెళ్లినా ఓటమితో రాటుదేలిన వాళ్లే అగ్రస్థానాల్లో కనిపిస్తారు. మహానటులూ, నిర్మాతలు, స్టూడియోల యాజమాన్యులు జీవితంలో ఎన్నెన్నో ఎదురు దెబ్బలకు ఓర్చుకుని గట్టిపడి గెలిచిన వాళ్లే. రవితేజ, నాని వంటి స్టార్‌లు తమ ప్రయాణం ఎక్కడ నుంచి మొదలు పెట్టి గెలిచారో ఎన్నో ఇంటర్వూల్లో వినే ఉంటాం. వెండితెర వేల్పులు ఎంతోమంది కష్టపడి గెలిచినవాళ్లే. ఒక్కసారి ఓడితేనే జీవితం అర్థం అవుతుంది.

ఓడిపోగానే ముందు మనవాళ్లు ఎవరో, ఆత్మీయులెవరో, స్నేహితులెవరో తెలుస్తుంది. వ్యాపార నష్టాలొస్తే, భాగస్వాములతో సహా చుట్టూ స్నేహితులు, బంధువులు కూడా మాయమై పోతారు. మనం వడపోత పోయనక్కర్లేదు. నిజంగా మన మేలు కోరిన ఒకళ్లో ఇద్దరో మన పక్కన నిలబడి కనిపిస్తారు. ఫేస్‌బుక్, సెల్‌ఫోన్ ఫ్రెండ్స్, లైకులు కొట్టేవాళ్లు మెసేజ్‌లతో ఉత్సాహపరిచే వాళ్లు శ్రేయోభిలాషులు కారు. కేవలం పరిచయస్తులు. ఓటమి మనకు స్నేహితులను బంధువులను గాలించి ఇస్తుంది. సక్సెస్ మనకు తేజస్సు ఇచ్చి అనంతాకాశంలో నిలబెడుతుంది. మనలో లేని గొప్ప గుణాలు ప్రపంచానికి భూతద్దంలో చూపిస్తుంది. అదే ఓటమి మనల్ని లాక్కుని వచ్చి నేలపైన నిలబెడుతుంది. మనం ఓడిపోయి ఒంటరిగా ఉన్నప్పటిదే అసలైన మనరూపం. అదే నిజరూపం. అప్పుడే మన శక్తి మనకు తెలుస్తుంది. వైఫల్యం నిరాశకు కారణం కాదు, గెలుపుకి పునాది. ఒక వైఫల్యంతో గెలుపు వైపు ప్రయాణం మొదలు పెడితే ఇక ఎప్పుడూ విజయమే!

Failure is a predictor of success in human life