Home స్పెషల్ ఆర్టికల్స్ ఆశలు సమాధి చేస్తూ!

ఆశలు సమాధి చేస్తూ!

Fack-doctors

నగరంలో నకిలీ వైద్యుల ఆగడాలు
తప్పని పరిస్థితుల్లో ఆశ్రయిస్తున్న రోగులు
శివారు ప్రాంతాలే టార్గెట్
మూడు పువ్వులు ఆరుకాయలుగా వైద్య బిజినెస్
సొంత వైద్యాన్నే నమ్ముకుంటున్న అమాయక ప్రజలు
పట్టించుకోని వైద్యారోగ్యశాఖాధికారులు

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో నకిలీ వైద్యులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. జబ్బు తగ్గుతుందని కొండంత ఆశతో రోగులు ఈ వైద్యులను సంప్రదిస్తే వారి ఆశలు సమాధి అవుతున్నాయి. ఉన్న జబ్బు తగ్గడం కాదు కదా, నకిలీ వైద్యానికి ఏకంగా పలువురు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతి వారంలో ఒకచోట వైద్యం వికటించి ఏదో ఓ సంఘటన చోటుచేసుకుంటునే ఉంది. కొన్నిచోట్ల మాత్రం ఈ సంఘటనలు బయటపడుతున్నాయి. మరి కొన్నిచోట్ల బాధితులతో నకిలీ వైద్యులు సెటిల్‌మెంట్ చేసుకుంటూ యథేచ్ఛగా ఆసుపత్రులను నడిపిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నకిలీ వైద్యులు అధిక సంఖ్యలో దర్శనమిస్తున్నారు. ఈ ప్రాంతాలపై ఆయా జిల్లాల వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో వీరి వైద్య బిజినెస్ మూడు పూవులు ఆరు కాయాలు అనే చందంగా సాగుతోంది. నగరంలో కూడా పరిస్థితి ఇదే తరహాలో ఉంది. బస్తీలు, కాలనీల్లో ఎందరో అర్హతలేని వైద్యులు ఉన్నప్పటికీ వైద్యారోగ్యశాఖాధికారులు కనీసం తనిఖీలు కూడా చేపట్టలేకపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ఏరియా ఆసుపత్రులతో పాటు నగర పెద్దాసుపత్రుల్లో సైతం రోగులకు సకాలంలో వైద్యసేవలు అందక ఈ నకిలీ వైద్యులను సంప్రదించాల్సి వస్తోంది. తప్పనిపరిస్థితుల్లో రోగం తగ్గించుకునేందుకు వేరే దారిలేక అమాయక ప్రజలు వీరిని ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు రోగులు సొంత వైద్యాన్నే నమ్ముకుంటున్నారు.
శివారు ప్రాంతాలే టార్గెట్
నకిలీ వైద్యులు నగర శివారు ప్రాంతాల్లోనే అధికంగా పాగా వేస్తున్నారు. కేవలం రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఆర్‌ఎంపి) వైద్యులు వారి ఇష్టానుసారంగా బోర్డులను బిగించుకొని ఎంబిబిఎస్ అవతారాలు ఎత్తుతున్నారు. శివారు ప్రాంతాల్లో నివసించే వారికి ఎక్కువగా అవగాహన ఉండదు. వారికి వైద్యం, వైద్యుల పట్ల పెద్దగా తెలియదు…అనారోగ్యానికి గురైన వెంటనే ఈ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో ఈ నకిలీ వైద్యుల వైద్యానికి మృత్యువాత చెందిన వారు కూడా ఉన్నారు.
వైద్యుల గురించి తెలుసుకోండి
మీ ప్రాతంల్లో ఉండే ఆసుపత్రుల్లో వైద్యుల గురించి ముందు గా తెలుసుకోండి. అసలు ఆయన వైద్యుడేనా? ఇంతకు ముం దు ఎక్కడెక్కడ పని చేశాడు? ఏం చదువుకున్నాడు అనే విషయాలను తప్పని సరిగా తెలుసుకోని వైద్యాన్ని పొందాల్సివ బాధ్యత రోగులపైనే ఉంది. అవగాహనలేని నకిలీ వైద్యుల వద్ద కు వెళితే రోగం మరింత ముదిరి ప్రాణాల మీదకు వస్తోంది.