Home ఎడిటోరియల్ సంపాదకీయం: నకిలీ విత్తన మోసకారులు

సంపాదకీయం: నకిలీ విత్తన మోసకారులు

Sampadakeeyam-Logoఆరుగాలం కష్టించి ఆహారోత్పత్తి చేస్తున్న రైతులు ఎల్లప్పుడూ ఏదో ఒక మోసానికి గురవుతూ ఉంటారు. విత్తనాలు, పురుగుమందుల మొదలు మార్కెట్ యార్డుల వరకు ఏదోక దశలో దగాపడి దిగాలు పాలవుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, అకాలవర్షాలు, వరదల వంటి ప్రకృతి ఒడుదుడు కులవల్ల కష్టనష్టాలకు తోడు మార్కెట్ శక్తులు వారి జీవితాలతో చెలగాట మాడుతున్నాయి. ఆదుకోవలసిన, రక్షగా నిలవాల్సిన ప్రభుత్వాల బాసలు బారెడు, ఆచరణ మూరెడు. పర్యవసానంగా దాదాపు దశాబ్దకాలంగా వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కొడిగట్టిన దీపంలాంటి జీవితాలతో సతమతమవుతూ ఎందరో రైతులు ఆత్మహత్య బాటపడుతున్నారు. ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలన్నిటినీ వ్యవసాయ సంబంధ మైనవిగా గుర్తించటానికి నిరాకరిస్తున్నాయి. గత రెండున్నర సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2400 మంది రైతులు బలవన్మరణం పొందినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. రైతు రుణమాఫీ పథకం అమలు చేస్తున్నామని, లక్షకోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు తలపెట్టామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకోవచ్చు. భారీ కార్యక్రమాల మాటున రైతుల రోజువారీ సమస్యలు నిర్లక్షానికి గురికారాదు. రాష్ట్రాన్ని విత్తన ధాన్యాగారంగా మార్చుతామని ప్రభుత్వం చెబుతుండగా, రైతులేమో విత్తన కంపెనీల మోసానికి గురవుతున్నారు. కల్తీ విత్తన సరఫరాదారులను అరెస్టుచేయాలని, పిడిచట్టం ప్రయోగించాలని, కంపెనీలనుంచి పరిహారం వసూలు చేసే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. విత్తన దగాకోరులను కఠినంగా శిక్షించే, రైతుల పంట, శ్రమ నష్టానికి వెంటనే పరిహారం వసూలు చేసే కఠినమైన చట్టం లేనంతకాలం ఆ మోసకారులు అదరరు, బెదరరు. ఏదోక వాణిజ్య పంటకు సంబంధించి నకిలీ విత్తనాల సమస్య ఏటా ఎక్కడో ఒకచోట తలెత్తుతుండటమే ఇందుకు నిదర్శనం.
మెరుగైన పంట దిగుబడికి మేలైన విత్తనం ప్రాథమికావసరం. ఈ సంవత్సరం వర్షాలు మస్తుగా కురవటంతో రిజర్వాయర్లు, చెరువులు జలకళ ఎత్తటంతో రైతులు ఎంతో కుషీగా ఉన్నారని, రబీ పంటలు పుష్కలంగా పండుతాయని ఆశాభావాలు వ్యక్తమవుతుండగా, ఖరీఫ్‌లో మిరప, పత్తి విత్తిన రైతులు కనీసం ఐదు జిల్లాల్లో లబోదిబో మంటున్నారు. వారు విత్తిన పైర్లు రెండు-మూడు మాసాల తదుపరి కూడా పుష్పించక పోవటంతో విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలతో తమను దగా చేశారని వాపోతున్నారు. ఆదిలాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో రైతులు రోడ్డెక్కటంతో ప్రభుత్వం తనిఖీ బృందాలను పంపగా, నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా విక్రయించినట్లు నిర్థారించాయి. ఈలోపు రైతులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిర్చిరైతులు విపరీత నష్టానికి గురైనారు. గత ఏడాది మిర్చికి మంచి ధర లభించటంతో ఈ ఏడాది ఒక లక్ష నలభైవేల ఎకరాల్లో మిరపసాగు చేశారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ.500 చొప్పున ఎకరాకు 20 ప్యాకెట్లు కొన్నారు. ప్రభుత్వంనుంచి లైసెన్స్ పొందకుండా కనీసం 15 కంపెనీలు నకిలీ విత్తనాలు విక్రయించినట్లు చెప్పబడుతున్నది. ఒక్కొక్క కంపెనీ కనీసం కోటి రూపాయలవరకు లాభం మూటగట్టుకున్నాయి. రైతులు రూ. 500కోట్లు విలువైన పంట నష్టపోయారని అధికారులు అంచనా. “విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిపార్టుమెంటు అధికారులను ఆదేశించాం. విత్తన కంపెనీలు నష్టపోయిన రైతులకు తగినంత పరిహారం చెల్లించేటట్లు చూస్తాం” అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇస్తున్నారు.
విత్తన విక్రయ టార్గెట్లు పూర్తిచేసిన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్‌లు విదేశీ విహార యాత్రలతో ఖుషీచేస్తుంటే, రైతులేమో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వంవైపు చూస్తున్నారు. ఈ నష్టానికి ప్రకృతి వైపరీత్యం కారణం కానందున బాధిత రైతులకు పంట బీమా పరిహారం లభించదు. అందువల్ల ప్రభుత్వం చురుకుగా పనిచేసి కంపెనీల మెడలు వంచి పరిహారం సాధించాలి, నేరస్థులను జైలుకు పంపాలి. మున్ముందు ఇటువంటి మోసాలు జరగకుండా చట్టాన్ని కఠినతరం చేసే విషయాన్ని సీరియస్‌గా ఆలోచించాలి.