Home తాజా వార్తలు అత్తా ఒకింటి కోడలే!

అత్తా ఒకింటి కోడలే!

Family Relationships

 

ప్రతి అమ్మాయి కొత్తగా పెళ్లయి కోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టడమంటే ఎంతో కొంత భయాందోళనలకు గురవుతుంది. కొన్ని సార్లు అదే దిగులుగా మారుతుంది. అమ్మాయి మనసులో అత్తగారింటి పట్ల ప్రతికూల భావాలు ఉన్నప్పుడే సమస్య ఉత్పన్నమౌతుంది. అదేవిధంగా అత్త కూడా కొంచెం కంగారు పడుతుంది. ఇంటికి రాబోయే కొత్త వ్యక్తి ఎలా ఉంటుందో, కలుస్తుందో కలవదో, తన నుంచి కొడుకును విడదీస్తుందేమోనని దిగులు పడుతుంటుంది. ఇలా ఎక్కువ శాతం మంది సరైన కారణం లేకుండానే ప్రతికూలంగా ఆలోచిస్తుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఏ తరంలో అయినా పెళ్లయ్యాక ఆలుమగలు అందమైన వైవాహిక జీవితం గడపాలని ఆదర్శ జంటగా ఉండాలని ఆశిస్తారు. ఆ ఇద్దరికీ సంబంధించిన కుటుంబాల్లోని బాంధవ్యాల గురించి మాత్రం కొత్త కోడలి మనసులో ఒక అభిప్రాయం ఉంటుంది. అత్తారింట్లో పరిసరాలు, వ్యక్తులు రెండూ అమ్మాయికి అపరిచితమే. ఇలాంటప్పుడు అత్తారింట్లో ఏ వ్యక్తితోనైనా తన ఆశలు, ఆశయాలు, భావాలు, సమస్యల్ని వ్యక్తం చేయడానకి, చర్చించడానికి సంకోచిస్తుంది.

అత్త అంటేనే భయం: అత్తగారి పాత్ర గురించి గతంలో విన్న అనుభవాలు కొత్తగా అడుగుపెట్టే కోడలికి ఆందోళన కలిగిస్తుంది. ఆ ఇంట్లో ఆమె పెత్తనం, ఆడబిడ్డలు, వాళ్ల పెట్టుపోతలు, వాళ్ల ప్రత్యేకత ఇవన్నీ కొత్త కోడల్ని సందేహంలో పడేసే నిజాలు. అలాగే ఈమె విషయంలో అత్తగారికి సందేహం. ఇప్పటి వరకు చక్కగా సాగిపోతున్న సంసారంలోకి ప్రవేశిస్తున్న కోడలు తమతో సర్దుకుపోతుందా? తమ కుమారుడిని దూరం చేస్తుందా? ఆమె తన పుట్టిల్లునే సొంతం అనుకుంటుందా? అత్తగారిని ఆడబిడ్డలను ప్రేమిస్తుందా? ద్వేషిస్తుందా? ఇవే అత్త మనసులో రేకెత్తే ప్రశ్నలు, భయాలు.

పరస్పర విరుద్ధ శక్తులా సాహిత్యంలో, సినిమాల్లో, నిజ జీవిత అనుభవాల్లో ఈ రెండు పాత్రలు హాస్యాస్పదమైన, ఏ మాత్రం సెన్సిబుల్‌గా లేని పాత్రలే పోషిస్తూ ఉంటాయి. ఒక బలమైన ముద్ర ఈ రెండు బాంధవ్యాల్ని పరస్పర విరుద్ధమైన శక్తులుగా చీల్చి పడేసింది. నిజంగా ఈ ఇద్దరూ ఎప్పటికీ కలుసుకోలేని రైలు పట్టాల్లాంటి వాళ్లేనా? పిల్లల్ని కన్నతల్లి కోడల్ని మాత్రం ఎందుకు తన కూతురు అనుకోలేకపోతుంది? లేదా తల్లి దగ్గర గారాబంగా పెరిగిన అమ్మా యి అత్తగారిని తల్లిలాంటిదే అని ఎందుకు భావించలేక పోతుంది? అంటే అది ఒక కుటుంబంలో పైకి అనిపించని యుద్ధం వంటి సమస్య కాబట్టి. కొత్తకోడలిగా అడుగుపెట్టిన యువతి అత్తగారి వలే తన సొంత జీవితానికి మొదటి రోజు నుంచే పునాది వేసుకొంటుంది. అదే మొట్టమొదటి యుద్ధ భేరీ నినాదం. ఆ ఆలోచనతోనే ఇద్దరు స్త్రీలు అత్తాకోడళ్ల బాంధవ్యంలోకి వస్తే ప్రళయం తప్పదు. కానీ ఇప్పుడా అవసరమే లేదు.

చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చాకనే పెళ్ళిళ్లు, వేరే కాపురాలు. అత్తగారు, కోడలు వేర్వేరు చోట్ల ఎవరి జీవితంలో వాళ్లుగా ఉంటున్నారు. సంస్కారం, సభ్యత ప్రపంచజ్ఞానం ఉన్న ఏ అత్తామామలు కన్నబిడ్డల కాపురాలను కల్లోలం చేయరు. చదువుకుని బుద్ధిగా తల్లిదండ్రుల పెంపకంలో, వాళ్ల సంస్కారం అలవర్చుకున్న ఏ అమ్మాయీ అత్తగారిని అవమానించదు. కానీ ముందే ఒక దృఢమైన అభిప్రాయంలో ఉన్న అత్తాకోడళ్ల వ్యవహారం ఏమిటీ? వాళ్ల మధ్య సయోధ్యకు అవకాశం ఉందా లేదా అంటే, అర్థం చేసుకుంటే ఉంటుంది.

అనుకూలమైన దాంపత్యం, శాంతియుతమైన జీవన విధానం కావాలనుకుంటే ఏ సమస్య ఉత్పన్నం కాకుండానే జీవితం చక్కగా నడుస్తుంది. ఆనందంగా గడపటం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. మన భావాలపై ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఏది ఒప్పు, ఏది తప్పు అన్న విచక్షణ ఉంటే జీవితం స్వర్గమే. భారతీయ సంప్రదాయంలో ఇద్దరి మధ్య ఒక బంధాన్ని పెనవేసి ఆనందమైన జీవితానికి పునాది వేసేది వివాహం. ఆ వ్యవస్థ అర్థాన్ని తెలుసుకుని అడుగులు వేస్తే సమస్య అనేది లేదు. జీవితంలో ఆనందం ఉండాలంటే కలివిడితనం చాలా అవసరం. కుటుంబ సభ్యులందరూ ఈ రూల్‌ని పాటించాలి.

 

1. అత్తగారైనా, కొత్త కోడలైనా ముందుగా మొదటి చూపులోనే ఒకళ్లపట్ల ఒకళ్లు స్నేహం చూపెట్టుకుని తీరాలి.

2. మనసుల్లో ఉండే ఇగోలన్నీ పక్కన పెట్టి చిన్నిచిన్ని మాట పట్టింపులు కూడా మా మధ్య రావనే నమ్మకాన్ని ఒకళ్లకొకళ్లు ఇచ్చుకోవాలి.
3. జీవితంలో నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఉన్న చోట ధైర్యం, ముక్కుసూటితనం ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది.
4. ప్రతి విషయంలో కూడా అత్తాకోడళ్లు పారదర్శకంగా ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ పూర్వకమైన మనస్సుతో ఉండాలని నిర్ణయించుకొని తీరాలి.
5. మనస్సు అద్దం వంటిది. మనం మన మనస్సుపై వేసే ముద్రలే మన వ్యక్తిత్వానికి ప్రతిబింబాలుగా ఉంటాయి.
6. స్వచ్ఛత, నిర్మలత, విలువలు వంటి సద్గుణాలు పెంచి పోషించుకుంటే ఆ సువాసనలు ఇంటిని ఆహ్లాదంతో నింపేస్తాయి.
7. కొత్తకోడలు ఇంటికి అపరిచితురాలనీ, ఆమెకు తమ కుటుంబసభ్యులతో, వారి అలవాట్లతో, వారి ఆలోచనలతో సంబంధం లేదని, తానే మార్గదర్శిగా ఉండటానికి ప్రయత్నించాలి.
8. ఆమెకు ఇప్పటివరకు తన ఇల్లుగానే ఉన్న ఒక వాతావరణాన్ని పరిచయం చేయాలని అత్తగారు మరచిపోకూడదు.
9. అలాగే తను అడుగు పెట్టిన ఇంట అత్తగారు తన వయస్సు ఉన్నప్పటి నుంచి కాపురం చేసిందనీ, ఆమె అభిరుచులు ఆ ఇంటి నిండా నిండి ఉన్నాయని కొత్త కోడలు మరచిపోకూడదు.
10. ఇద్దరూ ఓర్పుగా తమ కొత్త బాంధవ్యాన్ని గౌరవంతో, ప్రేమతో అర్థం చేసుకోవాలి.
11. కోడలి సహకారం, ఆదరణతో కొడుకు జీవితం శోభాయమానంగా వెలగనున్నదని అత్తగారు తెలుసుకొని తీరాలి.
12. కోడలు, కొడుకు వాళ్ల భవిష్యత్తు కోసం నిర్మించుకోబోయే బంగారు కలను అత్తగారు ముందే కనాలి.
13. తన అనుభవంతో, ప్రేమతో, ఇష్టంతో వారికి స్వేచ్ఛనివ్వాలి.
14. వారు ఇరువురూ వేర్వేరు కాదనీ రెండు శరీరాలతో ఉన్న ఒక్కరేనని, ఈశ్వరుడు నిరూపించిన అర్థనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలి అత్తగారు.
15. కొత్త కోడలికి అన్ని విధాలా చేయూతగా నిలిచి ఆమె సంసారాన్ని సరిదిద్దుకొనే తర్ఫీదు ఇవ్వాలి.
16. కనిపెంచిన కొడుకు ఇష్టాఇష్టాలు ఆమెకే కదా తెలిసేది. అందుకే కోడలు అత్తగారి స్థానాన్ని గౌరవించాలి.
17. తన భర్తను కని, పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి ఒక మంచి వ్యక్తిగా పెంచి తనకు కానుకగా ఇచ్చిన అత్తగారిలో తల్లిని చూసుకోగలగాలి.

రెండు చేతులు చరిస్తేనే కదా చప్పట్లు వినబడేది. అలాగే ఇద్దరూ రెండు అరచేతులు. రెండూ స్నేహంగా కలిసి ఆ ఇంటికి వచ్చే బంధుమిత్రులని ఆహ్వానించగలగాలి. బాధ్యతలు మోయాలి. ఈ ఇద్దరే చక్కని కుటుంబానికి ఉదాహరణలు. అత్తా కోడళ్లది తల్లీ కూతుళ్ళను మించిన గొప్ప బాంధవ్యం అని అర్థం చేసుకోవాలి.

Family Relationships between Aunt, Daughter in law