Home ఎడిటోరియల్ సంపాదకీయం: వారసత్వాన్ని ఖరారు చేసిన కరుణానిధి

సంపాదకీయం: వారసత్వాన్ని ఖరారు చేసిన కరుణానిధి

Sampadakeeyam-Logoమన దేశంలో కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుండగా రాజకీయ కుటుంబ వ్యవస్థ, వంశపారంపర్య నాయకత్వం బలపడుతున్నది. ఇది ప్రజాస్వామ్యదేశంలో అప్రజాస్వామిక పోకడ అని నిందించవచ్చుగాని అది వాస్తవం. రాజకీయ వారసత్వాన్ని పార్టీ, ప్రజలు అంగీకరించినప్పుడు అది ప్రజాస్వామ్య సమ్మతమవుతోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వంశపారంపర్య రాజకీయానికి పుట్టిల్లు అనేది జగమెరిగిన సత్యం. ప్రాంతీయ ఆకాంక్షలతో ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు కొన్ని సమయానుకూల సిద్ధాంతాలు వల్లించినా అవి ప్రధానంగా వ్యక్త ప్రధాన పార్టీలు. అందువల్ల వాటి నాయకులు తాము వెలుగుతుండగానే తమ కుటుంబ సభ్యులకు రాజకీయ వారసత్వాన్ని ఖరారు చేస్తున్నారు. పంజాబ్‌లో ప్రకాశ్‌సింగ్ బాదల్, ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్, బీహార్‌లో లాలుప్రసాద్ యాదవ్, జమ్మూ-కాశ్మీర్‌లో ఫరూఖ్ అబ్దుల్లా ఇందుకు ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేశ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించటం ద్వారా నాయకత్వ వారసత్వాన్ని ఖరారు చేశారు. పరిపాలనా అనుభవం సంపాదించుకునే నిమిత్తం లోకేశ్‌ను త్వరలో మంత్రివర్గంలోకి తీసుకోనున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా కాస్త వెనకా ముందుగా ఈ సమస్యను పరిష్కరించక తప్పదు. ఎందుకంటే ఆయన కుటుంబం నుంచి ముగ్గురు- కొడుకు కెటిఆర్, బిడ్డ కవిత, మేనల్లుడు హరీశ్‌రావు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే ద్రవిడ ఉద్యమ పార్టీగా ఆవిర్భావం పొందిన డిఎంకె వాస్తవంలో వారసత్వ రాజకీయ పార్టీ కాదు. ఆ పార్టీ తొలి అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి.ఎన్.అన్నాదురై 1969 ఫిబ్రవరిలో మరణించినపుడు మంత్రివర్గంలో నెడుంజెళియన్ రెండవస్థానంలో ఉన్నారు. కాగా కరుణానిధి నాయకునిగా ఎన్నికై 1971 ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలో తెచ్చాడు. అయితే ఎం.జి.రామచంద్రన్ 1972 అక్టోబర్‌లో పార్టీని చీల్చి ఎఐఎడిఎంకెని ఏర్పాటుచేశాక డిఎంకె కష్టాలు మొదలైనాయి. 13 ఏళ్లు అధికారానికి దూరమైనా కరుణానిధి నాయకత్వం, నిర్మాణ దక్షత పార్టీని నిలబెట్టింది. 1987లో ఎంజిఆర్ మరణించాక, 1989 ఎన్నికల్లో డిఎంకె అధికారాన్ని తిరిగి చేజిక్కించుకుంది. అటుతర్వాత ఎఐడిఎంకె, డిఎంకెలు ఒకటి తర్వాత ఒకటిగా తమిళనాడును పరిపాలిస్తున్నాయి. 1996, 2006లో కరుణానిధి నాయకత్వంలో అధికారం పొందిన డిఎంకె, వరుసగా రెండు ఎన్నికల్లో (2011, 2016) ఓటమి పొందింది. ఐతే 2016 ఎన్నికల్లో డిఎంకె 100 సీట్లు గెలుచుకోవటంలో కుమారుడు స్టాలిన్ పాత్ర ప్రధానం. 93 ఏళ్ళ ముత్తువేల్ కరుణానిధి ఇక జాప్యం చేయదలుచుకోలేదు. తన అనంతరం (తాను ఉన్నన్నాళ్లు ఆయనే పార్టీ అధ్యక్షుడు) పార్టీ నాయకత్వ తగాదాలతో ఛిద్రం కాకుండా ఆయన ముందుచూపుతో ఇటీవల ఒక మేగజైన్ ఇంటర్వూలో ఇలా ప్రకటించారు “అతను జైల్లో ఎన్నో కష్టాలుపడ్డాడు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తూ పార్టీ భవిష్యత్ అధ్యక్షుడి స్థాయికి ఎదిగాడు. ఆ విషయంగా అతడు నేడు నా రాజకీయ వారసుడు అయినాడు”.
కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరికి అధికారంపై ఆశ ఉన్నా అవకాశాలు సృష్టించుకోలేకపోయాడు. తండ్రి అభిమానం, పార్టీ క్యాడర్ విశ్వాసం పొందటంలో విఫలమైనాడు. కేంద్రమంత్రిని చేసినా రాణించలేదు. స్టాలిన్‌తో పోటీలో వెనుకబడిన అళగిరి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకుగాను పార్టీనుంచి బహిష్కరణకు గురైనాడు. అంతకుముందు పెద్దకుమారుడు ఎంకె ముత్తు తండ్రితో తగాదాపడి పార్టీనుండి వైదొలిగి ఎఐఎడిఎంకెలో చేరి రాజకీయంగా అదృశ్యమైనాడు. కాగా కరుణానిధి కుమార్తె, రాజ్యసభ ఎంపి కనిమొళి నాయకత్వ పోటీకి ప్రయత్నించినప్పటికీ 2జి కుంభకోణం కేసు ఆమెను వెనక్కునెట్టింది. వాస్తవానికి 1990 వ దశకం నుంచే కరుణానిధి స్టాలిన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఆ కారణంగానే వైకో డిఎంకె నుంచి వైదొలిగి ఎండిఎంకె ఏర్పాటు చేసుకున్నాడు.