Saturday, April 20, 2024

నడిచే అరుణతార

- Advertisement -
- Advertisement -

ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తూ గడిపిన సాహసిక యాత్రికుడాయన. 93 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని యాన్ మిర్దల్ అక్టోబర్ 30వ తేదీన స్వీడన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. యాన్ తల్లిదండ్రులిద్దరూ నోబెల్ పురస్కార విజేతలే. తండ్రి గున్నర్ మిర్దల్ ఆర్థిక శాస్త్రవేత్త. ఆయనకు 1974లో నోబెల్ బహుమతి వచ్చింది. తల్లి అల్వామిర్దల్‌కు 1982 నోబెల్ శాంతి పురస్కారం లభించింది. అల్వా 1955 నుండి 1961 దాకా మనదేశంలో స్వీడన్ రాయబారిగా ఉన్నారు. నెహ్రూ కుటుంబంతో వీరికి మంచి అనుబంధం ఉంది. ఇందిరాగాంధీ, అల్వా స్నేహితురాళ్లు.
యాన్ స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో 1927లో జన్మించాడు. 1938లో వారి కుటుంబం, అమెరికాలోని న్యూయార్క్‌కు మారింది. యాన్ మన్‌హట్టన్‌లోని ప్రొగ్రెసివ్ ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యసించారు. తన సామాజిక పరిజ్ఞానానికి ఆ స్కూలు దోహదపడిందన్నారాయన. తిరిగి 1942లో తల్లిదండ్రులు స్వీడన్‌కు వెళ్లిపోయినా తాను అమెరికాలోనే కొంతకాలం ఉండిపోయాడు. యాన్ తన 16వ ఏట నుండే రాజకీయ చర్చలో పాల్గొనే వాడు. 1953లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెమొక్రటిక్ యూత్‌కు కార్యదర్శిగా హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ప్రపంచ యువ ఉత్సవాలను నిర్వహించాడు. 1960లో కమ్యూనిస్టు పార్టీని వదిలేసి స్వీడన్ వామపక్ష మేధావుల ప్రతినిధిగా కొనసాగాడు. కొంతకాలం పాత్రికేయుడిగా జీవితం కొనసాగించిన యాన్ మిర్దల్ రచయితగా, యాత్రికుడిగా తన భావజాల పరిశీలనకు, వ్యాప్తికి బతుకునంతా వినియోగించాడు.
రష్యాలో స్టాలిన్ తర్వాత వచ్చిన మార్పును ఈసడిస్తూ యాన్ మావో ఆలోచనలకు, చైనా సాంస్కృతిక విప్లవ ఫలితాలవైపు ఆకర్షితుడయ్యాడు. తన ఆలోచనలను పంచుకునేలా ఆయన సుమారు 60దాకా పుస్తకాలు రచించాడు. రాజకీయ విశ్లేషణ, కళలు, సాహిత్య విమర్శ, నవల, ఆత్మకథ, కవిత్వం, నాటకాలు ఇలా అన్ని ప్రక్రియల్లో రచనలు చేశాడు. స్వీడన్ టీవీల కోసం డాకుమెంటరీలను నిర్మించాడు.1962లో యాన్ తన భార్య గన్ టెస్లేతో కలిసి నెల రోజుల పాటు గ్రామీణ చైనాలో పర్యటించి 1965లో ‘రిపోర్టు ఫ్రమ్ ఎ చైనీస్ విలేజ్’ అనే పుస్తకం రాశాడు. టెస్లే పేరున్న ఫోటోగ్రాఫర్. ఆమె తీసిన ఫోటోలు యాన్ పుస్తకంలో అదనపు సమాచారం ఆకర్షణగా ఉంటాయి. చైనీయులు రోజువారి జీవన విధానం, చైనా విప్లవ కాలపు ప్రజల అనుభవాలు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను జనం మాటగా ఈ పుస్తకంలో వివరించారాయ. చైనా విప్లవ ఫలితాలు, పరిణామాలు, ప్రభావంపై లోతైన విశ్లేషణ చేసిన పుస్తకంగా ఇది నిలిచింది. అయితే, 1984లో ఆయన మరోసారి చైనా పర్యటించి “రిటర్న్ టు చైనీస్ విలేజ్’ అనే మరో పుస్తకం రాశాడు. ఇందులో మావో తర్వాతి చైనా పాలనపై విమర్శ వుంది. ప్రస్తుత పాలకులకు మావో సాంస్కృతిక విప్లవంపై అపనమ్మకం ఉందని, మావోదారి నుండి వారు తప్పుకుంటున్నారని రాశాడు.
1980లో యాన్ మనదేశం పర్యటించి ‘ఇండియా వెయిట్స్’ అనే పుస్తకం రాశాడు. భారతదేశం, ప్రజలు ఒక సమూల మార్పును కోరుకుంటున్నారని అందులో వివరించాడు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ పుస్తకంలోని అంశాలను చర్చించేందుకు ఆయన్ మిర్దల్‌ను ఇండియాకు ఆహ్వానించింది. అయితే ఆలోపు ఇందిర అకాల మరణం వల్ల వారి ములాఖత్ సాధ్యపడలేదని యాన్ ఓ చోట రాశాడు. ‘ఇండియా వెయిట్స్’ ఆందోళన రేకెత్తించే పుస్తకం.. దానిలో మనదేశ పాలన, నాయకులు, పోలీసు, జైళ్లు, లంచగొండితనం, పేదరికం, ప్రజల నిస్సహాయుత, ప్రతి ఇంటా చీకటి, ప్రతికంట కన్నీరే… కనిపిస్తుందని ప్రముఖ రచయిత కుశ్వంత్ సింగ్ హిందుస్తాన్ టైమ్స్‌లో రాశాడు. 1991లో యాన్ రాసిన ‘చైల్డ్ హుడ్’ తన బాల్యాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. తల్లిదండ్రులు తన పట్ల పుత్రవాతలాన్ని చూయించలేదని అందులో ఉంది. ఇందులో ఒకచోట బాలుడు తన తండ్రిలో ‘నీవు నా నిజమైన తండ్రివేనా!’ అని ప్రశ్నిస్తే తండ్రి మారు మాట్లడకుండా గదిలోంచి వెలుతూ విసురుగా తలుపు మూస్తాడు అని ఉంటుంది. నిజంగా కూడా యాన్ తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాడు. 1986లో అల్వా చనిపోయినా తండ్రితో గొడవ అవుతుందనే దృష్టితో యాన్ తల్లి అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదట. అయితే చైల్డ్ హుడ్’ మాత్రం స్వీడన్ క్లాసిక్‌గా సాహిత్యంలో చోటు పొందింది. 1994లో రాసిన ‘అనదర్ వరల్డ్’ ఒక ఆత్మకథాత్మక నవల. తల్లిదండ్రులు తన పట్ల చూయించిన నిరాదరణ. మానసిక హింసాత్మక ప్రవృత్తి. అశ్రద్ధ ఎలా ఉండేదో సోదాహరణతో పాటు, తన చదువు, స్కూలు, మిత్రుల గురించి కూడా ఇందులో ఉంది. చదివినవారుల్లా ఆయన పట్ల అయ్యోపాపం అనే సానుభూతి చూయిస్తారని దానిపై సమీక్షలొచ్చాయి. అల్బేనియన్ డిఫేంట్, ట్విల్వ్‌గోయింగ్ టు తర్టీన్, చైనా నోట్‌బుక్, గేట్స్ టు ఆసియా, ఎ డైరీ ఫ్రం ది లాంగ్ జర్నీ’, ది సిల్క్‌రోండ్ ఇలా ఎన్నో పుస్తకాల్లో తన పర్యటనా విశేషాలను, ఆలోచనా ధోరణులను ఆయన విశదీకరించాడు. 1968లో రాసిన కంఫెషన్స్ ఆఫ్ ఎ డిస్ లాయల్ యూరోపియన్’ అనే పుస్తకం ఆ సంవత్సరం మంచి 10 పుస్తకాల్లో ఒకటని కీర్తించబడింది. యాన్ రాసిన పుస్తకాల్లో భారతీయులకు సంబంధించిన మరో పుస్తకం ‘రెడ్ స్టార్ ఒవర్ ఇండియా’ ఇందులో మనదేశంలోని దండకారణ్యంలో మావోయిస్టు విప్లవోద్యమాన్ని వివరించాడు. యాన్ స్వయంగా ఆ పార్టీ నేతలను కలిసి మాట్లాడాడు. అక్కడి ప్రజలను కూడా పలకరించాడు. మనదేశ పుస్తక ప్రియుల నుండి దానికి మంచి స్పందన లభించింది. 2012లో కోల్‌కటా బుక్ ఫెయిర్ పాల్గొనేందుకు యాన్ భారతదేశాన్ని మరోమారు సందర్శించాడు. ఆ ఫెయిర్‌లో ఆయన ‘రెడ్‌స్టార్ ఓవర్ ఇండియా’ రెండో ముద్రణ విడుదలైంది. యాన్ ముందుగానే దాని ప్రతిని ఆనాటి కేంద్ర హోం మంత్రి చిదంబరంకు పంపాడు. దాని ఆధారంగా పబ్లిషర్ కోరిక మేరకు యాన్‌కు ఒక నెలకోసం కాన్ఫరెన్స్ వీసాల లభించింది. రెడ్‌స్టార్ ఓవర్ ఇండియా బెంగాలీ, హిందీ, పంజాబీ, తమిళ, తెలుగుభాషల్లోకి అనువాదమైంది. ఇంగ్లీషు నుండి జర్మన్, ఇటలీ భాషల్లోకి కూడా వెళ్లింది. అదే పర్యటనలో యాన్ హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. ఇఫ్లూలో రెడ్‌స్టార్ ఓవర్ ఇండియా తెలుగు అనువాదం ‘భారత్‌పై అరుణతార’ అనుభవాలు, ఆలోచనలు, ప్రతిపాదనలు పరిచయ సభలో ఆయన పాల్గొన్నాడు. అయితే ఆ పుస్తకంలో అంతే మావోయిస్టు నాయకులతో సంభాషణ, ఇంటర్వూ విశేషాలు. దండకారణ్యంలో వారు ఒక నూతన భారతదేశాన్ని నిర్మిస్తున్నారని నక్సలైట్లకు మద్దతుగా వ్యాఖ్యానం ఉండడంతో ఆయన పర్యటన ప్రభుత్వానికి కంటకింపుగానే అయింది. దేశంలో నిషేధిత తీవ్రవాద సంస్థకు బలం చేకూరేలా రాసీ, మాట్లాడే రచయిత పరటనను అనుమతించకూడదని రాజసభలో కూడా చర్చకు వచ్చింది. రచనాపరంగా యాన్ పుస్తకాలు స్వీడిష్, ఇంగ్లీషు సాహిత్యంలో మంచి ఆదరణను పొందాయి. రచయితగా ఆయన మరొకరు రాయడానికి సాహసించని విషయాలు రాశాడు. పాత్రికేయుడిగా రాజకీయ విశ్లేషకుడిగా స్థానిక రచయితలు బహిర్గతం చేయని చీకటి కోణాల్ని తన అక్షరాలతో బయటపెట్టారు. వయసుకు పర్యటన అడ్డం కాదన్నట్లు ఎనిమిది పదులు దాటినా దేశదేశాలు తిరిగారు. బాల్యం నుండే కమ్యూనిజంవైపు ఆకర్షితుడై నికార్సయిన వామపక్షభావాలను రికార్డు చేస్తూ వాటికి తగిన ప్రాచుర్యం ఇచ్చేవిధంగా జీవితం గడిపిన విలక్షణ మేధావి బహుగ్రంథకర్త యాన్ మిర్దల్.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన తల్లిదండ్రులకు సంతానమైన యాన్ జీవితం మరో కోణంలో వికసించి, జనం జీవన రీతుల్ని పరిశీలించడానికి కొండలు కోనలు తిరిగి భారత్, చైనా గ్రామీణ ప్రజల పట్ల అనురాగ బాంధవ్యాలు పెంచుకోవడంలో భిన్నత్వం కనపడుతుంది. మిర్దల్ అనగానే గున్నర్ లేదా అల్వా గుర్తొచ్చే చోట యాన్ తనదైన రీతిలో మిర్దల్ కొనసాగింపు ముద్ర వేశాడు. యాన్ రచనలన్నీ కుప్పబోస్తే తల్లిదండ్రుల కీర్తికేమీ తీసిపోడు.

బి.నర్సన్
94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News