Home తాజా వార్తలు కూతురి కోసం తల్లి సాహసం

కూతురి కోసం తల్లి సాహసం

Farheen

 

తన చిన్నారిపాప కోసం ఈ తల్లి చేసిన సాహసం ఇప్పుడు ప్రపంచం ముందుకు వచ్చింది. స్త్రీల స్వేచ్ఛపైన విపరీతమైన ఆంక్షలున్న పాకిస్తాన్ మహిళ పురుషుడి లాగా వేషం మార్చి జీవించటం మామూలు విషయం కాదు. లాహార్‌కు చెందిన ఫర్హీన్ ఈ కట్టుబాట్లను ఎంతో ధైర్యంతో పక్కన పెట్టింది. తన కూతురు రిడా జహ్రా కోసం రూపం మార్చుకుంది. లాహార్‌లోని అనార్కలీ బజార్‌లో సొంతంగా ఒక షాపు నిర్వహిస్తోంది. అలాగే మారు వేషంలో పురుషుడిలా ఒక టాక్సీ కూడా నడుపుతోంది. ఇదంతా ఆన్‌లైన్‌లో ప్రసారం కావడంతో ప్రపంచానికి ఆమె కథ తెలిసింది. 2016లో తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకొంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెను విడిచి పెట్టాడు.

కుటుంబ సహకారం లేకుండా ఆమె ఆస్పత్రిలో ఒంటరిగా పురుడు పోసుకుంది. ఆమెకు ఆపరేషన్ జరిగినపుడు, ఒకవేళ తను మరణిస్తే పుట్టిన బిడ్డను తన తల్లిదండ్రులకు ఇమ్మని ఆస్పత్రి అధికారులను కోరుకుంది. ఆమె ఆరోగ్యంగా బయట పడ్డాక ఎన్నో వ్యాపారాలు చేస్తూ వచ్చింది కానీ ఒంటరి స్త్రీలు అలా వీధుల్లో తిరిగి కష్టపడి పనిచేసే వాతావరణం ఎక్కడా లేదు. పురుషుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాక ఫర్హీన్ ఓ ఉపాయం ఆలోచించుకొంది. చక్కగా క్రాఫ్ చేయించుకొని టీషర్టు, జీన్స్ ప్యాంట్ ధరించి షాపు నిర్వహణ ప్రారంభించింది. కూతురితో కలిసి ఒక హాస్టల్లో ఉంటుంది.

ఆమె గురించి ఈ కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ లాహార్‌లో రాశారు. ఆమె కష్టాలు తెలిశాక ఎంతో మంది ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. రెండు లక్షల రూపాయలు విరాళం అందాయి. ఈ ప్రపంచంలో ఒంటరి మహిళ ధైర్యంగా జీవించాలంటే అవకాశాలు లేనే లేవు. అలాంటి సందర్భంలో ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. తనకు అందిన సాయంతో ఇప్పుడో కొత్త జీవితం మొదలు పెట్టబోతోంది.

Farheen Ishtiaq works at corner shop in Lahore