Home జాతీయ వార్తలు రేపు రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు

రేపు రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు

Farm Bills face Rajya Sabha test tomorrow

 

బల సమీకరణలో అధికార, విపక్ష పార్టీలు బిజీబిజీ
రసవత్తరంగా మారిన పెద్దల సభ రాజకీయం
కీలకంగా మారిన ప్రాంతీయ పార్టీల మద్దతు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభలో చర్చకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో సంస్కరణలకోసం ఉద్దేశించిన ఈ మూడు బిల్లులు అధికార పక్షానికి అవసరానికి మించిన సంఖ్యాబలం ఉండడంతో లోక్‌సభలో సునాయాసంగా గట్టెక్కగా రాజ్యసభలో ఆదివారం ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే రాజ్యసభలో ఈ బిల్లులు గట్టెక్కడం అధికారపార్టీకి అంత సులభం కాదు. గత మిత్రపక్షమైన శివసేనతో పాటుగా తాజాగా అకాలీద్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయనున్నాయి. అంతేకాకుండా అనేక సందర్భాల్లో మోడీ ప్రభుత్వానికి అండగా నిలచిన టిఆర్‌ఎస్ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటికి వ్యతిరేకంగా ఆ పార్టీ ఓటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంఖ్యాపరంగా చూసినట్లయితే అధికార ఎన్‌డిఎకి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది.

245 మంది సభ్యులున్న పెద్దల సభలో ప్రస్తుతం బిజెపికి సొంతంగా 86 సభ్యుల మద్దతు ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులుండగా, మిగతా స్థానాల్లో ప్రాంతీయ పార్టీల సభ్యులున్నారు. అయితే మిత్రపక్షాలతో కలుపుకొని తమకు 130మంది సభ్యుల మద్దతు లభిస్తుందని బిజెపి ధీమాగా చెప్తోంది. ముగ్గురు సభ్యులున్న అకాలీదళ్ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేసినా మిగతా పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టుకుంటామని లెక్కలు చెబుతోంది. అయితే రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా భావిస్తున్న ఈ బిల్లుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో రైతుల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఎపిలో అధికార పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీలు అవసరమైనప్పుడు తమకు మద్దతు ఇస్తాయని అధికార పార్టీ చెబుతోంది.

సభలో వైఎస్‌ఆర్ పార్టీకి ఆరుసీట్లు ఉండగా, టిఆర్‌ఎస్‌కు 7, బిజెడికి 9 సీట్లు ఉన్నాయి. అయితే ఈ బిల్లులు తేనెపూసిన కత్తిల్లాంటివని, రైతుల ప్రయోజనాలును దెబ్బతీసే విధంగా ఉన్నాయని శాసన సభలో అధికారికంగా ప్రకటించడంతో పాటుగా అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన టిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యసభలో ఈ బిలుల్లను గట్టిగా వ్యతిరేకించాలని తమ సభ్యులను ఆదేశించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ సభ్యుల మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, ఆమ్‌ఆద్మీపార్టీ లాంటి పార్టీల బిల్లులకు వ్యతిరేకంగా ఓటేస్తాయని కాంగ్రెస్ నమ్ముతోంది. సభలో బిఎస్‌పికి నలుగురు సభ్యులుండగా, సమాజ్‌వాది పార్టీకి తొమ్మిది మంది, ఆప్‌కు ముగ్గురు సభ్యులున్నారు.

అయితే బిల్లులను ఓడించాలంటే ప్రధాన ప్రాంతీయ పార్టీలయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజూ జనతాదళ్ పార్టీల మద్దతు కాంగ్రెస్‌కు తప్పనిసరి. ఈ పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్ ఇప్పటికే ఆ పార్టీలను సంప్రదించినప్పటికీ వాటి స్పందన ప్రోత్సాహకరంగా లేదని చెబుతున్నారు. ఇక మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో తమ భాగస్వాములైన శివసేన, ఎన్‌సిపిల మద్దతుపై కాంగ్రెస్ ఎక్కువ ఆశలే పెట్టుకుంది. శివసేనకు సభలో ముగ్గురు సభ్యులుండగా, ఎన్‌సిపికి నలుగురు సభ్యులున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేని సభలో ఏ ఒక్క పార్టీ అయినా తమ వైఖరిని మార్చుకున్నా ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఉంది.కరోనా, తదితర కారణాల దృష్టా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం సహా దాదాపు 25 మంది సభ్యులు సభకు హాజరయ్యే పరిస్థితులు లేవు. అదే జరిగితే అధికార పార్టీ సునాయాసంగా గట్టెక్కుతుంది. రైతులకు సంబంధించిన ఈ కీలక బిల్లుల విషయంలో ఏ పార్టీ వైఖరి ఏమిటో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి.

Farm Bills face Rajya Sabha test tomorrow