Home జాతీయ వార్తలు వ్యవసాయ బిల్లులతో ఆహార భద్రతకు గండి

వ్యవసాయ బిల్లులతో ఆహార భద్రతకు గండి

Farm bills undermine food security system

 

మోడీ సర్కారుపై కాంగ్రెస్ విమర్శ

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులతో దేశంలో ఆహార భద్రతను దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇటువంటి ప్రజా వ్యతిరేక బిల్లులను ఆదిలోనే ప్రతిపక్షాలు అంతా సంఘటితంగా ఎదుర్కొవల్సి ఉందని తెలిపింది. లేకపోతే ఇవి ఇప్పటి లోపాలతోనే చట్టాలుగా రూపొందుతాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. 2019 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కనీస మద్దతు ధరలు, ప్రజల వద్ద నుంచి సేకరణ, ప్రజా పంపిణీ వంటి వాటితో సరైన సమగ్రమైన ఆహార భద్రతకు తమ పార్టీ వాగ్దానం చేసిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఆహార భద్రతకు తూట్లు పొడిచేలా ఉందని ప్రధాని మోడీ, బిజెపి ప్రతినిధి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

వీరు దురుద్ధేశపూరితంగానే తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను వక్రీకరించారని తెలిపారు. రైతాంగ పక్షపాతిగా కాంగ్రెస్ వ్యవహరించిందని, ఈ విషయంలో బిజెపి ప్రచారం మసిపూసి మారేడు కాయ చందంగా ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పటి ప్రభుత్వం చివరికి వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కార్పొరేట్లు, వ్యాపారులకు సరెండర్ అయిందని ఈ మాజీ ఆర్థిక మంత్రి మండిపడ్డారు. ప్రస్తుత దశలో ప్రతిపార్టీ తగు విధంగా స్పందించాల్సి ఉందన్నారు. రైతుల పక్షాన ఉంటారా? లేక రైతుల పొట్టకొట్టే బిజెపి కొమ్ముకాస్తారా ఎవరికి వారే తేల్చుకోవల్సి ఉందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన మూడు కీలక బిల్లులను లోక్‌సభ శనివారం ఆమోదించింది.

వీటిని రాజ్యసభ ఆమోదానికి కేంద్రం ప్రవేశపెట్టనుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీకి స్వస్తి చెప్పే యోచన కాంగ్రెస్‌దే అనే బిజెపి వాదనను చిదంబరం తిప్పికొట్టారు. కేంద్రంలో వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటుక ఇటుక పేర్చినట్లుగా వ్యవహరించాయని, దేశంలో సరైన ఆహార భద్రతా వ్యవస్థకు పాటుపడ్డాయని చిదంబరం తెలిపారు. వీటి ఫలితంగానే 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం రూపుదిద్దుకుందని అన్నారు. ఆహార భద్రతకు కాంగ్రెస్ మూడు స్తంభాలను ఏర్పాటు చేసిందని, వీటిలో ఎంఎస్‌పి, నేరుగా ధాన్యం సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థలు కీలకంగా నిలిచాయని, దీనిపైనే ఆహార భద్రతా సౌధం ఏర్పాటు అయిందని విశ్లేషించి చెప్పారు.

Farm bills undermine food security system