Home జనగామ పెంబర్తిలో లభించిన లంక బిందె

పెంబర్తిలో లభించిన లంక బిందె

Farmer finds 5 kg gold found while levelling land

 

జనగాం: జిల్లాలోని పెంబర్తి గ్రామంలో రియల్టర్లు భూమిని చదును చేస్తుండగా ఐదు కిలోల లంకబిందె బయటపడడంతో ఆప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. పెంబర్తి గ్రామానికి చెందిన సంకటి నర్సయ్యకు సంబంధించిన 12 ఎకరాల భూమిని రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు ఇటీవలనే అమ్మారు. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్లు ఆ భూమిలో ఉన్న రాళ్లను చదును చేస్తున్నారు. అదేక్రమంలో గురువారం కూడా రాళ్లను తొలగిస్తుండగా పెద్ద బండరాయి కింద ఐదు కిలోల లంకబిందె బయటపడింది. ఆశ్చర్యానికి గురైన జెసిబి, ఇటాచ్‌డ్ డ్రైవర్లు రియల్టర్లకు, భూయజమానులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న భూయజమాని సంకటి నర్సయ్య బయటపడ్డ లంకబిందె వద్దకు చేరుకొని దాన్నిబయటకు తీశారు. ఆక్షణంలోనే ఆయనకు ఒక్కసారిగా దేవుడు పూనారు.

తేరుకున్న అనంతరం సంకటి నర్సయ్య రాగిబిందెలో ఉన్న ఐదు కిలోల బంగారాన్ని వెలికితీసి చూడగా దేవదేవతలకు సంబంధించిన ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో కాళ్ల కడాలు, మట్టెలు, పుస్తెలు అన్నిరకాల ఆభరణాలు కళ్లు జిగేల్‌మనే రీతిలో ఉన్నాయని ఇక్కడికి తరలివచ్చిన గ్రామస్తులకు సూచించారు. ఈ బంగారంతో ఇక్కడే దేవతకు గుడి కట్టిస్తానని సంకటి నర్సయ్య చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామసర్పంచ్ అనిల్‌గౌడ్‌లు అక్కడికి చేరుకున్నారు. అక్కడ లభించిన ఐదుకిలోల లంకబిందెను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ఈసందర్భంగా సర్పంచ్ అనిల్‌గౌడ్ మాట్లాడుతూ.. కాకతీయుల సామ్రాజ్యంలో పెంబర్తి గ్రామం కేంద్రంగా ఉండేదన్నారు. వారి పరిపాలనలో ఈ బంగారు ఆభరణాలు, ఇక్కడ దాచినట్లుగా తాము భావిస్తున్నామన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే స్థలంలో శివలింగం లభించిందని దాన్ని బట్టి అప్పుడే తవ్వకాలు జరుపుతుంటే ప్రభుత్వం అడ్డుకుందన్నారు.

ప్రస్తుతం రియల్టర్లు పనులు చేస్తున్న సందర్భంలో రాగి లంకబిందె బయటపడినందున ఇలాంటి బంగారు నిధులు ఇదేస్థలంలో భారీగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంతంలో లోతైన తవ్వకాలు జరిపితే మరిన్ని నిధులు బయటపడే అవకాశం ఉందని అనిల్‌గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం లభించిన బంగారంతో గుడి నిర్మించి దేవతకు ఆభరణాలను తొడుగుతామని అందుకు ప్రభుత్వం సహకరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే లంకబిందెలు లభించాయన్న సమాచారం గుప్పు మనడంతో ఆప్రాంతానికి చుట్టూపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి దేవతామూర్తుల ఆభరణాలు లభించడం మహిమానిత్వమేనని దేవతలకు పూజలు చేయడం మొదలు పెట్టారు.

ఇదేస్థలంలో గుడి నిర్మించాలని చుట్టూపక్కల గ్రామప్రజలు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కాకతీయుల పరిపాలనతో పాటు సర్దార్‌సర్వాయి పాపన్న ఏలుబడిలో కూడా పెంబర్తి, భువనగిరి కోటలను తన నివాసాలుగా మార్చుకొని గోల్కొండ కోటపై యుద్ధం చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అదేసందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఈప్రాంతంలో దాచి ఉంచాడని మరొక కథనాన్ని వివరిస్తున్నారు. లభించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పురావస్తు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఆప్రాంతాన్ని మరింత పరిశోధించిన తరువాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Farmer finds 5 kg gold found while levelling land in Jangaon