Home ఆఫ్ బీట్ పెయింటింగ్స్ అమ్మి…. తెలంగాణ పల్లెల్లో పరిశోధన

పెయింటింగ్స్ అమ్మి…. తెలంగాణ పల్లెల్లో పరిశోధన

శంకర్ కాటేకర్ సన్నకారు రైతు. వర్షాధారం మీద పత్తి పండిస్తున్నాడు. సకాలంలో వానల్లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అలాంటి సమయంలో సర్కారు ఆ ప్రాంతంలో కొన్ని బావులు మంజూరు చేసింది. అలా శంకర్ పొలంలో కూడా ఒక బావిని తవ్వితే, అతడి అదృష్టం బాగుండి పది అడుగులకే నీళ్లు పడ్డాయి. అలా రెండేళ్లు సాగునీరుకి లోటు లేకుండా సాగు చేసుకోసాగాడు. ఆ తరువాత బావి ఎండి పోయి, మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. మరి కొంచెం తవ్వితే నీరొస్తుందని అధికారుల చుట్టూ తిరిగాడు. వారు పట్టించుకోలేదు. అంతకు మించి తవ్వడానికి రూల్స్ ఒప్పుకోవన్నారు. తెలిసిన బంధువుల దగ్గర అప్పులు చేసి 10 అడుగుల వరకు తవ్వాడు కానీ నీళ్లు పడలేదు, పంటలు పండక నష్టం వచ్చింది. అప్పులిచ్చిన వారు వెంట పడ్డారు. అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్నాడు. కొంతకాలానికి, నష్ట పరిహారంగా మహారాష్ట్ర ప్రభుత్వం తొలివిడతగా  40వేలను ఆ రైతు భార్య అంజన చేతిలో పెట్టింది. ఆ డబ్బుతో ఆమె బావిని బాగుచేసుకొని సాగు చేస్తోంది. ఆ నలభై వేలను సర్కారు ముందే ఇస్తే బావి బాగుపడేది, నా భర్త దక్కేవాడు కదా?’ అని అమాయకంగా అడుగుతుంది అంజన. ఇలాంటి కథనాలతో మొదలవుతుంది ’ విడోస్ ఆఫ్ విదర్భ’ అనే పుస్తకం. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని  రైతు కుటుంబాల జీవన చిత్రం ఇది. స్వతంత్ర పరిశోధకురాలు, రచయిత్రి కోట నీలిమ రాసిన పుస్తకమిది. విదర్భకు తెలంగాణకు మధ్య కేవలం సరిహద్దు రేఖ తప్ప రైతుల సమస్యలు మామూలే. తెలంగాణలో సాగు సమస్యలు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆమె ’ సకుటుంబం’తో ముచ్చటించింది.

farmer problems in telangana

రైతన్నల వైపు దృష్టి: దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు తెలుసా? ఆత్మహత్యల వెనుకున్న వాస్తవాలేంటీ? ఇలాంటివే మీడియాలో బ్యానర్లు గా రావాలి. వీటి గురించి ప్రత్యేక కథనాలు రావాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. ఇలాంటి నిజాన్ని రాయాలంటే పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే పనిచేస్తున్న మీడియా సంస్థకు రాజీనామా చేయాలనుకున్నాను. కానీ ఉద్యోగం మానేసి, పూర్తిగా రైతుల ఆత్మహత్యలపై రీసెర్చ్ చేయాలంటే, మరో ఆదాయ మార్గం కావాలి, అందుకే కుంచె పట్టాను.”

పెయింటింగ్స్ ఆదాయంతో పరిశోధన: తైలవర్ణ చిత్రాలు గీయడం నాకు తెలసిన విద్య. ఉపనిషత్తులు చెప్పే సారాన్ని వర్ణ చిత్రాల్లో అద్భుతంగా చూపిస్తారు. దేశవిదేశాల్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ పెడ్తుంటాను. చాలామంది వాటిని కొంటారు. నా రీసెర్చ్‌ల కోసం ఖర్చుపెట్టడానికి అలా వచ్చిన ఆదాయం ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యాను. దీనికి ముందు మన దేశ వ్యవసాయ సమస్యలు, నష్టాలు మీద వచ్చిన పుస్తకాలు, పరిశోధనలన్నిటినీ చదివి అవగాహన పెంచుకున్నాను. రీసర్చ్‌నంతా పాఠంలా, గణాంకాలతో చెబితే ప్రజలకు అర్థం కాదు. అందుకే, వాటిని కథలుగా, నవలల రూపంలో మలిచాను. అలా రాసిన తొలి పుస్తకం ”రివర్‌స్టోన్స్‌”. రైతుల ఆత్మహత్యలను, వ్యవసాయాన్ని ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో ఈ పుస్తకంలో చెప్పాను.

మీడియాలో రాని కథనాలతో: నా రెండవ పుస్తకం డెత్ ఆఫ్ ఎ మనీలెండర్‌” 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్ స్ట్రీం జర్నలిజం మీద రాసిన పుస్తకమది. మూడో పుస్తకం “షూస్ ఆఫ్ ది డెడ్‌” పల్లెల్లో, నగరంలోని యువతరం మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు దర్పణం పట్టే ప్రయత్నం చేశాను.”

రైతు ఆత్మహత్య చేసుకుంటే? : “అప్పుల బాధలు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. రైతు చేసిన అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల బతుకు పోరాటాన్ని కేస్‌స్టడీస్‌గా మలిచి ఇటీవల “విడోస్ ఆఫ్ విదర్భ”గా పుస్తకం రాశాను. ఇది రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు వంద కేస్‌స్టడీస్ తీసుకున్నా, అందులోంచి పద్దెనిమిది ఎంచుకొన్నాను. ఆ పద్దెనిమిది మంది మహిళల బతుకుల్లో వైవిధ్యం ఉంది. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్ చేస్తు, ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. వాళ్లకున్నంత ఆత్మవిశ్వాసం నగరాల్లో ఉద్యోగాలు చేసే ఆధునిక స్త్రీలకు కూడా ఉండదనిపిస్తుంది. అతి సామాన్య స్త్రీలు. వారికి చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థిక అండలేని వాళ్లు.. అయినా వాళ్లు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. వాళ్ల భర్తలు లాగే వారు కూడా బలవన్మరణాలు పాలైతే వారి బిడ్డల పరిస్థితేంటి?” అనేవి నా పుస్తకంలో వివరించాను.

దేశవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో మహారాష్ట్రలోనే అరవై వేలకు పైగా జరిగాయి. విదర్భ ప్రాంతంలో ఎక్కువ జరిగాయి. అందుకే నా పరిశోధన ఇక్కడ నుండి మొదలు పెట్టాను.

ఆదిలాబాద్ నుండి అధ్యయనం : ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, వలసల గురించీ, చేనేత కార్మికుల అవస్థలు, అధ్యయనం చేయడానికి సిద్ధపడుతున్నాను. తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ఈ సమస్యలను సర్కారీ కోణం నుండి చూస్తే ఒకలా, స్వతంత్ర పరిశోధకురాలిగా చూస్తే మరోలా కనిపిస్తాయి. నేను ఎవరి ఫండింగ్‌తో పరిశోధన చేయడం లేదు కాబట్టి నిజాలు రికార్డు చేస్తాను. క్షేత్రస్థాయిలో ప్రజలను కలుసుకున్నపుడే, అసలు వాస్తవాలు తెలుస్తాయి. కొన్ని సమస్యలతో రైతు ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ భర్తను కోల్పోయిన ఆ భార్య వంద సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె పేరున భూమి ఉండదు. బ్యాంకులు ఆమెకు రుణాలివ్వవు, విత్తనాలు, ఎరువుల కోసం వెతుక్కోవాలి. వ్యవసాయంలో భర్తకు ఉన్న అనుభవం ఆమెకు ఉండదు, ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఎలా జీవనాన్నిసాగిస్తుంది? అనే దిశగా నా పరిశోధన సాగుతుంది. ముందుగా ఆదిలాబాద్ జిల్లా నుండి మొదలు పెడతాను.

పల్లెల కోసం ’స్టూడియో అడ్డా’ : తెలంగాణ పల్లెలన్నీ తిరిగి వారి సమస్యలు రికార్డు చేస్తున్నాను. “స్టూడియో అడ్డా” అనే సంస్థనూ స్థాపించి.. సామాజిక వేదికగా మలిచాను. ఎవరైనా ఆ సంస్థలో ఎన్‌రోల్ చేసుకోవచ్చు.గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చించుకోవచ్చు.

పాత్రికేయురాలిగా : మా సొంతూరు విజయవాడ. పెరిగింది ఢిల్లీలో. తండ్రి రామశర్మ నేషనల్ హెరాల్డ్ జర్నలిస్టుగా పనిచేశారు. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకున్నాను. ఢిల్లీలో చదువుకున్నాను.

అమెరికాలో పీహెచ్‌డీ చేశాను. “ది స్టేట్స్‌మన్‌” “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌” లో పాత్రికేయురాలిగా పనిచేశాను. బయటకు వచ్చి, ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా కొన్ని పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాను. నా పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్‌కే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు. త్వరలో నా పుస్తకాలను మరాఠీ, తెలుగులో తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. వందకు పైగా గ్రామాలు తిరిగి, రైతుల భార్యలను కలిశాక నాకు తెలిసిన ముఖ్యమైన అంశం ఏమంటే భర్త చేసిన తప్పులు తాము చేయకుండా వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, సాగు పై ఆదాయాన్ని అప్పులు మింగేయకుండా చూసుకుంటున్నారు.

మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి