Home తాజా వార్తలు సిఎం క్యాంపు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

సిఎం క్యాంపు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

Cm Camp Office

మన తెలంగాణ/సోమాజిగూడ : తనకు నష్ట పరిహారం ఇవ్వకుండా మోసం చేశారన్న మనస్థాపంతో ఓ పేద రైతు కుటుంబం సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన సోమవారం క్యాంపు కార్యాలయం ఎదుట జరగడంతో పోలిసులు నానా హైరానా పడ్డారు. ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా, ఇబ్రహింపట్నంకు చెందిన ఐలేష్‌కు 1979 లో సంక్రమించిన 5 ఎకరాల భూదాన్ భూమి ఉంది. 2010 అప్పటి ప్రభుత్వం అక్కడ నెషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎజెన్సీ కోసం స్థల సేకరణ చేపట్టారు. ఇబ్రహీంపట్నం సమీపంలో రైతు ల భూములను సేకరించారు. రైతులకు అందుకు నష్ట పరిహారంగా ఎకరానికి రూపాయలు ఐదులక్షల నలభై వేల రూపాయల లెక్కన ఐదు ఎకరాలకు 27లక్షల మూపై ఐదు వేల రూపాయలను ప్రభుత్వం రైతు ఐలేష్‌కు మంజూరు చేసింది.

అదే సమయంలో ఇబ్రహీంపట్నంకు చెందిన విజయ్ కుమార్ ,అనిల్ కుమార్ ,సునీల్ కుమార్‌లు బినామి పేర్లతో రైతు ఐలేష్ కు రావాల్సిన సొమ్మును అన్యాయంగా కాజేశారు. దీంతో విషయం తెలుసుకున్న ఐలేష్ తనకు జరిగిన అన్యాయానికి, 2010లో ఇబ్రహీం పట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పోలీసుల నుంచి ఐలేష్ ఎలాంటి న్యాయం దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనాడు. అప్పటినుంచి నేటి వరకు తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో అందరి అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టు తిరిగిన న్యాయం జరగకపోవడంతో మరో గత్యంతరం లేక తనకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళి తనకు న్యాయం చేయాలని సోమవారం తన భార్య ,ముగ్గురు పిల్లలతో కలసి సీఎం కార్యాలయంకు చేరుకున్నాడు. అక్కడ ఎవ్వరిని కలవాలో తెలియక తనకు న్యాయం జరగదని గ్రహించి తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కిరోసిన్ పోసుకోని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆతనికి నచ్చచెప్పి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Farmer Suicide Attempted At Cm Camp Office