ఎర్రకోట సంఘటనపై హోంశాఖ సీరియస్
22 ఎఫ్ఐఆర్లు నమోదు, 37 మంది రైతు నేతల పేర్లు, అమిత్‌షా ఉన్నతస్థాయి సమీక్ష
ఉద్యమం నుంచి తప్పుకున్న 2 రైతు సంఘాలు
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గణతంత్ర దినోత్సవం నాడు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఉద్రిక్తతలకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమై నగరంలో భద్రతా పరిస్థితి, శాంతిని కాపాడడానికి తీసుకున్న చర్యలపై సమీక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హోంమంత్రి నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించినట్లు హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.
నిర్ణయించిన రూట్లలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి, ఆ హామీని నిలబెట్టుకోని రైతు సంఘాల నేతలపై పోలీసులు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని మరో అధికారి చెప్పారు. అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హోం శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గల అవకాశాలపై న్యాయ శాఖ సలహాలు కూడా తీసుకొన్నట్లు తెలుస్తోంది. కారకులను సిసి టీవీ ఫుటేజి ఆధారంగా గుర్తించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శి ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం నాటి సంఘటనల నేపథ్యంలో హింస జరిగిన ప్రాంతాల్లో బుధవారం అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు ఢిల్లీ పోలీసులు హోం శాఖకు నివేదిక అందజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఢిల్లీ పోలీసులకు సహకరించడం కోసం కేంద్రం ఇప్పటికే దాదాపు 4,500 మంది పారా మిలిటరీ బలగాలను మోహరించింది.
ఎఫ్ఐఆర్లలో 37మంది రైతు నేతల పేర్లు
ఇదిలా ఉండగా ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఐటిఓ వద్ద చెలరేగిన హింసాకాండలో ఆరు బస్సులు, ఐదు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయనిఈ సంఘటనకు సంబంధించిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 600 ట్రాక్టర్లలో పది వేల మందికి పైగా ఆ ్రప్రాంతంలోకి దూసుకు వచ్చినప్పుడు పలువురు పోలీసులు గాయపడ్డారని, 70 ఇనుప బారికేడ్లు ధ్వంసమయ్యాయని కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పడానికి పోలీసులు ప్రయత్నించారని, అయితే ఆందోళనకారులు ల్యుటెన్ ఏరియాకు వెళ్లి తీరుతామని మొండిగా పట్టుబట్టారని, వారు మీడియా సిబ్బందికి చెందిన వాహనాలు, ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ హింసాత్మక ఘటనల్లో దాదాపు 300 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం. అల్లర్లకు సం బంధించి ఇప్పటికే 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలకు సంబంధించి పోలీసులు మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా ఎఫ్ఐఆర్లలో 37 మంది రైతుల నేతల పేర్లను పోలీసులు పేర్కొన్నారు. వీరిలో దర్శన్పాల్, యోగేంద్ర యాదవ్ తదితరుల పేర్లున్నాయి.