Home తాజా వార్తలు శ్రీశైలం నిండుగ రైతులకు పండుగ

శ్రీశైలం నిండుగ రైతులకు పండుగ

 Srisailam project

 

883 అడుగులకు చేరుకున్న శ్రీశైలం నీటిమట్టం

కృష్ణమ్మ నిండుగా పారుతుండడంతో పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టులలో పూర్తి స్థాయి నీటిమట్టంతో పాటు అదనంగా వరద వస్తుండడంతో శ్రీశైలం తిరుగుజలాల మీద ఆధార పడ్డా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. జూరాల ప్రాజెక్టు మీద ఆధార పడ్డా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 2,250క్యూసెక్కుల నీటిని ప్రతి రోజు ఎత్తిపోస్తున్నారు. భీమా లిఫ్ట్ 1 ద్వారా ప్రతి రోజు 1300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా 630 క్యూసెక్కుల నీటిని ప్రతి రోజు ఎత్తిపోస్తున్నారు. అదే విధంగా జూరాల కుడి కాలువ ద్వారా 750 క్యూసెక్కులు భీమా లిఫ్ట్ 2 ద్వారా 750 క్యూసెక్కుల నీటిని ప్రతి రోజు ఎత్తిపోస్తున్నారు.

పాజెక్టులో నీటి నిల్వ 205.2258 టిఎంసీలు
నిండుకుండలా జూరాల.. 316.47 మీటర్లకు చేరుకున్న కృష్ణమ్మ
9.657 టిఎంసీల నీరు నిల్వ
5 లక్షల 93 వేల 725 క్యూసెక్కుల ఔట్ ఫ్లో
పాలమూరు సాగునీటి ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఎత్తిపోత
భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతలకు జలకళ

నాగర్‌కర్నూల్ : అదే విధంగా శ్రీశైలం తిరుగుజలాలపై ఆధారపడ్డ మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి రోజు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మోటర్లను నడిపి ప్రతి రోజు 3200 క్యూసెక్కుల నీటని నాలుగు మోటర్ల ద్వారా ఎత్తిపోసే అ వకాశం ఉంది. అధికారులు ఇప్పటికే మూడు మోటర్లను నడిపి ప్రతి రోజు 2400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం ద్వారా కెఎల్‌ఐ మొద టి రిజర్వాయర్ ద్వారా జొన్నలబోగుడ, సింగోటం రిజర్వాయర్‌లోకి ఇప్పటివరకు సుమారు 2 టిఎంసీల నీటిని ఎత్తిపోశారు.

జొన్నలబోగుడ రిజర్వాయర్ పూర్తి సామర్థం 2.17 టిఎంసీలు కాగా ఒకటిన్నర టిఎంసీల నీరు చేరిన వెంటనే మూడో లిఫ్ట్ ద్వారా గుడిపల్లి గట్టు రిజర్వాయర్‌లోకి నీటిని వదలడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా రాయలసీమా పరిధిలోకి వచ్చే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యూలేటర్ ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.అదే విధం గా ముచ్చుమర్రి ద్వారా కెసి కెనాల్‌కు 735 క్యూసెక్కులు, హాంద్రినివా సుజలస్రవంతి ద్వారా 2363 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. దీంతో శ్రీశైలం తిరుగుజలాల పై ఆధారపడ్డ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది.

కృష్ణా బేసిన్‌లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానది నిండుకుండను తలపిస్తు ప్రవహిస్తుంది. కృష్ణానదికి వరద రావడానికి 15 రోజులు ఆలస్యమైన కర్ణాటక, మహారాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద ఉదృతి కూడా తీవ్రంగానే ఉంది. అలమట్టి, నారాయణపూర్ డ్యాంలు పూర్తి స్థాయిలో నిండడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ వరదల కారణంగా ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రాంలోని ప్రాజెక్టు సైతం పూర్తిగా నిండి నిండుకుండను తలపిస్తున్నాయి. అలమట్టి ద్వారా 5 లక్షల 35వేల క్యూసెక్కుల నీటిని దిగువ నారాయణపూర్‌కు వదులుతున్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్ధం 89.294 టిఎంసీలు. ఇటివల దీని ఎత్తును పది అడుగులు పెంచడంతో ఈ ఏడాది 123 టిఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. నారాయణపూర్ పూర్తి సామర్ధం 489.29 మీటర్లు కాగా అక్కడి నుంచి అలమట్టి నుంచి 6 లక్షల 15వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. అక్కడి నుంచి జూరాలకు 5 లక్షల 90 వేల వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు 45 గేట్లను ఎత్తి దిగువకు 5 లక్షల 93వేల 725 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. ఎగువన వర్షాలు వస్తుండడంతో మరో వారం రోజుల పాటు వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కోంటున్నారు. వరద ఇలాగే కొనసాగితే కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులన్ని నిండే అవకాశం ఉంది. దీంతో పాటు 300పై చిలుకు టిఎంసీల సామర్ధం కల్గిన నాగార్జున సారగ్‌లో సైతం ఆశాజనకంగా నీరు చేరే అవకాశాలు ఉన్నాయి.

శ్రీశైలం జలాశయం నిండుకుండగా మారడం, ప్రాజెక్టు పది గేట్లు ఎత్తడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. సెలవులు కావడంతో శని, ఆది, సోమవారం వరకు లక్షలాదిగా పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించుకునే అవకాశాలు ఉన్నాయని అధికారుల పేర్కోంటున్నారు. పూర్తి స్థాయిలో శ్రీశైలం ప్రాజుక్టులోకి నీరు చేరడం పది గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తడంతో కృష్ణమ్మ సోయగాలను తిలకించడానికి పర్యాటకులు ఉత్సాహంతో ఉన్నారు.

ప్రాజెక్టు నుంచి జాలువారుతున్న నీటి దృశ్యాలను కనులార విక్షీంచాలన్న కారణంతో పర్యాటకులు శ్రీశైలంకు చేరుకుంటున్నారు.దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ఘాట్‌రోడ్డు ట్రాఫిక్ జాంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సివచ్చింది.తెల్లవారు జామునుంచే తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది.

Farmers are happy with Srisailam project filled with Water