చండీగఢ్: కేంద్రం ఆమోదించిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ పంజాబ్లో రైతులు బుధవారం లోహ్రీ పండుగ నాడు చట్టానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేశారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ తరహాలోనే పంట చేతికి వచ్చిన సందర్భంగా లోహ్రీ పండుగను పంజాబ్, హర్యానా, ఉత్తర భారతంలోని ఇతర రాష్ట్రాలు జరుపుకుంటాయ. ఈ సందర్భంగా భోగి మంటలు కూడా ప్రజలు వేస్తారు.
వివిధ రైతు సంఘాలకు చెందిన రైతులు పంజాబ్లోని అనేక ప్రాంతాలలో భోగి మంటలు వేసి అందులో కొత్త వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేశారు. బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్లను అంగీకరించాలని వారు డిమాండు చేశారు. అమృత్సర్లోని పందర్గలాన్ గ్రామంలో కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేతృత్వంలో మహిళలతోసహా పెద్ద సంఖ్యలో రైతులు నిరసనలో పాల్గొన్నారు.