Saturday, April 20, 2024

బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం

- Advertisement -
- Advertisement -

మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల నాయకులతో కేంద్రం జరుపుతున్న చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. శనివారం దాదాపు నాలుగున్నర గంటలు చర్చలు జరిపినప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రైతు సంఘాలు ఒక అంగీకారానికి రాలేకపోవడంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ నెల 9న (బుధవారం) మరో దఫా చర్చలకు కేంద్రం ప్రతిపాదించగా అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించారు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవడమే తమ ప్రధాన డిమాండ్ అని చెబుతున్న రైతు సంఘాలు ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో మరింత వివరణతో ముందుకు వచ్చేందుకు కేంద్రం సమయం కోరినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 8వ తేదీన భారత్ బంద్ ముందు ప్రకటించిన విధంగా కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు రాకేశ్ తికాయత్ చర్చల అనంతరం విలేఖరులకు చెప్పారు.
శనివారం చర్చల్లో ప్రధానంగా రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాయింట్ల వారీగా వివరణను 35 రైతు సంఘాల ప్రతినిధుల ముందుంచినట్లు సమాచారం. వాటిని పరిశీలించిన రైతు నేతలు తాము ప్రధానంగా డిమాండ్ చేస్తున్న కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటారో లేదో చెప్పాలని నిలదీసినట్లు చెప్పారు. అయితే వీటిని రద్దు చేసే పరిస్థితి లేదని, రైతు సంఘాలు అభ్యంతరం తెలిపిన ఎనిమిది అంశాల్లో ప్రధానంగా ఎనిమిదింటిపై సవరణలు తీసుకు వచ్చేందుకు సిద్ధమని ప్రభుత్వం తెలిపినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గని రైతు నేతలు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు చర్చలనుంచి వెళ్లిపోతామని కూడా వారు ఒక దశలో హెచ్చరించారు. అయితే మరిన్ని ప్రతిపాదనలతో ముందుకు వచ్చేందుకు మరికొంత సమయం కావాలని మంత్రులు వారికి నచ్చజెప్పడంతో చర్చలకు రైతు సంఘాల నేతలు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న జరిగే తదుపరి చర్చల్లో కేంద్రం ఏ విధమైన ప్రతిపాదనలు, వివరణలతో ముందుకు వస్తుందో వేచి చూడాలి.
మరో వైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 10 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 8న జరపతలపెట్టిన భారత్ బంద్‌ను వాయిదా వేసుకోవలసిందిగా కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ కోరినా వారు అందుకు ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో పాల్గొంటున్న వృద్ధులు, చిన్న పిల్లలను ఇళ్లకు పంపించేయాలన్న మంత్రి విజ్ఞప్తిని కూడా వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. వ్యవసాయ చట్టాల రద్దు, తమ డిమాండ్లను అంగీకరిస్తేనే ఆందోళనను విరమిస్తామని వారు మంత్రికి స్పష్టం చేశారు. తమ ఆందోళనను ఎంతకాలమైనా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. తాము ఎలాంటి హింసకు పాల్పడడం లేదన్నారు. ‘ఆందోళన స్థలంలో మేము ఏం చేస్తున్నమో ఇంటెలిజన్స్ బ్యూరో మీకు సమాచారం ఇస్తుంది. మేము రోడ్లపైనే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు’ అని రైతు సంఘాల నేతలు మంత్రులకు స్పష్టం చేశారు.
పురోగతి ఉన్నందునే చర్చలకు అంగీకరించాం: రైతు నేతలు
తమ శాంతియుత ఆందోళనను ప్రభుత్వం అభినందించిందని రైతు పోరాట సమితి నాయకులు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నిరసన తెలపడంపై కేంద్రం అభినందించిందని వారు చెప్పారు. తదుపరి చర్చల్లో నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తామని కేంద్రం చెపిందని, ఈ నెల 9న చర్చలకు ఎలాంటి ప్రతిపాదనలతో వస్తారో చూడాల్సి ఉందన్నారు. తమ డిమాండ్ల సాధనలో కొంత పురోగతి ఉన్నందునే ఈ నెల 9న చర్చలకు అంగీకరించామని వారు తెలిపారు. అప్పటిదాకా శాంతియుత ఆందోళనలు, 8న భారత్ బంద్ కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు.

ఆందోళన విరమించాలని కోరుతున్నా: తోమర్
‘ఈ ఎముకలు కొరికే చలిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడం కోసం, అలాగే ఢిల్లీ పౌరులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వారు తమ ఆందోళన బాటను విరమించాలని కోరుతున్నా’ అని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చల అనంతరం మీడియాతో అన్నారు. మీ అన్ని అంశాలను పరిశీలిస్తామని తాను రైతు నాయకులకు చెప్పానని,రైతు నాయకులనుంచి కూడా సూచనలు వచ్చిన పక్షంలో పరిష్కారం కనుగొనడం తమకు సులభమవుతుందని కూడా ఆయన చెప్పారు.

Farmers call for Bharat Bandh on Dec 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News