Friday, April 26, 2024

అసలు సమస్య మద్దతు ధరే!

- Advertisement -
- Advertisement -

Farmers concerned that no Minimum Support Price for Crops

 

చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని ఉధృతికి ఎప్పటికప్పుడు నూతన కార్యాచరణను ప్రకటిస్తూ ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం ఒక వైపు చర్చల పట్ల ఆసక్తిని కనబరుస్తున్నట్టు కనిపిస్తూనే తన మొండి చెయ్యి వైఖరితో వాటిని మోడువారుస్తున్నది. అదే సమయంలో రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే పదేపదే ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ మంత్రి తోమర్ అయితే ఈ ఉద్యమం వెనుక చైనా అనుకూల భారత వ్యతిరేక శక్తులున్నాయని రైతు నేతలకు రాసిన లేఖలోనే ఆరోపించారు. ఆ లేఖకు విస్తృత ప్రచారం కల్పించారు. ఆందోళనలో ఖలిస్థానీయులు ఉన్నారనే బరి తెగింపు ప్రచారం కూడా జరిగింది. రైతులు ఈ ఉద్యమానికి సమకట్టినప్పుడుగాని ఇప్పుడుగాని రాజకీయ పార్టీలతో, ఇంకే బయటి శక్తులతో తమంత తాముగా సంబంధాలు పెట్టుకున్న జాడలు లేవు.

కొత్త చట్టాల వల్ల వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ రద్దు అయిపోయి తమ శ్రమ ఫలితమంతా కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసిన దుస్థితి నెలకొంటుందని, తమ కాళ్ల కింది భూమి కదిలిపోతుందని, పంటలకు కనీసమద్దతు ధర లోపిస్తుందని అమిత ఆందోళనకు గురై పంజాబ్, హర్యానా రైతులు ఆందోళన ప్రారంభించి ఉధృతం చేయడంతో దేశమంతటా గల రైతు సంఘాలు, వ్యవసాయదారుల శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు వారికి మద్దతుగా సమీకరణ అయ్యారు. పలు నదులు కలిసి మహా సాగరమైన దృశ్యం ఢిల్లీ సరిహద్దుల్లో సాక్షాత్కరించింది. ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రభావవంతమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను పార్లమెంటు లోపలగాని, బయటగాని తగినంత చర్చకు ఆస్కారమివ్వకుండా ఆమోదింప చేసుకున్న తీరే అనుమానానికి తావిచ్చింది. ఇప్పుడు ఉద్యమానికి నెల రోజులు గడుస్తున్న సందర్భంగా రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానిస్తూ మద్దతు ధర డిమాండ్ పై ప్రభుత్వం తన మనసులోని మాట బయటపెట్టింది.

వ్యవసాయ రంగ సంస్కరణల కోసం తెచ్చిన మూడు చట్టాలలో మద్దతు ధర ప్రసక్తి లేదని రైతులు దానిపై హామీ ఇవ్వాలంటూ కొత్త డిమాండ్‌ను చేర్చడం సమంజసం కాదని ప్రభుత్వం తాజాగా గొంతు సవరించుకుంది. కొత్త మూడు వ్యవసాయ చట్టాల్లో ఒకటి రైతు తన పంటను వ్యవసాయ మార్కెట్ల బయట దేశంలో ఎక్కడైనా, ఎవరికైనా అమ్ముకోవచ్చుననేది, రెండోది కార్పొరేట్ వ్యవసాయాన్ని విస్తారంగా ప్రవేశపెట్టడానికి సంబంధించినది, మూడోది పంట నిల్వలపై పరిమితిని ఎత్తివేయడానికి ఉద్దేశించినది. వీటిలో ప్రత్యేకించి మద్దతు ధర ప్రస్తావన లేని మాట వాస్తవమేగాని మార్కెట్ యార్డులకు బయట ముందస్తు ధర ఒప్పందాల ద్వారా పంటల క్రయవిక్రయాలను ప్రోత్సహించడమంటేనే మద్దతు ధర వ్యవస్థను మంటగలపడం అని తేటతెల్లమవుతున్నది.అసలీ మద్దతు ధర సహేతుకంగా నిర్ణయించి రైతుకు అందేలా చేయకపోడమే దేశ వ్యాప్తంగా అసంఖ్యాక సాధారణ రైతులు అప్పుల పాలై ఆతహత్యల బాట పట్టడానికి మూల కారణం.

పంట రైతు చేతికి వచ్చినప్పుడు మార్కెట్‌లో ధర తగ్గిపోడం, దళారీకి ఎంతో కొంతకు తెగనమ్ముకున్న తర్వాత అమాంతంగా పెరిగిపోడం ప్రతి ఏటా సాగిపోతున్న కుట్రే. ఈ దారుణాన్ని కొంత వరకైనా అరికట్టడంలో మార్కెట్ యార్డులు, మద్దతు ధరలు ఉపయోగపడుతున్నాయి. మొదట్లో రైతును సంతృప్తి పరిచే ధరలను మార్కెట్ యార్డుల బయట చెల్లించి అవి పూర్తిగా మూతపడేటట్టు చేయడం, ఆ తర్వాత కార్పొరేట్లు ఎంత ఇస్తే అంత పుచ్చుకోక తప్పని దుస్థితిలోకి తమను నెట్టడం కొత్త వ్యవసాయ చట్టాల లక్షమన్నది పూర్తిగా బోధపడిన తర్వాతనే రైతులు ఉద్యమానికి ఉపక్రమించారు. నిల్వలపై పరిమితిని ఎత్తి వేయడం కూడా కోట్లాది మందిగా ఉన్న చిన్న, మధ్యతరగతి రైతుల మీద ప్రేమతోగాక దళారీ వ్యాపారుల, కార్పొరేట్ శక్తుల అధిక, సునాయాస లాభార్జనకు తోడ్పడడానికి ఉద్దేశించినదే. ఏ చట్టం ఎంత గొప్పదైనప్పటికీ అంతిమంగా రైతుకు న్యాయమైన తన శ్రమ ఫలితం అందుతుందా లేదా, ఒకప్పటి మాదిరిగా రైతు సుఖంగా బతక గలుగుతున్నాడా లేదా అనేదే ప్రభుత్వం తీసుకునే చర్యల మంచి చెడ్డలకు తిరుగులేని గీటురాయి అవుతుంది.

అందుకే స్వామినాథన్ కమిషన్ మద్దతు ధర విషయంలో స్పష్టమైన సిఫారసు చేసి ఉంది. భూమి కిరాయి, రైతు కుటుంబ శ్రమ విలువ, వాస్తవ పెట్టుబడి ఈ మూడింటినీ కూడి అందులో సగ భాగాన్ని దానికి కలిపి మద్దతు ధరను నిర్ణయించాలని ప్రతిపాదించింది. నాటి యుపిఎ ప్రభుత్వంగాని, ఇప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వంగాని ఈ సూత్రం అన్ని పంటలకు ఖచ్చితంగా అమలయ్యేలా చేయడం పట్ల ఆసక్తి కనబరచలేదు. అది జరిగి ఉంటే ఏ పేచీ ఉండేది కాదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News