Home ఎడిటోరియల్ రైతుల శత్రువు “వయ్యారిభామ”

రైతుల శత్రువు “వయ్యారిభామ”

Vayyari Bhama

 

వయ్యారిభామ పేరు వినగానే ఇది ఒక కలుపు మొక్క అని తెలిసినా రైతులకు, మానవులకు, జంతువులకు ప్రమాదకరమైన శత్రువు అని అంత సులువుగా గుర్తుకురాకపోవచ్చు. ఇది మామూలు గడ్డి మొక్కే అని నిర్లక్షం చేయడమే పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయల పంటను ఆదాయాన్ని మేస్తున్న కలుపు మొక్క. రైతులు ముఖ్యంగా వయ్యారి భామను కేవలం పిచ్చి మొక్కగానే కాకుండా దాని వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి మసలు కోవడం అనివార్యం. వృక్షశాస్త్ర పరంగా దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టిరోపోరస్.

ఇది ఆస్టిరేసి కుటుంబానికి చెందినది. కాగా ఇది కలిగించే దుష్ప్రభావం మానవ జాతికి, జంతువులకు అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంత కాలం ఈ మొక్కను నిర్మూలించకుండా నిర్లక్షం చేసినందుకు అక్షరాల (రూ. 662 కోట్లు) ఆరు వందల అరవై రెండు కోట్లు అవసరపడతాయని 2011, అక్టోబర్ 5న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ సంచాలకులు ఉషారాణి కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖకు ప్రతిపాదనలను సైతం పంపించారు. కేవలం ఒక కలుపు మొక్క నివారణకే ఇంత భారీగా ఖర్చుంటుందన్న ప్రతిపాదన ఒకింత ఆశ్చర్యం కలిగించినా, దీనిని సమూలంగా నిర్మూలించడమే అంతిమ లక్షంగా ప్రభుత్వం పూనుకోవడమే తక్షణావసరం.

వయ్యారిభామ పూర్వాపరాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా చోట్ల వ్యవసాయ పొలాల గట్లపై, పంటచేలల్లో, బీడు భూములలో, ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాల్లోనూ తెల్ల పూలతో విరివిగా కన్పించే ఈ వయ్యారిభామ ఒక విదేశీ మొక్క. 1950లో అమెరికా నుంచి గోధుమలను దిగుమతి చేసుకునే క్రమంలో ఇది నౌకల ద్వారా మన దేశంలోకి ప్రవేశించింది. ఒక పొరుగు దేశం నుండి వలస వచ్చి, ఏళ్లలో దేశమంతా విస్తరించింది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల హెక్టార్ల భూముల్లో పార్థీనియం విస్తరించి ఉందని 2011లో వ్యవసాయాధికారులు గుర్తించారు. బీడు భూములు మొదలుకొని సేద్యపు పొలాల వరకు, మారుమూల, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోనూ దాదాపు ఇవి విస్తీర్ణంలో నాలుగో వంతు దాకా ఆక్రమించాయి. వయ్యారి భామ మొక్కలు పంటల దిగుబడిపై నష్టం కలిగించేదే గాక, రైతులు, ప్రజలు, పాడి పశువుల ఆర్యోగంపైనా తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నందున వీటిని సమూలంగా నివారించడమే ప్రభుత్వ లక్షం గా మారితే ప్రయోజనం ఉంటుంది. అందుకు 662 కోట్ల రూపాయలు కేటాయించి, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద చేపడితే బాగుంటుందని, వ్యవసాయ కూలీలకు 6.62 కోట్ల దినాలు కల్పించే భాగ్యం కలుగుతుందని గతంలోనే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. దీనిపై ఎటువంటి స్పందన వెలువడలేదు.

పార్థీనియం వ్యాప్తి నష్టాలు
పొలం గట్లపై, పంట చేలల్లో, జనావాసాల్లో ఖాళీ స్థలాల్లో తెల్లని పూలతో ఏపుగా పూచిన ఈ మొక్క విత్తనాలు గాలి ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. జులై నుండి అక్టోబర్ వరకు వీటికి వ్యాప్తి చెందే కాలం. వాతావరణం అనుకూలంగా ఉంటే నాలుగు వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలు గాలి, నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. పంటలో 40 శాతం, పశుగ్రాసం సాగులో 90 శాతం దిగుబడిని తగ్గిస్తుంది. వీటి పుష్పాలు నుండి పుప్పొడి రేణువులు టమాట, వంగ, మిరప పంట మొక్కలపై పడి పుష్పాలు, పిందెలు తయారు కాకుండా పోతాయి. కొన్ని రకాల వైరస్ తెగుళ్ళను వ్యాపింప జేస్తాయి. ఇంకా ఈ పార్థీనియం మొక్కలు నేలలో నత్రజని నిల్వ ఉండకుండా దెబ్బతీస్తుంది. ఫలితంగా పంట మొక్కలు నత్రజని గ్రహించక ఏపుగా పెరగవు అందుకు రైతులు పైర్లకు యూరియాను అధికంగా వాడాల్సి వస్తోంది. రసాయనిక ఎరువుల వాడకానికి, సాగు వ్యయం పెరగడానికి కలుపు మొక్కలే కారణమన్న నిత్య సత్యాన్ని రైతులు గమనించకపోవడం వారి అవగాహనారాహిత్యానికి కారణం. పంటలకు తెగుళ్లు వ్యాపించడానికి పరోక్షంగా ఈ కలుపు మొక్కలే వాహకాలు (Vectors) గా ఉంటూ, పంట దిగుబడి తగ్గడానికి కారణమ వుతున్నాయి.

పాడి పశువులు ఈ మొక్కలను తింటే వాటి శరీర బరువు తగ్గి, పాల దిగుబడి పడిపోతుంది. గేదెలు, మేకలు, గొర్రెలు అనారోగ్యానికి గురవుతున్నాయి. పొలాలలో పని చేసే కూలీలు, రైతులకు ఈ కలుపు మొక్కలు వెదజల్లే పుప్పొడి (పరాగ రేణువులు) వల్ల ఉబ్బసం(అస్తమా) వంటి ఊపిరి తిత్తుల వ్యాధులు, కళ్లు మండటం, ఆకుల స్పర్శ వల్ల చర్మ వ్యాధులు, విష జ్వరాలు సంభవిస్తున్నాయి. ఈ దుస్థితి నుండి తప్పుకోవాలంటే వైద్యం కోసం చాలా మంది సన్నకారు రైతులు కొంత ఖర్చు పెట్టక తప్పని ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన రైతులకు అవగాహన అవసరం.

నివారణ: వయ్యారిభామను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదు. కలుపు నివారణ మందులు (రౌండప్) వాడటంతో తాత్కాలికంగా నివారించగలిగినా మరుసటి ఏడాది విత్తనాలు మళ్లీ మొలకెత్తుతూనే ఉన్నాయి.
1) వయ్యారి భామ మొక్కలను వేళ్లతో సహా పీకి కాల్చి వేయడం కనీసం వరుసగా రెండేళ్ల పాటైనా కొనసాగిస్తేనే వీటికి శాశ్వత నివారణ. చేతికి తొడుగులు ధరించడం తప్పనిసరి. 2. జైగో గ్రామా బై కొలరేటా అనే క్రైసోమిలిడ్ జాతికి చెందిన పెంకు పురుగులను వదిలి జీవ నియంత్రణ పద్ధతి ద్వారా నివారించవచ్చు. ఇవి వయ్యారిభామ ఆకులన్నింటిని తినివేస్తాయి.

3. పంట మార్పిడి పద్ధతిలో భాగం గా బంతి సాగు చేయాలి. ఆ తర్వాత వేసే పంటలో వయ్యారిభామ రాకుండా ఉంటుంది.

4. పార్థీనియంను కంపోస్టు ఎరువుగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఇది వ్యవసాయ అధికారుల సహాయంతో, తగిన శిక్షణలో రైతులు తయారు చేసుకోవాలి.

5. 15 నుంచి 20 శాతం ఉప్పు ద్రావణంతో పిచికారీ చేయవచ్చు.

6. ఈ కలుపు మొక్కల గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రచార మాధ్యమాల ద్వారా, గోడ పత్రికలు ద్వారా ప్రచారం నిర్వహించడం అనివార్యం. వీటిని నిర్మూలించడంలో వ్యవసాయ శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలను, ఉపాధి హామీ కూలీలను భాగస్వామ్యం కల్పిస్తే ఫలితం ఉంటుంది. తెలంగాణకు హరితహారం లాంటి విప్లవాత్మక కార్యక్రమం లాగా వయ్యారిభామ కలుపు మొక్కలను నివారించే కార్యక్రమం ప్రభుత్వం చేపడితే అందరికీ క్షేమదాయకం.

Farmers face problem with Vayyari Bhama in Cultivation