Home తాజా వార్తలు ఆశల చిగురు

ఆశల చిగురు

Farmers

 

ముసురుతో రైతన్న మురిసే
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం
ముసురేసిన ఉమ్మడి జిల్లాలో లోటు వర్షపాతమే
భారీవర్షం కురిస్తేనే భవిష్యత్తు

రంగారెడ్డి : అన్నదాతలలో ఆశలు చిగురిస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వరుణుడు కరుణించి నాలుగు జల్లులు పడి మాయమవడంతో ఆశలు సన్నగిల్లి పరేషాన్‌లో ఉన్న అన్నదాతలు మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో కొంత వరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వర్షానికి పంటలు వేసిన రైతులు నాటి నుంచి వాటిని రక్షించుకోవడానికి నానా కష్టాలు పడ్డ చాలా మండలాల్లో పం టలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు పరేషాన్‌లు ఉండగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు కాస్తా సేదదొరికింది. రంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కన్న ప్రస్తుత సీజన్‌లో 50 వరకు పంటలు ఎండుముఖం పట్టాయి.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు మరోసారి పూర్తి స్థాయి లో వ్యవసాయ పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు. సోమవారం నాడు శంకర్‌పల్లిలో 4.4 మి.మి, శేరిలింగంపల్లిలో 8.1 మి.మి, గండిపేట్‌లో 5.6 మి.మి, రాజేంద్రనగర్‌లో 6 మి.మి, బాలాపూర్‌లో 4.8 మి.మి, హయత్‌నగర్‌లో 4.4 మి.మి, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 3.3 మి.మి, ఇబ్రహింపట్నంలో 2.1 మి.మి, మంచాల 2.4 మి.మి, యాచారం 2.2 మి.మి, ఆమన్‌గల్ 1.6మి.మి, తలకొండపల్లిలో 1.7 మి.మి, కందుకూర్‌లో 2.8 మి.మి, మహేశ్వరంలో 1.9 మి.మి, మహేశ్వరంలో 1.9 మి.మి, శంషాబాద్‌లో 4.1 మి.మి, మొయినాబాద్‌లో 5.0 మి.మి, చెవెళ్ల 1.2 మి.మి, ఫరూక్‌నగర్‌లో 1.2 మి.మి నమోదు కాగా మిగత మండలాల్లో చినుకులు మాత్రమే పడ్డాయి. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షం కురిసింది. బాచుపల్లిలో 10.8 మి.మి, మేడ్చల్‌లో 8.8 మి.మి, శామీర్‌పేట్‌లో 4.2 మి.మి, కీసర 11.6 మి.మి, ఘట్‌కేసర్‌లో 11.4 మి.మి, మూడు చింతలపల్లిలో 2.0 మి. మి వర్షం నమోదైంది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ముసురు కురిసింది. పెద్దెముల్, తాండూర్, మోమిన్‌పేట్, వికారాబాద్, దౌల్తాబాద్‌లలో 4 మి.మిల వరకు వర్షం కురిసిన మిగత మండలాల్లో చినుకులకు పరిమితం అయింది.

లోటు వర్షపాతమే
మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా మురుసు కురుస్తున్న ఖరీఫ్ సీజన్‌లో లోటు వర్షపాతమే నమోదైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంబం నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా సాదారణ వర్షపాతం 239.1 మి.మి వర్షపాతం ఉండగా కురిసింది కేవలం 180.2 మి.మి మాత్రమే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకర్‌పల్లి మండలంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో 295.8 మి.మి వర్షపాతం నమోదు కావలసి ఉండగా శంకర్‌పల్లిలో ఇప్పటివరకు కేవలం 75.1 మి.మి. మాత్రమే నమోదైంది. శేరిలింగంపల్లి, గండిపేట్, రాజేంద్రనగర్, మంచాల, కేశంపేట్, శంషాబాద్, మొయినాబాద్, చెవెళ్ల, కొత్తూర్, నందిగామ, ఫరూక్‌నగర్, కొందూర్గు, చౌదరిగూడం మండలాల్లో సాదారణ వర్షపాతం కన్న తక్కువగా నమోదయింది.

బాలాపూర్, సరూర్‌నగర్,హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహింపట్నం, యాచారం, మాడ్డుల, ఆమన్‌గల్, మహేశ్వరం, షాబాద్ మండలాల్లో సాదారణ వర్షపాతం నమోదైంది. మేడ్చల్ జిల్లాలో సైతం సీజన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. సీజన్‌లో ఇప్పటివరకు సాదారణ వర్షపాతం 281.1 మి.మి కాగా కురిసింది కేవలం 195.8 మి.మి మాత్రమే. 11 మండలాల్లో సాదారణ వర్షపాతం కన్న తక్కువ నమోదు కాగా నాలుగు మండలాల్లో సాదారణ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌లో వికారాబాద్ జిల్లాలో సైతం లోటు వర్షపాతం నమోదైంది.

జూన్ 1 నుంచి నేటి వరకు 302.4 మి.మి సాదారణ వర్షపాతం కాగా కురిసింది మాత్రం కేవలం 181.8 మి.మి మాత్రమే. జిల్లాలోని మర్పల్లి, పూడూర్, పరిగి, కుల్కచర్ల మండలాల్లో అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, వికారాబాద్, దోమ, దారూర్, బంట్వారం, పెద్దెముల్, తాండూర్, యాలాల్, కొడంగల్‌లో లోటు వర్షపాతం నమోదైంది. సీజన్ ప్రారంబమై రెండు నెలలు గడుస్తున్న భారీవర్షాలు లేక కుంటలు, చెరువులు పూర్తిగా వెలవెలపోతుండగా భూగర్బజలాలు సైతం రోజు రోజుకు పడిపోతున్నాయి. వరుణుడు కరుణించి భారీ వర్షాలు కురిస్తే తప్ప జిల్లాలో త్రాగు, సాగునీటి కష్టాలు తీరే పరిస్థీతులు కనిపించడం లేదు.

Farmers happy with Rains