Home వరంగల్ రూరల్ తొలకరి పలకరించింది

తొలకరి పలకరించింది

Farmers hopes of rain Fall one hour

మనతెలంగాణ/ ఎల్కతుర్తి : మూడు నెలల పాటు దంచికొట్టిన ఎండలు ఇక ముందు కూడా ఉంటాయేమో అని అనుకుంటున్న తరుణంలో వానాకాలం తొలకరి పలకరించింది. గంట పాటు వర్షం కురవడంతో రైతుల ఆశలు చిగురించాయి. జూన్ నెలలో వర్షాలు పడుతాయని వాతావారణ శాఖాధికారులు చెబుతున్నప్పటికీ చివరి వారం లో పడుతాయని అంతా భావించారు. కానీ నెల ప్రారంభమైన రెండో రోజే వర్షం పడడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. దీంతో రైతులు హలాలను భుజాన వేసుకుని పొలాలకు బయలుదేరారు. పొలాల్లో రైతులు బీజీబీజీగా తమ పనులను మొదలుపెట్టారు..
పలకరించిన తొలకరి : జూన్ నెలతో వర్షాకాలం ఆరంభమైంది. దీంతోపాటే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను నిజం చేస్తున్నట్లు శనివారం జోరు వాన కురవనే కురిసింది. ఇన్ని రోజులు ఎండ వేడితో తల్లడిల్లిన పుడమి తల్లికి ఈ వాన కాస్త ఊరటనిచ్చింది. నీళ్లు లేక ఎండిపోయి నెర్రలుబారిన నేలలు తొలకరి జల్లులతో దాహార్తిని తీర్చుకున్నాయి. ఇన్ని రోజులు తీవ్రమైన ఎండలు భూమిపై తన ప్రతాపాన్ని చూపించడంతో జనం ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తమ దేహాలను చల్లబర్చుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు. మొత్తానికి ఎండలతో హీటెక్కిన వాతావరణం తొలకరి వానతో చల్లబడి కూల్‌కూల్‌గా మారిపోయింది.
రైతులు బిజీబిజీ : ఇన్ని రోజుల నుంచి ఒక్క వాన కోసం ఎదురు చూసిన రైతులకు ఆశించినట్లుగానే వర్షం తానున్నానంటూ తొలకరి ఆహ్వానం పలికింది. దీంతో రైతుల ముఖాల్లో ఆనంద ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మూలకు పడేసిన పొలం పనిముట్లను భూజానికెత్తుకుని పొలాలకు బయలుదేరారు. శాస్త్రవేత్తలు ముందు నుంచే వర్షాలు పడుతయని చె బుతుండడంతో కొంత మంది ఇప్పటికే దుక్కులు దున్నుకున్నారు. కాగా ఈ వర్ష ంతో రైతులంతా దుక్కులు దున్నుకునే పనిలో పడ్డారు. కొంత మంది పశువులు, నాగళ్లతో పొలాలను దున్నుకుంటుంటే మరి కొందరు రైతులు యంత్రాల సాయ ంతో ఆ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వర్షం ఆగిన మధ్యాహ్నం నుంచే రైతులు పొలాలకు వెళ్లి బిజీబిజీగా ఉంటూ తమ పనుల్లో నిమగ్నమయ్యా రు.

మరో వర్షం కోసం ఎదురు చూపుః
ఉదయం సుమారు గంట పాటు జోరుగా వాన కురిసింది. అయితే ఈ వర్షంతో నేల పూర్తిగా తడువదని, భూమిలోని వేడి ఒక్కసారికే పోదని కొంత మంది రైతులు భావిస్తున్నారు. మరో వర్షం పడితే భూమి తడిగా మారుతుందని, అప్పుడు దుక్కులు దున్నుకున్నా, అచ్చులు, సాళ్లు వేసినా బాగుంటుందనే భావనలో ఉన్నారు. అయితే వర్షాకాలం ఆరంభంలోనే ఆశించిన వర్షం పడడంతో ఇక వర్షాలు కురుస్తాయని, ఆలస్యం చేయకూడదని మరికొందరు రైతులు ఇప్పటికే పొలాల్లో ఉన్న ఎండిన పత్తి చెట్లను పెరికివేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా అచ్చులు వేసేందుకే సిద్ధమయ్యారు. మొత్తానికి తొలకరి వర్షం రైతుల్లో ఒకింత ఆనందాన్ని కురిపిస్తుండగా మరిన్ని వర్షాలు పడితే ఆ ఆనందం మరింత రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లోనైనా రైతులకు కష్టాలు, నష్టాలు లేకుండా చేయ్యాలని మనమూ ఆశిద్దాం..