Home తాజా వార్తలు వానమ్మా.. వానమ్మా పలుకరించి పోమ్మా…

వానమ్మా.. వానమ్మా పలుకరించి పోమ్మా…

Farmers

 

మృగశిరలోనూ దంచికొడుతున్న ఎండలు
తొలకరి వర్షం కోసం రైతన్న ఎదురుచూపులు

వరంగల్ రూరల్ : ఈ యేడు అనుకూల వర్షాలు కురుస్తాయని ఆనందపడ్డ రైతులకు ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మృగశిర కార్తె ఆరంభంలోనే తొలకరి జల్లులు రైతన్నను పలుకరించాల్సి ఉండగా ఐదురోజులవుతున్నా వర్షపు జాడలేకపోగా ఎండలు దంచి కొడుతుండడంతో వర్షాభావ పరిస్థితులు తప్పవాఅని దిగులు చెందుతున్నారు. రోహిణికార్తెలోనే దుక్కులు సిద్ధం చేసుకొని మృగశిరలో తొలకరి జల్లులతో విత్తనాలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలలుకన్న రైతులు రోజూ అకాశం కేసి చూస్తూ వర్షం ఎప్పుడు పలుకరిస్తుందా అని పడిగాపులు గాస్తున్నారు.

రైతుల దయనీయ పరిస్థితిని చూస్తుంటే “వానమ్మా.. వానమ్మా..! ఒక్క సారన్న.. వచ్చిపోవా.. వానమ్మా! అన్న గేయం గుర్తుకొస్తుంది.. ‘మృగశిర కార్తె వచ్చిందంటే ముల్లు మెత్తబడుతుంది.’ అన్న సామెత అటుంచి రుతుపవనాల జాడ లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే ఎండ మండి పోతుండడంతో రైతులకు ఈ యేడు అదును దాటుతుంది అన్న బెంగ పట్టుకోగా శ్రామికులు, వ్యాపారులు, ఇతరత్రా పనులు చేసుకునేవారు. మధ్యాహ్నం అయిందంటే బేజారవుతున్నారు. ఏప్రిల్, మేనెలలో ఉండే ఎండలు జూన్‌లోనూ బేజారత్తిస్తున్నాయని, ఎండల వల్ల అన్నివర్గాల వారికి ఇబ్బందులేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తొలకరి వర్షం కోసం ఎదురుచూపులు..

గతేడాది జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి తొలకరి జల్లులు కురిశాయి. ఈసారి జూన్ 14వ తేదీ అయినా వర్షం జాడ లేకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. వర్షాలు రెండు వారాలు ఆలస్యం కావడం వల్ల పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూరల్ జిల్లా ప్రజలు ప్రధానంగా
వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఏటా ఖరీఫ్‌లో పత్తి పంట జిల్లాలో గణనీయంగా సాగవుతుంది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం జిల్లాలో 3,67,275 ఎకరాల్లో ఈ యేడు పత్తి సాగవుతుందని అనుకున్నప్పటికి ఇప్పుడున్న వాతావరణం పరిస్థితులు మరో నాలుగైదు రో జులుంటే సాగు విస్తీర్ణం తగ్గుతుంది. అదనుదాటాక పత్తి విత్తనాలు విత్తినా సరైన దిగుబడులు రాక రైతులపై పెట్టుబడి భారం పడే ప్రమాదం ఉంది. వరి పంట 96 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది.

వర్షాలు ఆలస్యమైన వరిసాగుపై పెద్దగా ప్రభా వం పడదు. దీర్ఘకాలిక వంగడాల స్థానంలో స్వల్ప కాలిక వరి వంగడాలను వినియోగించుకుంటే పంట చేతికొస్తుంది. మొక్కజొన్న 43,750 ఎకరాల్లో, మిర్చి 14250 ఎకరాల్లో పసుపు 18,250 ఎకరాల్లో, వేరుశనగ 900 ఎ కరాలు, కందులు 2700 ఎకరాలు, పెసర 1500 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వే యగా వర్షాలు సకాలంలో కురియకపోవడం వల్ల ఆయా పంటల సాగుపై ప్రభావం పడనున్నది.

మార్కెట్‌లో పత్తి విత్తనాలు సిద్ధం

జిల్లాలో సాగుకు అవసరమైన వివిధ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. సాగు విస్తీర్ణం అంచనాను బట్టి మొత్తం 4,49,300 విత్తన ప్యాకెట్లు అవసరమని ప్రతిపాదించి తెప్పించారు. జూన్ మొదటి వారంలోనే విత్తన విక్రయాలు ప్రారంభించేందుకు వీలుగా వ్యవసాయశాఖ ఆయా కంపెనీల ద్వారా విత్తనాలను తెప్పించి డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. వర్షాలు ప్రారంభం కాగానే విత్తనాలు విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Farmers looking for Rains