Home ఎడిటోరియల్ బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ

బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ

Farmers pledge for BJP defeat

 

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం ఈ చట్టాల రద్దు పట్ల రైతుల పట్టుదలను సూచిస్తోంది. తొలినాళ్ళలో ఈ ఆందోళనను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జి, భాష్పవాయువు గోళాలు, వాటర్‌కానన్లు ప్రయోగించడం వంటి అన్ని ప్రయత్నాలు చేసింది. రైతుల ఏమాత్రం వెనుకంజ వేయలేదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ప్రాణాలను హరించే కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయకుండా దీనిని ఒక జీవన్మరణ పోరాటంగా కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒక సంప్రదింపుల కమిటీని వేసింది. ఈ కమిటీలో అంతా వ్యవసాయ చట్టాలను సమర్ద్ధిస్తూ గతంలో వ్యాసాలు రాసిన వారు, ప్రకటనలు చేసిన వారే ఉండడంతో రైతులు ఈ కమిటీని తిరస్కరించారు.

సుప్రీంకోర్టు సైతం ఈ వివాదాస్పద చట్టాలను అమలు చేయకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు నాయకులు ఎంత పట్టుదలగా ఉన్నారో, వాటిని వెనక్కి తీసుకుంటే తమ అహం దెబ్బతింటుందని, రాజకీయంగా తమ ప్రత్యర్థులకు అదొక ఆయుధం అవుతుందని ప్రభుత్వం కూడా అంతే బలంగా భావిస్తోంది. ఈ వ్యవసాయ చట్టాలనే కనుక అమలు చేస్తే వ్యవసాయం కాస్తా కార్పొరేట్ శక్తుల కబంద హస్తాలలోకి వెళ్ళిపోతుందనేది రైతుల ఆందోళన. తమ ఆందోళన రాజకీయాలకు అతీతమైనదని రైతునాయకులు తొలుతే ప్రకటించారు. ఇప్పటికీ ఆ మాటపైనే నిలబడ్డామని అంటున్నారు. అయితే, ఈ ఆందోళన మాత్రం క్రమంగా రాజకీయ మలుపు తిరుగుతోంది.

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాలలో బిజెపి పరాజయం పొందింది. పశ్చిమబెంగాల్‌లో బిజెపి అధికారాన్ని చేపట్టాలని ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఇరవై మంది కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచార రంగంలోకి దిగినప్పటికీ ఆ పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో రైతులు కీలక భూమిక పోషించారని రైతు నాయకులు అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు రైతు నాయకులకు మరింత ఊపునిచ్చాయి. నిజానికి తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేమని, వారితో కలిసి పని చేయడం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటెయ్యాలని కూడా వారు చెప్పడం లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోవడం వల్లనే బిజెపి ని ఓడించాలని నిర్ణయించారు.

ఉత్తరప్రదేశ్‌తో పాటు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గోవా, గుజరాత్ రాష్ర్ట శాసన సభలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పని చేయాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించారు. ‘బిజెపిని ఓడించండి’ అన్న ఏకైక నినాదంతో రైతు సంఘాల నాయకులు ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ర్ట మంతా మహా పంచాయతీలను నిర్వహిస్తున్నారు. దాదాపు 500 రైతు సంఘాల సమాఖ్యగా ఉన్న ‘సంయుక్త కిసాన్ మోర్చా’ రైతుల ఆందోళనను సమన్వయం చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో 2013 ఆగస్టు సెప్టెంబర్‌లలో మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ సందర్భంగా 42 మంది ముస్లింలు, 20 మంది హిందువులు మృతి చెందారు. ఈ ఘర్షణల్లో నిందితుడైన సంజీవ్ బాల్యన్, బిజెపికి చెందిన ప్రస్తుత కేంద్రమంత్రి గత ఫిబ్రవరిలో షమ్లీ జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్ళి రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల గురించి రైతులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. దాంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు కేంద్రమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గ్రామం నుంచి ఆయనను తరిమేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఈ పశ్చిమ ప్రాంతంలోనే భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్‌కు ప్రజల్లో పలుకుబడి బాగా పెరుగుతోంది.

తికాయత్ ముజఫర్ జిల్లాలోని సిసోలి గ్రామానికి చెందిన వారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ముట్టడి అనంతరం గజియాపూర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపైన పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాకేష్ తికాయత్ కన్నీళ్ళతో చేసిన ఆవేశపూరిత ప్రసంగం రైతులను కదిలించి వేసింది. వారంతా ఇప్పుడు రైతుల ఆందోళనలో భాగస్వాములయ్యారు.

ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో కూడా పరిస్థితులు ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేవు. కరోనా మహమ్మారి రెండవ దశ విజృంభణను అదుపు చేయడంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక పరిస్థితులను కూడా రైతులు తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రైతులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రాకేష్ తికాయత్ కుండబద్దలు కొడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బిజెపి దారుణమైన ఓటమి చవిచూసింది. గ్రామీణ స్థాయి లో రైతులు ఈ ఎన్నికల ఫలితాల రూపంలో తమ వ్యతిరేతను వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బిజెపికి మద్దతిస్తున్న వర్గాలుగా భావిస్తున్న బలమైన రాజ్‌పుట్ వర్గం కూడా పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా పని చేసింది. ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాల నేపథ్యంలో అన్నదాతలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతంలోని రైతులు కూడా ఆందోళనలో భాగస్వాములవుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల అమలులోకి వచ్చి మార్కెట్ అంతా ప్రైవేటు కంపెనీల పరమైతే తమ ఉత్పత్తుల గతేమిటని ఆలోచిస్తున్నారు.కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తామింకా ఉధృతం చేయలేదని, ఈ వైరస్ కాస్త ఉపశమించాక తమ ప్రచారాన్ని తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు అంటున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ ఏకతా ఉగ్రహాన్ మహిళా విభాగం నాయకురాలు హరీంద్ర బిందు కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా మహిళా రైతులను కూడగడుతూ అందోళనలో కీలక భూమిక పోషిస్తున్నారు.

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పదకొండు సార్లు చేపట్టిన చర్చలు ఏ మాత్రం పురోగతి సాధించలేదు. కరోనా రెండవ విడత విజృంభణ వల్ల ఈ చర్చలు ఆగిపోయాయి. ఆగిపోయిన ఈ చర్చలను మళ్ళీ మొదలు పెట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీకి మే 21 లేఖ రాశారు. ఈ లేఖలో హన్నన్ మొల్లాహ, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, యోగీంద్ర యాదవ్ తదితర రైతు సంఘాల నాయకులు కూడా సంతకాలు చేశారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా గుర్తింపు పొందిన భారత దేశంలో చిత్తశుద్ధితో రైతులతో చర్చలు జరపండి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధర ఇచ్చేలా ప్రతి రైతుకు చట్టపరమైన హామీని ఇవ్వండి’ అని ఆ లేఖలో కోరారు. కానీ ప్రధాని నుంచి కానీ, ప్రభుత్వవర్గాల నుంచి కానీ ఈ లేఖకు ఎలాంటి స్పందన రాలేదు. రైతులు చేపట్టిన ఆందోళన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మే 26న బ్లాక్‌డే గా పాటించారు.

ఈ నిరసనలో కోట్ల సంఖ్యలో రైతులు పాల్గొన్నట్టు ఆ సంఘాల నాయకుల అంచనా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వ్యవహార సరళి పాత్రికేయులు, పౌర హక్కులు, మేధావి వర్గాలలో కూడా ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలోని బూల్‌గర్హి గ్రామంలో పంతొమ్మిదేళ్ళ దళిత బాలికపై గత ఏడాది సెప్టెంబర్ 14న సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు దేశ మంతా గుప్పుమన్నాయి. ఈ సంఘటనను రిపోర్ట్ చేయడానికి కేరళ నుంచి ఆ గ్రామానికి వెళ్ళిన జర్నలిస్టు సిద్ధికిని పోలీసులు అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో పెట్టారు. జైల్లో కరోనా సోకడంతో అతనిని మధురలోని మెడికల్ కాలేజీకి తరలించి మంచానికి గొలుసులతో కట్టేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సిద్ధికి ఆచూకీ తెలియడంతో అతని భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక జర్నలిస్టును మంచానికి గొలుసులతో కట్టేయడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సిద్ధికిని ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో విద్యా రంగాన్ని కూడా ఆదిత్యనాథ్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందన్న ఆరోపణలు మేధావి వర్గాలలో వినిపిస్తున్నాయి. రాష్ర్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర పాఠ్యాంశాలుగా రావ్‌ుదేవ్ బాబా, యోగీ ఆదిత్య నాథ్ రాసిన పుస్తకాలను ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రాసిన ‘హటయోగా : స్వరూప యేవం సాధనం’ అన్న పుస్తకాన్ని, రావ్‌ుదేవ్ రాసిన ‘యోగా చికిత్స రహస్యం’ అన్న పుస్తకాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రవేశపెట్టినట్టు విశ్వ విద్యాలయాధికారుల వెల్లడించారు. రావ్‌ుదేవ్ అల్లోపతి వైద్యాన్ని తెలివి తక్కువ శాస్త్రమని వ్యాఖ్యానించి వివాదాల్లో చిక్కుకుని వారం తిరగకుండానే ఆయన పుస్త్తకాన్ని పాఠ్యాంశంగా చేర్చడం పట్ల మేధావి వర్గాల్లో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.

వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ ఎన్నికలను ఆందోళన చేస్తున్న రైతు ఉద్యమం ప్రభావితం చేస్తుందనడం నిర్వివాదాంశం. మరో మూడేళ్ళలో జరిగే లోక్‌సభ ఎన్నికలను కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు.