Home ఎడిటోరియల్ గిట్టుబాటు ధర అంటే…?

గిట్టుబాటు ధర అంటే…?

edit

జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా రైతులు పదిరోజుల ఆందోళన కార్యక్రమం ప్రారంభించారు.ఈ ఆందోళన ప్రారంభమైన మర్నాడు వ్యవసాయం రైతు సంక్షేమ విభాగం మంత్రి రాధామోహన్ సింగ్ ఈ ఆందోళనలను, రైతులను అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. ఒకటి అర కార్యకర్తలున్న సంస్థలు మీడియాలో కనబడ్డానికి ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తున్నాయని అన్నాడు. దేశంలో రైతుల సంక్షేమానికి బాధ్యత వహించే పదవిలో ఉన్నాడాయన. దేశంలో రైతులు ఆందోళనకు దిగవలసిన కారణాలేవీ లేనేలేవన్నది ఆయన ఉద్దేశం. అందుకే అలాంటి మాటలు చెప్పాడు. కాని గత సంవత్సరం భారీ ఎత్తు రైతు ఆందోళనలు జరిగాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో జరిగిన ఆందోళనల్లో ఆరుగురు అమాయక రైతులు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఈ సంవత్సరం జరిగిన కిసాన్ లాంగ్ మార్చ్‌ని ఎవరు మరిచిపోలేదు. దాదాపు 35వేల మంది నాసిక్ నుంచి ముంబయికి మార్చ్ చేశారు. బొబ్బలతో రక్తమోడే పాదాలతో ముంబయి వచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు “గాంవ్ బంద్‌” చేపట్టారు. అంటే ఊళ్ళుబంద్ పాటించడం. ఊళ్ళు బంద్ పాటిస్తే నగరాలకు, పట్టణాలకు పండ్లు, కూరగాయాలు, పాలు, పెరుగు అందవు. ఇంత మంది రైతులు ఆందోళన స్వరం వినిపిస్తుంటే మంత్రిగారు మాత్రం అపహాస్యం, ఎగతాళి, వెటకారం చేస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా రైతులెందుకు ఆందోళన చేస్తున్నారు? దేశంలో ఎక్కడ ఎప్పుడు రైతులు ఆందోళన చేసినా అక్కడ తప్పకుండా వినిపించే డిమాండు, ఎం.ఎస్.స్వామినాథన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన రైతుల జాతీయ కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నది. స్వామినాథన్ భారతదేశంలో హరితవిప్లవ సారథి. ఆయన నేతృత్వంలోని కమిషన్ 2006లో రిపోర్టు సమర్పించింది. ఈ రిపోర్టులో ముఖ్యమైన సిఫారసు, రైతు అందోళనల్నింటిలో వినిపించిన డిమాండు గిట్టుబాటు ధర. కనీస గిట్టుబాటు ధర ఉత్పాదక వ్యయానికి యాభైశాతం ఎక్కువఉంచాలని డిమాండ్. ఉత్పాదక వ్యయం రూ.100 అయితే, గిట్టుబాటు ధర 150 నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. మొన్న ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నాల్గవసారి బడ్జెటు ప్రవేశపెడుతూ రైతుల కోరిక మేరకు ఉత్పాదక వ్యయానికి ఒకటిన్నర రెట్లు గిట్టుబాటు ధర నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. కాని అసలు మాయ ఏమంటే, స్వామినాథన్ చెప్పిన ఉత్పాదక వ్యయం కన్నా చాలా తక్కువ ఉత్పాదక వ్యయం లెక్కలు అరుణ్ జైట్లీ దృష్టిలో ఉన్నాయి. ఇక గిట్టుబాటు ధర ఎలా నిర్ణయిస్తారో ఊహించవచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించిన చాలా సమస్యల్లో అయోమయం ఉన్నట్లే ఉత్పాదక వ్యయం విషయంలోను అయోమయం ఉంది. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ 23 పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తుంది. ఈ కమిషన్ ప్రకారం ఉత్పాదక వ్యయం మూడు విధాలు. మొదటిది ఎ2, అంటే పంట చేతికి అందేసరికి అయిన ఖర్చు. రెండవది ఎ2+ఎఫ్‌ఎల్, అంటే పంట చేతికి వచ్చేవరకు చేసిన ఖర్చుతో పాటు పండించడానికి కుటుంబసభ్యులుచేసిన శ్రమవిలువ. ఇక మూడవది సి2, అంటే సమగ్ర వ్యయం, అసలు ఖర్చు, కుటుంబ సభ్యుల శ్రమవిలువ, భూమి అద్దె, వడ్డీలు వగైరా అన్ని కలిసి. కాబట్టి సి2 అనేది సమగ్ర వ్యయం, దానికన్నా ఎ2 ప్లస్ ఎఫ్ ఎల్ తక్కువగా ఉంటుంది. దానికన్నా నగదు ఖర్చు ఎ2 ఇంకా తక్కువ ఉంటుంది.
అరుణ్ జైట్లీ గారి మాయోపాయం ఇక్కడే ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం ఉత్పాదక వ్యయం అంటే సమగ్ర వ్యయం అంటే సి2. కాబట్టి స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ధర సి2 కన్నా యాభై శాతం ఎక్కువ ఉండాలి. కాని ప్రభుత్వం ఏం చేస్తోందంటే ఎ2ప్లస్ ఎఫ్‌ఎల్ కన్నా యాభైశాతం ఎక్కువనిర్ణయిస్తోంది. ఉదాహరణకు పప్పుల విషయంలో అసలు వ్యయం ప్లస్ కుటుంబశ్రమ విలువ కలిసిన ఎ2 ప్లస్ ఎల్ ఎల్ విలువ రూ. 2,366, సమగ్ర వ్యయం అంటే సి2 విలువ 3727, అంటే 58 శాతం తేడా ఉంది. ఇప్పుడు ఉత్పాదక వ్యయంగా దేన్ని పరిగణిస్తారో ఆ ప్రకారమే గిట్టుబాటు ధర ఉంటుంది. ఉత్పాదక వ్యయంపై యాభైశాతం పెంచి గిట్టుబాటు ధర నిర్ణయిస్తాం అని అరుణ్ జైట్లీ చెప్పడం తప్పుదారి పట్టించడమే అవుతుంది. జైట్లీ గారి ఫార్ములా ప్రకారం గిట్టుబాటు ధర ప్రకటిస్తే చాలా పంటల ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదు. రైతుకేమీ మిగలదు. పైగా నష్టం కూడా వస్తుంది. ఉదాహరణకు 2017 -18లో పప్పులకు సంబంధించిన ఎ2 ప్లస్ ఎఫ్‌ఎల్ విలువ 2,366 రూపాయలు, సి2 విలువ 3727 రూపాయలు, గిట్టుబాటు ధర 4250 రూపాయలు. ఇది జైట్లీగారు ఉత్పాదక వ్యయంగా భావిస్తున్న ఎ2 ప్లస్ ఎఫ్ ఎల్ విలువ కన్నా 80 శాతం ఎక్కువ. జైట్లీ గారి ఫార్ములా ప్రకారం గిట్టుబాటు ధర ప్రకటిస్తే రైతుకు 30 శాతం నష్టం వస్తుంది. కాని ఉత్పాదక వ్యయం సి2 విలువ అనుకుంటే గిట్టుబాటు ధర ఇప్పుడు సి2 కన్నా కేవలం 14 శాతం మాత్రమే ఎక్కువుంది కాబట్టి రైతు కు లాభంగా ఉంటుంది. కాబట్టి జైట్లీ గారు గిట్టుబాటు ధర గురించి చెబుతున్న ఈ ఫార్ములా రైతులకు ఆందోళన కలిగించేది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తామంటుంది, రైతులు గిట్టుబాటు ధర డిమాండ్ చేస్తారు. సమస్యేమిటంటే, ఉత్పాదక వ్యయానికి సంబంధించి ఎవరి నిర్వచనం వారికి ఉంది. నీతిఆయోగ్ 2016 నివేదిక ప్రకారం 79 శాతం రైతులు గిట్టుబాటు ధర విషయంలో అసంతృప్తితో ఉన్నారు. చెల్లింపుల్లో జాప్యం, సేకరణ కేంద్రాల్లో తగిన వసతులులేకపోవడం, సేకరణకేంద్రాలు చాలా దూరంగా ఉండడం, గిట్టుబాటు ధర ఆలస్యంగా ప్రకటించడం ఇలా అనేక కారణాలున్నాయి. హోల్ సేల్ మార్కెటులో ధరలు గిట్టుబాటు ధర కన్నా చాలా తక్కువగా ఉన్నాయని రైతులు చాలా సార్లు ఫిర్యాదులు చేస్తున్నారు. చివరకు రైతులు 30 నుంచి 40 శాతం నష్టంతో అమ్ముకునే పరిస్థితులు ఏర్పడ్డాయని భారతీయ్ కిసాన్ ఆందోళన్ తెలిపింది. కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధరను నిర్ణయించడం వల్ల జరిగేదేమీ ఉండదు. హోల్ సేల్ మార్కెటును అదుపు చేయాలి. సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రావాలి. జైకిసాన్ ఆందోళన్ నడుపుతున్న యోగేంద్రయాదవ్ ఈ విషయాన్ని అనేకసార్లు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కన్నా హోల్ సేల్ మార్కెటులో ధర తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో కేసరి పప్పు గిట్టుబాటు ధరకన్నా మార్కెటు ధర దాదాపు 27 శాతం తక్కువ ఉందని ఆయన అన్నారు. ప్రతి పంట విషయంలోను పరిస్థితి ఇదే. గిట్టుబాటు ధరకన్నా తక్కువధరకే మార్కెట్టులో అమ్ముకోవలసి వస్తున్నది. రైతులను అనేకరకాలుగా దోచుకుంటున్నారు. దిగుబడి రావడం ప్రారంభమైన కొన్ని రోజులకుగాని ప్రభుత్వం సేకరణ ప్రారంభించదు. రైతులు అన్నిరోజులు వేచి ఉండడం సాధ్యం కాదు. వారి నిస్సహాయ స్థితిచూసి ప్రయివేటు వ్యాపారులు తక్కువధరకు కొనేస్తారు. అసలు సేకరణ కేంద్రాలు చాలా తక్కువ, ఉన్నవికూడా చాలా దూరంగా రైతులకు అందుబాటులో లేవు. నిజం చెప్పాలంటే రైతులు తమ పంటను ప్రయివేటు వ్యాపారులకు తప్పనిసరిగా అమ్మేపరిస్థితులున్నాయి. రైతు ఆందోళనల్లో వినిపించే మరో డిమాండు రుణాల రద్దు. కేంద్రంలోను, 21 రాష్ట్రాల్లోను అధికారంలో ఉన్న బిజెపి రుణాల రద్దును సూత్రప్రాయంగా వ్యతిరేకించే పార్టీగా చెప్పుకుంటుంది. కాని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రుణాలు రద్దు చేసింది. రుణాల రద్దువల్ల ఆర్ధికమైన క్రమశిక్షణ ఉండదని, భవిష్యత్తులోనూ రుణాలు రద్దవుతాయన్న ఆశ ఏర్పడుతుందని, రుణాలను తిరిగి చెల్లించడం తగ్గిపోతుందని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. కాని ఈ వాదనలను రైతులు తిప్పికొడుతున్నా రు. బ్యాంకులకు కార్పొరేట్లు ఎగ్గొడుతున్న రుణాలతో పోల్చితే రైతులకు రద్దు చేసే రుణాలు చాలా తక్కువని గుర్తు చేస్తున్నారు. పెద్దపెద్ద కంపెనీల రుణాలను రైటాఫ్ చేసినప్పుడు ఆర్థికవేత్తలు ఆర్థిక క్రమశిక్షణ గురించి నీతులెందుకు చెప్పడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.