Home ఎడిటోరియల్ రైతు పార్లమెంటు

రైతు పార్లమెంటు

Farmers started kisan parliament at jantar mantar               రైతులను నిరంతరం ఆందోళనల్లో ఉంచి అసంతృప్తిలో ముంచి కేంద్ర పాలకులు ఏమి సాధించదలచుకున్నారో ఈసరికి దేశ ప్రజలకు పూర్తిగా తెలిసి ఉండాలి. ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం వికాసం నెపంతో తీసుకు వచ్చిన చట్టాలు గాని, ముందు ముందు తేదలచిన విద్యుత్ సంస్కరణల బిల్లు గాని వాస్తవానికి ఆ రంగాన్ని మరింత బాగుపరిచి ప్రజలకు చవకగా సునాయాసంగా ఆహారాన్ని అందుబాటులో ఉంచడానికి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మాత్రం కాదని రూఢి అయిపోయింది. సాగును కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి వారికి విశేష లాభాలు సంక్రమించేలా చేయడమే మూడు కొత్త వ్యవసాయ చట్టాల ఉద్దేశమని, విద్యుత్ బిల్లు కూడా తమకు ఉరితాడు వంటిదేనని సకాలంలో గమనించిన రైతులు వాటి పూర్తి ఉపసంహరణను డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత నవంబర్ నుంచి విసుగు, విరామం లేకుండా ఆందోళన సాగిస్తున్నారు. అయినా ప్రధాని మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా మొండికేస్తున్నది.

కొత్త చట్టాలపై పునరాలోచన చేయడానికి గాని, తలపెట్టిన విద్యుత్ సంస్కరణలను వెనుకకు తీసుకోడానికి గాని అది బొత్తిగా అనుకూలంగా లేదు. తమ అధికార పరిధిలోని అనేక విషయాలను కేంద్రం తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలని పన్నిన కుట్రను అనేక రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రంలో మార్పు రాలేదు. దీనితో రైతు ఉద్యమకారులు మరింత భీష్మించుకున్నారు. ఉద్యమాన్ని నిరవధికంగా, మరింత ఉధృతంగా సాగించాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెర లేపారు. సాటి ఉద్యమకారులపై పెట్టిన రాజద్రోహం కేసులను రద్దు చేసి అరెస్టులోని ఆందోళనకారులను విడుదల చేయాలంటూ రైతు సంఘాలు బుధవారం నాడు ఢిల్లీ సరిహద్దులలో జాతీయ రహదారిని 2 గం.ల సేపు అడ్డుకొని దిగ్బంధనం గావించారు. ఈ విధంగా ప్రభుత్వ అణచివేత చర్యలను సంఘటితంగా ఎదుర్కొంటూనే పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆ సమీపంలోని జంతర్ మంతర్ వద్ద పోటీగా రైతు పార్లమెంటును గురువారం నాడు ప్రారంభించారు. దీనిని పార్లమెంటు ప్రస్తుత సమావేశాలు పూర్తి అయ్యే వరకు (ఆగస్టు 9 సాయంత్రం దాకా) కొనసాగించాలని సంకల్పించారు.

తమ నిరసన ఉద్యమం ముగిసిపోలేదని ఇంకా సచేతనంగా కొనసాగుతున్నదని చెప్పడానికి, పార్లమెంటు నడపడం తమకు కూడా చేతనవునని చూపడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రైతు ఉద్యమకారులు చెప్పారు. జనవరి 26 నాటి ట్రాక్టర్ ర్యాలీ ఘటనను తీవ్రంగా అణచివేయడానికి విఫలయత్నం చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు మొదటి సారిగా ఈ కార్యక్రమానికి షరతులతో అనుమతి ఇచ్చారు. ప్రతి రోజూ 200 మంది ఉద్యమకారులతో రైతు పార్లమెంటు నడుస్తుంది. అసలు పార్లమెంటు మాదిరిగానే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పీఠాల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయి. దేశం కొవిడ్ కోరల్లో చిక్కి లక్షలాది మంది బలి అవుతున్నా దానిని సవ్యంగా పట్టించుకోకుండా ప్రజల ఆస్తులను, ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటుకు సీదాగా అప్పగించి చేతులు దులుపుకునే పనిలోనే నిమగ్నమైన ప్రధాని మోడీ, ఆయన బృందం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లు (మండీలు), కమీషన్ ఏజెంట్ల కనీస మద్దతు ధరల ధాన్య సేకరణ, పౌర సరఫరాల వ్యవస్థను రద్దు చేసి రైతులను ప్రైవేటు బడా వ్యాపారుల దయాదాక్షిణ్యాలకు వదిలివేసే వ్యూహానికి పదును పెట్టారు.

అందు కోసం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఆదరాబాదరాగా తీసుకు వచ్చారు. దీనితో పరిపూర్ణమైన మండీల వ్యవస్థ మీద ఆధారపడి, కమీషన్ ఏజెంట్లతో పెనవేసుకొని కనీస మద్దతు ధరకు తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్న పంజాబ్, హర్యానా రైతులు మిగతా దేశమంతటి వ్యవసాయదారుల కంటే ముందే తీవ్ర ఆందోళన చెంది అప్రమత్తమయ్యారు. ఈ చట్టాలు బిల్లుల రూపంలో పార్లమెంటులోకి రాక ముందు ఆర్డినెన్స్‌లుగా విరుచుకుపడినప్పటి నుంచే వారు తమ రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రోడ్డు, రైలు రవాణాలను స్తంభింప చేసే కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడిపారు. అయినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడం కోసం గత నవంబర్ లో ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాన్ని ప్రారంభించారు.

దానితో కొత్త చట్టాల్లోని మోసం, దగా దేశమంతటి రైతాంగానికి తెలిసి వారంతా ఈ ఉద్యమానికి మద్దతు పలికారు. మొత్తం 40 సంఘాలకు చెందిన దేశ రైతాంగం ఈ ఉద్యమానికి వెన్నెముకగా అమరింది. దీనిని అణచివేయడానికి కేంద్ర పాలకులు పన్నిన కుట్రలు, ప్రయోగించిన పాచికల గురించి వివరించి చెప్పనక్కర లేదు. ప్రతి పక్షాల సంపూర్ణమైన మద్దతుతో సాగుతున్న ఈ ఉద్యమంలోని నిజాయితీని కేంద్రం ఇప్పటికైనా చిత్తశుద్ధితో గమనించాలి. తప్పెవరిదో ఒప్పెవరిదో దేశ ప్రజలు మరింత వివరంగా, సమగ్రంగా తెలుకోసుకోడానికి వీలుగా ఆ చట్టాలపైనా, విద్యుత్ బిల్లుపైనా పార్లమెంటులో వివరమైన చర్చకు అనుమతించవలసిన కనీస బాధ్యత కేంద్ర పాలకులపై ఉంది.