Home జాతీయ వార్తలు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు

పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు

Farmers strike against Agriculture bill

 

చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. హర్యానాలో బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన జననాయక్ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలు కూడా ఈఆందోళనలో పాలుపంచుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ హర్యానాయూనిట్ పిలుపు మేరకు హర్యానా లో అనేక చోట్ల రోడ్లు, జాతీయ రహదారులను మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైతులు దిగ్బంధం చేశారు. ఇతర వ్యవసాయ సంఘాల మద్దతుతో భారతీయ కిసాన్ యూనియన్ ఈ ఆందోళనలకు నాయకత్వం వహించింది. మధ్యాహ్నం 3 తరువాత రోడ్ల ఆటంకాలన్నీ తొలగించారు. అంబాలా లో రాష్ట్ర సరిహద్దులో పంజాబ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోడానికి హర్యానా పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్‌ర్యాలీ సాగింది. హర్యానా సరిహద్దులో తమ ర్యాలీని బలవంతంగా ముగింప చేసినందుకు నిరసనగా పంజాబ్ ఆందోళన కారులు తమ ట్రాక్టర్‌ను తగులబెట్టారని పోలీసులు చెప్పారు. హర్యానాలో అనేక చోట్ల రైతుల ఆందోళనలో మండీల కమిషన్ ఏజెంట్లు కూడా పాల్గొన్నారు. పంజాబ్‌లో అనేకచోట్ల మోడీ దిష్టిబొమ్మలను బిల్లుల కాపీలను తగుల బెట్టారు. పంజాబ్‌లో అకాలీదళ్ తప్ప బిజెపి, ఇతర పార్టీల వారు కూడా ఆందోళనలో పాల్గొన్నారని పంజాబ్ యూత్ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ చెప్పారు.