Home తాజా వార్తలు కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం

కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం

మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు

మన తెలంగాణ/హైదరాబాద్:  రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌తోమార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై రా జ్యసభలో టిఆర్‌ఎస్ నాయకుడు కె,కేశవరా వు మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు దే శంలోని వ్యవసాయ ఉత్పత్తులను అప్పగించే ందకు కేంద్రం ఈబిల్లు ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. వ్యవసాయక దేశమైన భారతదేశాన్ని వ్యవసాయరంగంలో తీర్చిదిద్దాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తూ, రైతులను ఆర్థికంగా మరింత బలహీనపరుస్తూ కేవలం విదేశీపెట్టుబడిదారుల లబ్దికోసం కేంద్రం వ్యవసాయ బిల్లును తీసుకువచ్చిందని రాజ్యసభలో కెకె నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యస్ఫూర్తి, దేశాభివృద్ధికి తీవ్రనష్టం తీసుకువచ్చే ఈబిల్లును టిఆర్‌ఎస్ ఎట్టిపరిస్థితుల్లో ఆమోదించే ప్రసక్తేలేదని, దేశవప్రయోజనాలకోసం, వ్యవసాయ రంగం పరిరక్షణకోసం ఈ బిల్లును కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వ్యవసాయబిల్లు ద్వారా రైతులకు మద్దతు ధర లభించదు

అన్నిఉత్పత్తులకు ధరలను నిర్ణయించుకునే హక్కు యాజమాన్యులకు ఉన్నప్పుడు పండించిన రైతు తన ఉత్పత్తులకు ధరలునిర్ణయించుకునే హక్కు ఎందకు ఉండకూడదని రాజ్యసభలో కె,కేశవరావు ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లుద్వారా రైతులు తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించుకునే అధికారం ఉందని కానీ, గిట్టుబాటు ధరపెరుగుతుందని కానీ కేంద్రప్రభుత్వం స్పష్టంగా హామీ ఇవ్వగలుగుతుందాని కెకె ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయగలుగుతుందాని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో రైతు రాజ్యం స్థాపించారని చెప్పారు. రైతులకు పెట్టుబడి సహాయంతోపాటుగా రైతుబీమా, సాగునీరు అందించడంతో పాటు కరోనా కష్టకాలంలో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసేవిధంగా తీసకున్న చర్యలతో రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. దేశంలోని రైతులను అన్యాయంచేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వ్యవసాయబిల్లును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్యాయం చేసే ఈబిల్లును మొదట ఆర్డినెన్స్‌గా తీసుకువచ్చి ఆతర్వాత మెజారిటీ ఉందని పార్లమెంట్‌లో ఆమోదం చేసుకున్నారని ఆయన నిందించారు. రాజ్యసభలోని ప్రతిపక్షపార్టీలన్నీ వ్యవసాయబిల్లును వ్యతిరేకిస్తున్న సందర్భంగా కేంద్రం ఈ బిల్లును ఉపసంహరించుకోవడం గౌరవంగా ఉంటుందన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వం

రాజ్యసభలో వ్యవసాయబిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన టిఆర్‌ఎస్ రాజ్యసభ పక్ష నాయకుడు కె.కేశవరావు బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మగాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు.కాంగ్రెస్, అకాళిదళ్,జెడిఎస్, శివసేనా,డిఎంకె, వైసిపి,ఆర్‌జెడి,సిఐ,సిఎం తదితర 14 పార్టీల సభ్యులతో కెకె ధర్నాచేశారు. టిఆర్‌ఎస్ రాజ్యసభలో చేసిన ఈ ఆందోళనకు సుమారు 40 మంది సభ్యుల మద్దతు లభించింది. ఈ ధర్నాలో కెకె తో పాటు టిఆర్‌ఎస్ పార్లమెంట్ నాయకుడు నామాతో పాటు టిఆర్‌ఎస్ ఎంపిలు పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తదితరులతో కలిసి కెకె మాట్లాడుతూ రాజ్యసభలో వ్యవసాయ బిల్లును విపక్షాలు వ్యతిరేకించనప్పటికీ, రాజ్యసభలో బిజెపికి బలం లేనప్పటికీ డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ సింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించడం ప్రజాస్వావిధానాలకు విఘాతమని తప్పుబట్టారు. కేంద్రప్రభుత్వానికి పక్షపాతంగా వ్యవహరించిన హరివంశ్‌నారాయణ్ సింగ్ డిప్యూటీ చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కులేదన్నారు. బిజెపికి బలం లేకపోయినా బిల్లును ఆమోదింపచేసుకోవడం పట్ల కెకె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అప్రజాస్వామిక చర్యను ఏనాడు చూడలేదన్నారు. సభలో సంఖ్యబలం లేకపోతే బిల్లును పక్కకు పెట్టాలే కానీ మూజువాణి ఓటుతో ఆమోదించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.వ్యసాయ విధానంపై ప్రతిపక్షాలు సూచించిన సవరణలను, నిబంధనలను సవరించాలని ఆయన డిమాండ్‌చేశారు. వ్యవసాయరంగంలో కార్పొరేట్లను ప్రోత్సహించే ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమైందని కెకె అన్నారు. దేశంలోని మార్కెటింగ్ ఏజెంట్లకు కూడా నష్టం వాటిల్లే విధంగా ఈ బిల్లు ఉందని విచారం వ్యక్తం చేశారు.

ఇది బ్లాక్‌డే పార్లమెంట్‌లో టిఆర్‌ఎస్ నాయకుడు నామా

దేశంలోని రైతులందరినిమోసం చేస్తూ కార్పొరేట్ వ్యవస్థలకు పంటలను దోచిపెట్టే విధంగా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు ఉందని టిఆర్‌ఎస్ పార్లమెంట్ నాయకుడు నామా నాగేశ్వర్ రావు దుయ్యబట్టారు. ఈబిల్లు ప్రవేశపెట్టిన ఈ రోజు దేశానికి బ్లాక్‌డే అన్నారు.సవరణలు చట్టబద్దమైన తీర్మాణాలను తోసిపుచ్చి కేంద్రం బిల్లును ఆమోదించడం అప్రజాస్వామికమన్నారు. రైతాంగానికి జరిగిన అన్యాయాలపై బిజెపి ప్రభుత్వాన్ని రైతులు ప్రజలు నిలదీసే తరుణం ఆసన్నమైందన్నారు. రాజ్యసభలో అవిశ్వాస తీర్మాణం పెండింగ్‌లో ఉండగా డిప్యూటీ చైర్మన్ బిల్లును ఏ విధంగా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు.