Thursday, November 7, 2024

రిపబ్లిక్ ‘ఢీ’

- Advertisement -
- Advertisement -

పోలీసులు, రైతుల మధ్య హోరాహోరీగా మారిన ట్రాక్టరణర్యాలీ

గణతంత్ర దిన సంరంభం ముగియకముందే ట్రాక్టర్ ర్యాలీ మొదలు కావడంతో అడ్డుకున్న పోలీసులు
తిరగబడిన రైతులు, ర్యాలీ సాగుతుండగాఒక రైతు మృతి, ఎర్రకోట వద్దకు దూసుకుపోయి జెండా ఎగురవేసిన
రైతు ఉద్యమకారులు

అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష, అదనపు బలగాలు దింపడానికి నిర్ణయం
గడువు ముగియడంతో ఆయా రూట్లలో ర్యాలీ ఆపివేతకు పిలుపిచ్చిన రైతు నేతలు
సంఘవిద్రోహ శక్తులు చొరబడ్డాయి, పోరాటం కొనసాగిస్తాం : రైతుసంఘాలు

న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతన్నలు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వేలాది మంది రైతులు ట్రాక్టర్లపైకి ఎక్కి ఢిల్లీ నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని నిలువరించడానికి యత్నించడంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రతా వలయాలను ఛేదించుకుని వేలాదిగా రైతులు ఎర్రకోట వద్దకు చేరుకుని, అక్కడ జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. కొందరు ఆందోళనకారులు ఎర్రకోట బురుజుపైకి ఎక్కి రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే పోల్‌పైకి ఎక్కి రైతు జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్దకు చేరుకున్న రైతు ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
రైతులు ముందు నిర్ణయించిన సమయానికి ముందే ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించడంతో అసలు గొడవ మొదలైంది. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత టిక్రి, సింఘు, హాజీపూర్ పాయింట్లనుంచి రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రాంభించడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే నిర్ణయించిన సమయానికి ముందే రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడంతో పోలీసులు వారిని అపడానికి ప్రయత్నించారు. తొలుత టిక్రి సరిహద్దునుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఎర్రకోట వద్ద గణతంత్ర పరేడ్ ఇంకా కొనసాగుతుండడంతో అప్పటిదాకా ఆగాల్సిందిగా పోలీసులు వారికి నచ్చ జెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. కర్రలతో వారిని తరిమి కొట్టారు. తమ ట్రాక్టర్లతో అడ్డుగా ఉంచిన పోలీసు వాహనాలను, బారికేడ్లను ఢీకొట్టి ముందుకు సాగడానికి ప్రయత్నించారు. దీంతో వారిని చెరదర గొట్టడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ట్రాక్టర్లతో అడ్డుగా ఉంచిన వాహనాలను, బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్ల్లేందుకు యత్నించారు. నిర్ణయించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ఎర్రకోట వైపుగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. సింఘు, ఘాజీపూర్ ఏరియాల్లోను దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ముకర్బ ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు. దీంతో వారిని నియంత్రించేందుకు ఒక దశలో టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణల్లో పోలీసు వాహనాలతో పాటుగా పలు వాహనాలు ధ్వంసం కాగా, పలువురుపోలీసులు కూడా గాయపడ్డారు. ముఖ్యంగా ఐటిఓ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రకోట ప్రాంతాన్ని చేరుకోవడానికి వేలాది మంది ఆందోళనకారులు ప్రయత్నించడం, వారిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాదాపుగా గంటన్నర పాటు ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం తర్వాత రాజ్‌పథ్ వద్ద గణతంత్ర పరేడ్ ముగియడంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గారు. మరో వైపు ర్యాలీలో పాల్గొనేందుకు పొరుగు రాష్ట్రాలనుంచి వేలాది మంది రైతులు మంగళవారం ఉదయానికే ఢిల్లీకి చేరుకోవడంతో ర్యాలీ పోలీసుల అంచనాలను మించి పోయింది.

పంజాబ్, హర్యానాలనుంచే కాకుండా ఉత్తరప్రదేశ్‌నుంచి భారీ సంఖ్యలో కర్షకులు తరలి వచ్చారు రైతులు చేపట్టిన ట్రాక్ట్టర్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకొంది. ఐటిఓ ప్రాంతంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఓ రైతు మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల లాఠీచార్జి వల్లే అతను మరణించాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఆందోళన సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పైనుంచి పడడం వల్లే రైతు మరణించాడని వారు పేర్కొన్నారు. మృతుడిని ఉత్తరాఖండ్‌లోని బాజ్‌పూర్‌కు చెందిన నవనీత్ సింగ్‌గా గుర్తించినట్లు తెలిపారు.
ఉద్రిక్తతల దృష్టా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. సింఘు, ఘాజీపూర్, టిక్రి, ముకర్బా చౌక్, నంగ్లోయి, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నంనుంచి అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను తాత్కాతికంగా నిలిపి వేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెంట్రల్, ఉత్తర ఢిల్లీలోని పది మెట్రో స్టేషన్లను సైతం తాత్కాలికంగా మూసి వేశారు.
ముగిసిన గడువు: రైతులు వెనక్కి
కాగా ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు ఇచ్చిన గడువు సాయంత్రం 5 గంటలకు ముగియడంతో నిర్దేశిత మార్గాల్లో పరేడ్‌ను ముగించి వెనక్కి మళ్లాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మినహా రైతుందరూ తిరిగి వెనక్కి వెళ్తున్నారు. కాగా ఢిల్లీలో జరిగిన సంఘటనలు దిగ్ఖ్రాంతి కలిగించేవే కాక, ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి కావని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఓ ప్రకటనలో అంటూ, రైతులందరూ ఢిల్లీ వదిలిపెట్టి సరిహద్దులకు తిరిగి వెళ్లాలని పిలుపునిచ్చారు.

అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష:అదనపు బలగాల మోహరింపునకు నిర్ణయం
దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మంగళవారం అత్యవసరంగా సమావేశమైంది.పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ముందస్తుగా అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించింది. సుమారు 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలను దేశ రాజధానిలో మోహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో దాదాపు 1500 మంది జవాన్లు ఉండనున్నట్లు సమాచారం. 10 కంపెనీల సిఆర్‌పిఎఫ్, 5 కంపెనీల రెండో తరహా పారా మిలిటరీ బలగాలను మోహరించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

సంఘవిద్రోహ శక్తులు చొరబడ్డాయి: సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
న్యూఢిల్లీ: రైతు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా స్పందించింది. సంఘవిద్రోహ శక్తులు తమ ర్యాలీలోకి చొరబడ్డాయని ఆరోపించింది. ఈ మేరకు 41రైతు సంఘాల తరఫున మంగళవారం సాయం త్రం ఒక ప్రకటన విడుదల చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల పరేడ్‌లో భారీ సంఖ్య లో పాల్గొన్న రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న అవాంఛనీయ, ఆమోదయోగ్యం కాని ఘటనలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. అలాంటి చర్యలకు పాల్పడే వారిని దరి చేయనీయబోమని రైతు నేతలు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా తాము అన్ని ప్రయత్నాలు చేసిప్పటికీ కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు రూట్‌మ్యాప్‌ను ఉల్లంఘించి ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని తెలిపింది. శాంతియుత పోరాటమే తమకు పెద్ద బలమని, ఏదైనా ఉల్లంఘన జరిగితే అది ఉద్యమాన్ని దెబ్బతీస్తుందని ఎల్లప్పుడూ భావిస్తూ వచ్చామని సంయుక్త కిసాన్ మోర్చా తమ ప్రకటనలో తెలిపింది.

Farmers Tractor Parade become violent

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News