Wednesday, November 13, 2024

సుప్రీం వృథా చొరవ!

- Advertisement -
- Advertisement -

Farmers' tractor protest on Republic Day

 

గణతంత్ర దినం (రిపబ్లిక్ డే) చేరువవుతున్న కొద్దీ ఆ రోజు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ నిరసన పట్ల అంతటా ఉత్కంఠ పెరుగుతున్నది. జాతి సమైక్యంగా, ఆనందంగా జరుపుకొని తన ప్రగతిని, బలాన్ని ప్రపంచానికి చాటుకునే రోజున రైతుల ట్రాక్టర్ ఊరేగింపుతో ఢిల్లీ నగరం దద్దరిల్లితే దేశం పరువు పోతుందని, తన ప్రతిష్ఠ పలచబడుతుందని ప్రధాని మోడీ ప్రభుత్వం భావించడాన్ని తప్పుపట్టలేము. అయితే వ్యవసాయ రంగం మంచి చెడులు, తమ మేలుకీళ్ల వివరాలు అందరికంటే ఎక్కువగా తెలిసిన రైతులే దేశ రాజధాని సరిహద్దుల్లో వేలాదిగా సమీకరణ అయి 47 రోజులుగా ఉద్యమం సాగిస్తూ ఒక్క కంఠంతో వద్దంటున్న కొత్త సాగు చట్టాలను ఒక్క కలం పోటుతో రద్దు చేసి వారిని తిరిగి ఇళ్లకు పంపించగలిగే తిరుగులేని నిర్ణయాధికారం చేతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇతరేతర మార్గాల్లో వారి నిరసనను విరమింప చేసే ప్రయత్నాలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.

రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలను ప్రభుత్వం ఇంత మొండిగా ఎవరి కోసం, ఎందుకోసం నిలబెట్టదలచిందనే ప్రశ్న రోజురోజుకీ మరింతగా బలం పుంజుకుంటున్నది. ఈ నెల 26 నాడు రైతులు ఢిల్లీలో ట్రాక్టర్/ ట్రాలీ/ వాహన ర్యాలీ నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఢిల్లీ పోలీసుల ద్వారా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనించవలసిన విషయం. దారుణమైన చలిలో ఆందోళన చేస్తున్న రైతులతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా మాట్లాడి ఉండవలసింది. అలా చేయకుండా ఎనిమిది సార్లు వారిని చర్చలకు పిలిపించి సమస్య పరిష్కారానికి సహకరించకుండా ఉద్దేశపూర్వకంగా నాన్చడం, చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సహకారంతో పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేయడం విడ్డూరం కలిగించక మానదు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరై కలుగజేసుకున్న సుప్రీంకోర్టు ఆ మూడు చట్టాల అమలును నిలిపివేస్తున్నామంటూ స్టే ఇవ్వడం, రైతు సంఘాలతో మాట్లాడి నివేదికను సమర్పించే పని మీద నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేయడం చిమ్మచీకటితో చిరుకాంతి వంటి పరిణామమే.

సుప్రీంకోర్టు తీసుకున్న చొరవ పట్ల ఆందోళనలోని రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే అది తమ డిమాండ్లను నెరవేర్చడానికి ఎంతమాత్రం దోహదపడదని వారు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. కేంద్రం గత సెప్టెంబర్ నెలలో పార్లమెంటు ఆమోదంతో తీసుకు వచ్చిన ఆ మూడు వ్యవసాయ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమైనవని రుజువు చేసే ప్రాథమిక ఆధారాలుంటే తప్ప వాటి మీద స్టే మంజూరు చేయడానికి గాని, వాటిని రద్దు చేయడానికి గాని సుప్రీంకోర్టుకు అధికారం లేదని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అలాగే రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు మంగళవారం నాడు నియమించిన కమిటీలోని నలుగురు సభ్యులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా మాట్లాడినందున వారు సభ్యులుగా ఉన్న సంఘం ద్వారా వ్యవహారం ఒక కొలిక్కి రాగలదనే ఆశలు బొత్తిగా కలగడం లేదు. సుప్రీంకోర్టు కమిటీని ఆమోదించబోమని దానితో సంప్రదింపులకు వెళ్లబోమని సోమవారం నాడే స్పష్టం చేసిన రైతు సంఘాల నేతలు మంగళవారం నాటి సాయంత్రం మళ్లీ అదే అభిప్రాయాన్ని మరింత దృఢంగా వ్యక్తం చేశారు.

ఆ కమిటీ సభ్యులు ప్రభుత్వ పక్షపాతులని కూడా వారు అన్నారు. సుప్రీంకోర్టు దేశ హితం కోరి తీసుకున్న చొరవ బూడిదలో పోసిన పాలు మాదిరిగా వ్యర్థమవుతున్న దృశ్యం కళ్లకు కడుతున్నది. ప్రభుత్వం నుంచి ఒక్క ముందడుగైనా లేకుండా రైతులను వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కి పంపించడం సాధ్యంగా కనిపించడం లేదు. వారిని బలవంతంగా ఖాళీ చేయించవలసి వస్తే ఇంత వరకు శాంతియుతంగా ప్రశంసార్హంగా సాగిన ఉద్యమం హింసాయుతమైన, అవాంఛనీయమైన మలుపులు తిరిగి అది మరింత అప్రతిష్ఠను కలిగిస్తుంది. ఢిల్లీ షహీన్ బాగ్‌లో 101 రోజులు సాగిన మహిళల సిఎఎ వ్యతిరేక ధర్నా చివరికి కరోనా నేపథ్యంలో ఎటువంటి ఫలితాన్నీ సాధించకుండా ముగింపుకి చేరుకున్న ఉదంతం రైతుల కళ్లముందున్నదే. ఆ విషయంలో కూడా సుప్రీంకోర్టు జోక్యం ఆందోళనకారులకు ఎటువంటి ప్రయోజనాన్ని కలిగించలేదు. అందుచేత ఇన్నాళ్ల తర్వాత రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా ఉంది. సుప్రీంకోర్టు ఎంత సదుద్దేశంతో వ్యవహరించినప్పటికీ దాని పాత్ర తమకు ప్రయోజనకరం కాదని వారు భావించడాన్ని తప్పుపట్టలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఆ మూడు చట్టాలను రద్దు చేయనవసరం లేకుండానే వ్యవసాయ మండీల కొనసాగింపు కోసం, పంటలకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ వ్యవస్థ పటిష్ఠంగా ఉండేలా చేయడం కోసం చట్టబద్ధమైన రక్షణలు కలుగజేసి అందుకనుగుణంగా కొత్త సాగు శాసనాలను సవరించడానికి ప్రభుత్వం సిద్ధపడడమే ఏకైక పరిష్కార మార్గంగా కనిపిస్తున్నది. వచ్చే 15వ తేదీన జరిగే మరో విడత చర్చల్లో అటువంటిదేమైనా ఊడిపడుతుందేమో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News