Home జాతీయ వార్తలు ‘గుప్కార్’ కూటమికి ఫరూక్ నేత

‘గుప్కార్’ కూటమికి ఫరూక్ నేత

Farooq Abdullah to lead Gupkar alliance

 

 

పాత కశ్మీర్ జెండానే చిహ్నం

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో వివిధ రాజకీయపార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న గుప్కార్ డిక్లరేషన్ ప్రజా కూటమికి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఛైర్మన్ అయ్యారు. రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ గుప్కార్ డిక్లరేషన్ పేరిట ఈ వేదిక ఏర్పాటు అయింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా అధ్యక్షులుగా, మాజీ సిఎం మెహబూబా ముఫ్తీ ఉపాధ్యక్షులుగా , సిపిఎం నేత యూసుఫ్ తరిగామి కన్వీనర్‌గా, పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు చెందిన సజ్జద్ లోనే అధికార ప్రతినిధిగా ఉంటారు. మెహబూబా ముఫ్తీ నివాసంలో ఈ కూటమి నేతల భేటీ తొలిసారిగాజరిగింది. ఈ సందర్భంగా కూటమి గుర్తుగా ఇంతకు ముందటి జమ్మూ కశ్మీర్ జెండాను ఎంచుకున్నారు. కశ్మీర్ జెండాను ఈ కూటమి తమ జెండాగా మార్చుకోవడం వివాదాస్పదం అయింది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత రాష్ట్రంలో పాలనా పరిస్థితిపై త్వరలోనే కూటమి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుందని అధికార ప్రతినిధి లోనే విలేకరులకు తెలిపారు. ఈ పత్రంలో ఎటువంటి భావోద్వేగాలు ఉండవని, కేవలం వాస్తవిక పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకువచ్చేలా దీనిని రూపొందిస్తామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తరువాతి పరిస్థితిని దేశ ప్రజల ముందు ఉంచుతామని, తాము కూటమి ఏర్పాటు చేసుకోవడం దేశానికి వ్యతిరేకం కాదని, కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి వ్యవహారశైలికి నిరసనతోనే అని గుప్కా డిక్లరేషన్ కూటమి వర్గాలు తెలిపాయి. ఈ కూటమి తరువాతి సమావేశం వచ్చే పక్షంరోజులలో జరుగుతుంది. ఆ తరువాత నవంబర్ 17వ తేదీన సదస్సు నిర్వహిస్తారని వెల్లడైంది.

Farooq Abdullah to lead Gupkar alliance