Home లైఫ్ స్టైల్ ఫ్యాషన్ కోచింగ్@ఆన్‌లైన్

ఫ్యాషన్ కోచింగ్@ఆన్‌లైన్

lf

చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ అంటే ఇష్టపడిన హైదరాబాద్ అమ్మాయి చందన బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశాక సరదాగా 2010లో ఒక బ్లాగ్ తెరిచింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలు ఔట్‌ఫిట్ బ్లాగర్లలో ముందుండేవి. వాటికి పోటీగా హైదరాబాద్‌లో మొదటగా బ్లాగు తెరిచి చందన మంచి పేరు తెచ్చుకుంది. మొదట్లో ఈ బ్లాగులో వ్యాసాలు రాసేది. తరువాత కొత్తకొత్త స్టయిల్స్, సెలబ్రెటీల డిజైనర్స్ సలహాలతో మొదలుపెట్టి ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ల డిజైన్స్‌పై రివ్యూలు కూడా రాస్తోంది.

ఫ్యాషన్ రంగంలో ఎవరైనా సలహాలు అడిగినప్పుడు చెపుతోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా మంచి సౌందర్య సలహాలు పొందుతున్నారు నెటిజన్లు ఆమె నుంచి. చందన ఇప్పుడు మొత్తం సమయాన్ని బ్లాగుకే కేటాయిస్తోంది. ఎవరికి ఏ సలహాలు కావాలన్నా.. అంటే మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, బ్రాండ్ ప్రమోషన్‌లను ఇస్తోంది. తన ప్రతిభతో ప్రపంచాన్ని అందంగా మలచాలనుకున్న వారికి తగిన ప్రోత్సాహం ఇస్తోంది. చందన వెబ్‌సైట్‌ని నెలకు దాదాపు అరవై వేలమంది వీక్షిస్తున్నారు. ఆమె ఫేస్‌బుక్ పేజీకి, ఇన్‌స్టాగ్రామ్‌కి నాలుగున్నర వేల మంది చొప్పున అభిమానులున్నారు. ఆఫీసులకి వెళ్లేవారి గురించి, కాలేజీ అమ్మాయిలకు లేటెస్ట్ స్టైల్స్, పెళ్లి పేరంటం ఏ సందర్భమైనా సరే.. బ్లాగర్లు రాయడానికి అనుకూలమే. వీళ్లే మోడళ్లు, డిజైనర్లు. విషయాన్ని ఎక్కువ వివరించకుండా వాస్తవికంగా ఉండే వీటిని ఇష్టపడనివారు ఉండరు. వీటిని ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. సృజనాత్మకత, తాజా ట్రెండ్‌ల గురించి తెలుసుకుంటే ఎవరైనా బ్లాగు రాయడం మొదలు పెట్టొచ్చు అంటోంది మునిపల్లె చందన.
సంపాదనా ఎక్కువే… కాస్త ఇష్టపడి, కష్టపడితే ఎక్కువే సంపాదించుకోవచ్చు. రాసింది బాగుంటే చూసేవారు పెరుగుతారు. సలహా చెప్పే తీరు నచ్చితే అభిమానించే వారు ఎక్కువవుతారు. అలా అలా ఫ్యాషన్ రంగాల వారితో చర్చలు మొదలవుతాయి. మార్కెట్‌లోకి తాము తయారు చేసిన డిజైన్ గురించి రాయమని ఒప్పందాలు చేసుకుంటాయి. చిన్నచిన్న ఫ్యాషన్ షోలకు ఆహ్వానాలు అందుతాయి. పనిలో పనిగా సొంత బ్రాండ్‌తో ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేసుకోవచ్చు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ప్రతి తారతో పరిచయాలు పెరుగుతాయి. కొన్నాళ్లు కష్టపడితే సంపాదన పెరుగుతుందని చెబుతోంది చందన.