మన తెలంగాణ/ హైదరాబాద్ : జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని మొదటిసారిగా ‘ఫాస్టాగ్ కార్ పార్క్’ను ప్రారంభించింది. కార్ పార్క్ జోన్లో ప్రయాణికులు, సందర్శకుల రాకపోకలు ఇకపై వేగంగా జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘వన్ ట్యాగ్ ఫాస్టాగ్’ మిషన్, విమానాశ్రయం ప్రత్యేక ‘ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్’ కార్యక్రమం క్రింద హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎన్పిసిఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో ఈ ఫాస్టాగ్‌ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా పార్కింగ్ ప్రవేశం, నిష్క్రమణల వద్ద ఏ మాత్రం కాలయాపన లేని ప్రత్యేక ఫాస్టాగ్ దారులను ఏర్పాటు చేశారు.
మొదట కేవలం ఐసిఐసిఐ ఫాస్టాగ్‌లతో మాత్రమే ఈ విధానం ప్రారంభం అవుతుండగా, క్రమంగా దీనిని ఇతర బ్యాంకులకూ విస్తరిస్తారు. అయితే ఫాస్టాగ్ లేని వాహనాలు ఎప్పటిలాగే ప్రస్తుత పార్కింగ్ విధానాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫాస్టాగ్ విధానం ప్రారంభంపై జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ ఎస్‌జికె కిషోర్ మాట్లాడుతూ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశంలోనే మొట్టమొదటి ఫాస్టాగ్ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం తమకెంతో ఆనందం కల్గిస్తోందని అన్నారు. ఈ కొత్త పార్కింగ్ విధానం వల్ల పార్కింగ్ జోన్లో ఎలాంటి గందరగోళమూ లేకుండా వాహనాలు వేగంగా వెళతాయి. దీనిని కేంద్ర ప్రభుత్వ డిజిటలైజేషన్, నగదు రహిత లావాదేవీలతో కూడా అనుసంధానించారు. ఈ విధానాన్ని అమలు చేయడంలో సహకరించిన భాగస్వామి ఎన్పిసిఐకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫాస్టాగ్‌తో ఇతర లాభాలతో పాటు ఇంధనం ఆదా కావడం, కాగితం, కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు.
ఈ ఫాస్టాగ్ విధానంలో ఉపయోగించుకోవడానికి సులభంగా ఉండే, రీలోడబుల్ ఎలెక్ట్రానిక్ ఆర్ఎఫ్ఐడి(రేడియో ఫ్రీక్వెన్నీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ ఉంటుంది. ప్రయాణికులు, కస్టమర్లు కార్ పార్కింగ్ జోన్‌కు వచ్చినపుడు నగదు లావాదేవీల కోసం ఆగే అవసరం లేకుండా ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ నుంచి ఆటోమాటిగ్గా పార్కింగ్ ఫీజు చెల్లింపు జరుగుతుంది. చెల్లింపులను సులభతరం చేసేందుకు పార్కింగ్ ప్రవేశం, క్యూ లైన్లను తగ్గించేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ విధానం ఎలా పని చేస్తుంది
ఈ ఆటోమాటిక్ విధానంలో కస్టమర్లు తమ ప్రీపెయిడ్ అకౌంట్‌తో లింక్ ఉన్న ఫాస్టాగ్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్‌లో ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ఉంటుంది. ఈ ట్యాగ్ అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత దానిని వాహనం యొక్క విండ్ స్క్రీన్ మీద అమర్చుకోవాలి. ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్, జారీ చేసే బ్యాంకుల యొక్క ఎన్పిసిఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తో అనుసంధానిస్తారు. ఈ విధానానికి సబ్ స్క్రైబ్ చేసిన వారు ఎలాంటి మానవప్రేమయమూ లేకుండా ఎంట్రీ వద్ద పార్కింగ్ రిసీప్ట్ తీసుకోకుండా, లేదా నిష్క్రమణ వద్ద ఎలాంటి క్యాష్,క్రెడిట్ కార్డు చెల్లింపు చేయడకుండానే పార్కింగ్ ను ఉపయోగించుకోవచ్చు.
FASTag Car Park