జోగులాంబ గద్వాల : మానవత్వం మంట కలిసింది. బుడిబుడి నడకలతో తిరిగే కొడుకుని చూసి సంతోషపడాల్సిన.. తండ్రి పురుగు మందు తాగించి ప్రాణం తీసిన ఘటన కేటీదొడ్డి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కుర్మయ్య కథనం ప్రకారం… కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన కర్రెప్పకు రెండు సంవత్సరాల క్రితం కుచినెర్లకి చెందిన నర్సమ్మతో వివాహం జరిగింది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు భరత్ ఉన్నాడు. పెళ్లయిన కొన్ని రోజులకే భార్య మీద అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. దీపావళి తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ మరింత పెరగడంతో నర్సమ్మ పుట్టింటికి వెళ్లింది. నవంబరు 29న మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భార్యను కాపురానికి పంపాలని కుచినేర్లకు వెళ్లిన కర్రెప్ప భార్యతో గొడవపడి తన కొడుకును తీసుకుని ద్విచక్రవాహనంపై నందిన్నెకు వచ్చాడు.
తన ఇంటి వద్ద ఆ పసిబాలుడికి పురుగు మందు తాగించి ద్విచక్రవాహనంపై బాలుడిని తీసుకెళ్లి భార్య వద్ద వదిలి పరారయ్యాడు. బాలుడికి పాలు తాగించడానికి తల్లి ప్రయత్నించగా అప్పటికే భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనుమానం వచ్చిన నర్సమ్మ తన కుటుంబ సభ్యుల సహకారంతో రాయచూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడి తండ్రి కర్రెప్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పురుగు మందు తాగించినట్లు ఒప్పుకున్నాడు. భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మూడు రోజులుంటే మొదటి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన బాలుడు చనిపోవడంతో నర్సమ్మ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలుడి మృతదేహాన్ని అమ్మమ్మ, తాతయ్యలు ముద్దాడుతూ ఏడుస్తుండటం అందరి కంటా కన్నీరు తెప్పించింది.
Father allegedly killed his one year old son in gadwal