Home జగిత్యాల కన్న కొడుకును హతమార్చిన తండ్రి

కన్న కొడుకును హతమార్చిన తండ్రి

Father

 

ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భార్య
కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఘటన

జగిత్యాల : కన్న తండ్రే కొడుకును కత్తితో అతి కిరాతకంగా పొడిచి హత్య చేసిన సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దోమలకుంట గ్రామానికి చెందిన నక్క రమేశ్ ఉపాధి నిమిత్తం గత 13 సంవత్సరాలుగా దుబాయ్ వెళ్తున్నాడు. ఈ యేడాది జనవరిలో రమేశ్ దుబాయ్ నుంచి ఇంటికి చేరుకున్నాడు. దుబాయ్‌లో రమేశ్‌కు వచ్చే వేతనం ఇంటికి పంపించకపోవడంతో ఆ డబ్బులు ఏం చేశావంటూ రమేశ్‌కు అతడి భార్య గంగవ్వ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భార్య, భర్తలు గొడవ పడితే వారి కుమారుడైన జలెంధర్ గొడవ వద్దంటూ వారించే వాడు. అయితే దుబాయ్ నుంచి తమకు డబ్బులు పంపించకుండా రమేశ్ అతడి సోదరి బైరి పద్మకు పంపించినట్లు తెలుసుకున్న గంగవ్వ ఈ విషయమై బుధవారం ఉదయం నిలదీసింది.

దాంతో వారి మధ్య గొడవ ముదిరి చంపుతానంటూ రమేశ్ కత్తితో భార్య గంగవ్వపై దాడి చేసేందుకు యత్నించగా జలెంధర్ అడ్డుకోబోయాడు. ఆగ్రహంతో ఊగిపోయిన రమేశ్ విచక్షణ కోల్పోయి కత్తితో కొడుకుపై దాడి చేసి హతమార్చాడు. ఈ దాడిలో భార్య గంగవ్వ కడుపులో కూడా కత్తి గాయమైంది. వెంటనే ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం రమేశ్ ఇంటి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న జగిత్యాల డిఎస్‌పి వెంకటరమణ, మల్యాల సిఐ కిశోర్, పెగడపల్లి ఎస్‌ఐ జీవన్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

Father who killed the Son