Wednesday, April 24, 2024

అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ

- Advertisement -
- Advertisement -

అమెరికా రాజధానిలో ఎమర్జెన్సీ
దేశవ్యాప్తంగా అల్లర్లకు కుట్ర: ఎఫ్‌బిఐ హెచ్చరిక

FBI warns armed protests being planned in US

వాషింగ్టన్: మరికొద్ది రోజుల్లో పదవినుంచి దిగిపోనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్ డిసి ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ నెల 20న బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆత్యయిక పరిస్థితి విధించాలన్న వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌసర్ సిఫార్సు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ డిసిలో ఎమర్జెన్సీ సోమవారంనుంచి ఈ నెల 24వ తేదీ వరకు అమలులో ఉంటుంది. మరోవైపు రాజధాని క్యాపిటల్ భవనంతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోని క్యాపిట్ళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బిఐ) హెచ్చరించడం గమనార్హం. బైడెన్ ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న కొద్దీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఎఫ్‌బిఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఎమర్జెన్సీ విధించారు. అత్యవసర పరిస్థితి కారణంగా ప్రజలకు తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంతో పాటుగా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజిమెంట్ (ఫేమా) రంగంలోకి దిగనున్నాయి. అలాగే స్టాఫర్డ్ చట్టం ప్రకారం ప్రభుత్వఆస్తుల ధ్వంసం, ప్రజల ప్రాణాలకు ముప్పు వంటి ఘటనలు తలెత్తితే వాటిని నిలువరించేందుకు భద్రతా దళాలలకు ప్రత్యేక అధికారాలుంటాయి. అలాగే, దీనికయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. జనవరి 6న క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్
ఇదిలా ఉండగా, ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో ముగ్గురు డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరగనుంది. క్యాపిటల్ హిల్‌పై దాడి చేయాలంటూ ట్రంప్ తన మద్దతుదారులను పురికొల్పారని ఆరోపిస్తూ డెమోక్రాట్లు. మీ రస్కిన్, డేవిడ్ సిసిలైన్, టెడ్ లైయులు ఈ అభిశంసన తీర్మానాన్ని సోమవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానానికి 211 మంది మద్దతు తెలిపారు. అభిశంసన తీర్మానంపై బుధవారం ఓటింగ్ జరుగుతుందని ప్రతినిధుల సభలో మెజారిటీ వర్గం నాయకుడు స్టెనీ హోయర్ సోమవారం తన పార్టీ సహచరులతో జరిగిన సమావేశంలో చెప్పారు. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు, తీర్మానం ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. దీంతో సభలో ఈ తీర్మానం ఆమోదం పొందడానికి ఇబ్బంది ఏమీ ఉండక పోవచ్చు. అయితే సెనేట్‌లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు చెరి 50 స్థానాలున్నాయి. అంతేకాదు, ఈ సభలో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. మరోవైపు ఈ నెల 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఎగువ సభలో అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశాలు లేవని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిశంసన తీర్మానంపై ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

FBI warns armed protests being planned in US

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News