Home తాజా వార్తలు రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు మాయం

రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్లు మాయం

oil price

 

చమురు ధరల పెరుగుదల భయాలు
వెల్లువెత్తిన అమ్మకాలు
642 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

ముంబై : సౌదీ అరాంకో చమురు కేంద్రంపై డ్రోన్ దాడి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మంగళవారం భారత స్టాక్ మార్కెట్‌ను ముంచాయి. ప్రధానంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం మార్కెట్లను కుదిపేసింది. స్టాక్‌మార్కెట్లు పేకమేడాల కుప్పకూలాయి. ఏ దశలోనూ కోలుకోలేదు. మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 642.22 పాయింట్లు నష్టపోయి 36,481.09 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 185.90 పాయింట్లు పడిపోయి 10,817.60 వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.2.72 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవలి కాలంలో స్టాక్‌మార్కెట్లో ఇది అతిపెద్ద పతనం, దీంతో పెట్టుబడిదారులు మునిగిపోయారు. మార్కెట్లో భారీ అమ్మకాల కారణంగా బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రెండు రోజుల్లో రూ .2,72,593 కోట్లు తగ్గి మంగళవారం 1,39,70,356 కోట్లకు పడిపోయింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత
సౌదీ అరేబియాలోని చమురు ప్లాంట్లపై డ్రోన్ దాడి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతను పెంచుతోంది. సెప్టెంబర్ 14న ప్రపంచంలోని అతిపెద్ద చమురు కంపెనీలలో ఒకటైన సౌదీ అరాంకోకు చెందిన రెండు ప్లాంట్లపై డ్రోన్ దాడి జరిగింది. దీంతో ఈ ప్లాంట్లకు చాలా నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో 5 శాతం తగ్గుదల ఏర్పడింది. సౌదీపై దాడికి గాను ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయగా, అమెరికా ఆరోపణలను ఇరాన్ తిరస్కరించింది. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి.

చమురు ధరల పెరుగుదల
డ్రోన్ దాడి కారణంగా ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో ఐదు శాతం తగ్గుదల ఉంది. ఈ కారణంగా సోమవారం ముడి చమురు ధరలు ఒకేసారి 20 శాతం పెరిగాయి. ఆ తర్వాత కాస్త పెరిగినప్పటికీ ఇంకా పెరిగవచ్చనే కథనాలు వెలువడుతున్నాయి. బ్రెంట్ ముడి ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 69 డాలర్ల వద్ద ఉంది. దీంతో భారతదేశం వంటి దేశాలపై పెను భారం పడనుంది. చమురు అవసరాలలో 75 శాతానికి పైగా భారత్ దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరల పెరుగుదలతో భారతదేశం దిగుమతి బిల్లు మరింత పెరగనుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల కోసం భారత్ 111.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడం గమనార్హం. చమురు ధరల పెరుగుదల చమురు రిటైలర్లు, పెయింట్, టైర్ కంపెనీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.

బలహీనపడిన రూపాయి
ముడి చమురు ధరల పెరుగుదల ఆందోళనలతో అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరిగంది. దీంతో గత రెండు సెషన్లలో రూపాయి 96 పైసలు క్షీణించింది. భారత కరెన్సీ విలువ డాలర్‌తో పోలిస్తే 72 రూపాయల స్థాయికి పడిపోయింది.
సౌదీ అరేబియా చమురు ప్లాంట్లపై దాడి అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరగడానికి కారణమైందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు.

సెన్సెక్స్‌లో 27 షేర్లు నష్టాల్లో..
బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో 30 షేర్లలో 27 కంపెనీల షేర్లు నష్టపోయాయి. హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ సహా ప్రధాన ఆటో, ఫైనాన్స్, ఐటి కంపెనీలు భారీగా నష్టపోయాయి. హిందూస్థాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు కూడా మాత్రమే లాభపడ్డాయి.

నిఫ్టీ 44 షేర్లు డౌన్
ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50లో 44 కంపెనీల షేర్లు నష్టపోయాయి. గెయిల్, టైటాన్, హిందుస్తాన్ యూనిలీవర్, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డి, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడ్డాయి.

Fear of oil price increases