Thursday, April 25, 2024

తెలంగాణలోని 6 గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ఫిజిబిలిటీ స్టడీ పూర్తి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు సంబంధించిన ఫిజిబిలిటీ స్టడీ పూర్తయినట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు టిఆర్‌ఎస్ ఎంపి సురేష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల్ని ప్రతిపాదించింది. ఇందులో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, వరంగల్ జిల్లా మామూనూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి.

ఇప్పటికే ఫిజిబిలిటి స్టడీ పూర్తయింది. ఇక ఈ విమానాశ్రయాల నిర్మాణమనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని మంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు విస్తరణ 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. విస్తరణ పూర్తయిన తరువాత ప్రయాణీకుల సామర్థం ఏడాదికి 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు పెరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన గిరిజన వర్సిటీకి భూకేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో ఈ వర్సిటీ ఏర్పాటకు డిపిఆర్ పూర్తయిందని, ఆర్థిక అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇక తెలంగాణ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లో ఇప్పటివరకు 752 కోట్ల విలువైన పనులు చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు.

Feasibility study complete for 6 new Airports in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News