Home స్కోర్ ఫెదరర్ @ 1

ఫెదరర్ @ 1

federer

పారిస్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. రోటర్‌డామ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేకుకోవడం ద్వారా స్విస్ స్టార్ ఫెదరర్ తన కెరీర్‌లో మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించిన ఫెదరర్ తాజాగా తన ఖాతాలో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అతని చిరకాల ప్రత్యర్థి రఫెల్ నాదల్ గాయం వల్ల కొన్ని పోటీలకు దూరం కావడంతో ఫెదరర్‌కు నంబర్‌వన్ ర్యాంక్ దక్కింది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత స్విస్ దిగ్గజం ఫెదరర్ మరోసారి పురుషుల సింగిల్స్‌లో తిరిగి నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించాడు. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించిన తొలి ఆటగాడిగా కూడా ఫెదరర్ రికార్డు సృష్టించాడు. అంతేగాక 36 ఏళ్ల వయసులో ఈ ర్యాంక్‌ను సాధించడం ద్వారా తనలో చేవ తగ్గలేదని మరోసారి నిరూపించాడు. పురుషుల టెన్నిస్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న ఫెదరర్ ఇప్పటికే తన ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ జమ చేసుకున్నాడు. మరోవైపు నాదల్, ముర్రే, జొకోవిచ్‌లు గాయాలతో సతమతమవుతు ఆటకు దూరంగా ఉంటుండంతో ఫెదరర్‌కు ఎదురే లేకుండా పోయింది. ప్రపంచ టెన్నిస్‌లోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న నాదల్, జొకోవిచ్, ముర్రేలు ఇప్పటికిప్పుడూ గాయాల నుంచి కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మరి కొంత కాలం పాటు ఫెదరర్ నంబర్‌వన్ ర్యాంక్‌కు పెద్దగా పోటీ ఎదురు కాక పోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.