Home ఎడిటోరియల్ ప్రైవేటు సూళ్ళ పైసా వసూల్…

ప్రైవేటు సూళ్ళ పైసా వసూల్…

Private School

 

తెలుగు, ఇంగ్లీష్, సాంఘిక శాస్త్రం, జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం, వాటికి సంబంధించిన నోట్ బుక్కులు.. మొత్తం కలిస్తే పదిహేను లోపే.. ఇది ఒకప్పటి విద్యార్ధి మోసిన పుస్తకాల మోత. మరి ఇప్పటి విద్యార్ధి ఎన్ని పుస్తకాలు మోస్తున్నాడో తెలుసా? ఒక్కొక్క సబ్జెక్టు కు రెండు నుండి మూడేసి పుస్తకాలు వాటికి ప్రత్యేకమైన నోట్ బుక్స్, మొత్తం టెక్ట్ బుక్కులు, వర్క్ బుక్కులు, నోట్ బుక్కులు కలిపి 30-40 వరకు ఉంటున్నాయి. ఏంటండీ హెడ్ మాస్టర్ ఈ ఘోరం.. మావాడేమన్నా స్కూల్ పిల్లాడా లేదా హమాలీ కూలీనా? అని అడిగితే అంతా మీ అబ్బాయి భవిష్యత్ కొరకే కదండీ, మీ అబ్బాయి చదివితే మాకేమైనా వస్తుందా? భవిష్యత్ లో ఐ.ఐ.టి., జె.ఇ.ఇ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షలకు పునాదిలా ఉండడానికేగా ఇన్నిన్ని బుక్స్ చదివించేది అని సమాధానం.

నిజమే కావొచ్చు కానీ, పిల్లల ఉన్నత చదువుల పేరుతో మోయలేని బరువుతో శారీరకంగా, గంటల తరబడి రాసినా ముగియని హోమ్ వర్క్‌తో మానసికంగా వారిని హింసించడం తప్ప మరేదైనా ఉందా? బస్తాల కొద్దీ పుస్తకాలు చదివితేనే పోటీ పరీక్షలకు పిల్లలను సంసిద్ధులను చేయగలం అనేది ఎంతవరకు వాస్తవం? బస్తాల కొద్దీ పుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ పేరుతో విద్యా సంస్థలు బుక్ స్టాల్స్ యాజమాన్యాల వద్ద నుండి కమిషన్‌లు దండుకోడానికి తప్ప పిల్లల మేధా శక్తి ఎంత? వారి మానసిక పరిణతి ఎంత అని బేరీజు వేసుకొని వారికి అందిస్తున్న పాఠ్యపుస్తాకాలేనా ప్రయివేటు విద్యా సంస్థల్లో పిల్లల తల్లిదండ్రులతో కొపినిస్తున్న పుస్తకాలు?

ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటలు వరకు పిల్లలకు చెప్పిన చదువు వారి మైండ్ లోకి ఎంత ఎక్కుతుందో తెలుసుకోని టీచర్లు, ఇంతింత ఫీజులు కడుతున్నాం మా పిల్లలకు చదువు సరిగా రావడం లేదు ఏంటండీ అని అడిగితే, మీ పిల్లవాడు చదువులో కొంచెం వీక్ గా ఉన్నాడు సాయంకాలం మా ఇంటి దగ్గర ట్యూషన్ చెబుతున్నాం పంపిస్తారా..? ఫీజు తక్కువే తీసుకుంటాం పంపండి అంటారు. మరి ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వారు పిల్లలకు చెప్పేదేంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలకు చదువు చెప్పి కనీసం ఒక్క గంట అయినా వారికి ఆట విడుపు ఉండకుండా సాయంత్రం కూడా ట్యూషన్ రూపంలో చదవమంటే వారి బాల్యం ఒక్క చదవడానికే పరిమితమా??

విద్యా దానం మహాదానం ఇది ఒకప్పటి నానుడి.. విద్యా వ్యాపారం మహా వ్యాపారం ఇది ప్రస్తుత నానుడిలా వినిపిస్తోంది. చిన్న పిల్లల కోసం ప్లే స్కూల్ అని పెట్టేసి వేలకు వేలు ఫీజుల రూపంలో దోచేయడం, పిల్లలు కొంచెం పెరగగానే నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి అని చిన్న పిల్లల జ్ఞానంతో సంబంధం లేకుండా బస్తాలకు బస్తాల పుస్తకాలు కొనించి, ఫీజులు దండుకుంటున్నారు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. ఇది విద్య పేరుతో దోపిడీ కాక మరేమిటి? ఎల్‌కెజి పిల్లవాడి పుస్తకాల ఖరీదు దాదాపు రూ. 2 వేల పైమాటే ఇది చిన్న స్కూల్ లో మాత్రమే సుమా..!!

అదే పెద్ద కార్పొరేట్ స్థాయి స్కూల్ అయితే ఆ ఖరీదు ఒక కుటుంబం వారి నెలవారి ఖర్చులకు సరిపోతుంది. పిల్లలకు ఏ క్లాసుకు ఎన్ని పుస్తకాలు అవసరం అవుతాయి? ఎన్ని నోట్ పుస్తకాలు అవసరమౌతాయి అనేది ప్రభుత్వం నిర్దేశించదా? ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టమొచ్చినట్టు ఎవరి స్కూల్ లో వారు ప్రత్యేక పుస్తకాలను ప్రవేశపెట్టొచ్చా? ఆ పుస్తకాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండదా? ఒక విద్యా సంస్థ లోని పుస్తకాలు ప్రత్యేక బుక్ స్టాల్ లో మాత్రమే ఎందుకు లభిస్తున్నాయి? అన్ని బుక్ స్టాల్ లలో ఎందుకు లభించడం లేదు? పుస్తకాల విక్రయం పై బుక్ స్టాల్ వారి నుండి సంబంధిత విద్యా సంస్థకు అందే కమిషన్ శాతం ఎంత? ఇలా శోధించుకుంటూ పోతే తొవ్వే కొద్దీ నిజాలు బయటపడుతూనే ఉంటాయి. ఇవన్నీ ప్రతీ సగటు మధ్యతరగతి మనిషికి తారసపడుతున్న ప్రశ్నలు. కానీ వీటికి ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎలాంటి సమాధానం చెప్పరు.

ఏప్రిల్ నెల వస్తోందంటే చదువుకునే పిల్లలకు ఎక్కడలేని ఆనందం, సంవత్సరం బాల్యం హరించుకుపోతే కనీసం ఒక నెల పదిహేను రోజులైనా ఆనందంగా బాల్యాన్ని ఆస్వాదించొచ్చునని. మరి వేసవి సెలవులు ముగుస్తున్నాయంటే మాత్రం మళ్ళీ బడికి వెళ్లాలని పిల్లలు భయపడుతుంటే, పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫారం, షూస్, టై, బెల్టు, అన్నిటికీ మించి స్కూల్ ఫీజు కట్టాలని తల్లిదండ్రులకు భయం. ఎక్కడ అప్పు తీసుకురావాలో పిల్లల ముఖాలల్లో ఆనందం చూడగలమో లేదో అనే మీమాంస.

2004లో వచ్చిన జివో నెంబర్ 91 ప్రకారం ప్రయివేట్ స్కూళ్లలో యునిఫార్మ్, బుక్స్ అమ్మొద్దని, ఒకవేళ అమ్మితే తప్పనిసరిగా డిస్కౌంట్ ఇవ్వాలని ఉంది. కానీ స్కూళ్ల యాజమాన్యాలు చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వారి బినామీలతో బుక్ షాప్ పెట్టించడం, లేదా ఏదైనా బుక్ షాప్ వాళ్లతో అధిక కమిషన్‌కు ఒప్పందం కుదుర్చుకొని బుక్స్ విక్రయంలో లాభాలను గడించడం జరుగుతోంది. ప్రస్తుతం ఏ ఒక్క ఎల్కేజీ, యుకేజి పిల్లవాని పుస్తకాల ధరలు చూసుకున్నా కూడా 2 వేల పైన మొదలుకొని స్కూల్ ను బట్టి 7 వేల వరకూ ధరలు ఉంటున్నాయి, వాటి విక్రయంలో అధిక కమిషన్ స్కూల్ యాజమాన్యానికి పోతుంది, ఇది బహిరంగ రహస్యం. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని, అట్టి పుస్తకాలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని విద్యాశాఖ సంచాలకుల ఆదేశాలు ఉన్నాయి, కానీ ఆ ఆదేశాలు అమలు అవుతున్నాయా, ఒక్కో స్కూల్ కు ఒక్కో పుస్తకాలు, ఒక స్కూల్ పుస్తకాలకు మరో స్కూల్ పుస్తకాలతో సంబంధం ఉండదు, ధరలు అయితే వారి ఇష్టమొచ్చినంత.

విద్యా హక్కు చట్టం 12(1) ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలో పొందు పరచబడి ఉంది, కానీ ప్రభుత్వాలు ఈ మేరకు ప్రైవేటు విద్యా సంస్థలలో అమలు చేసే విధంగా ముందుకు నడిచాయా? అంటే ప్రభుత్వ సమాధానం ఏంటి? సమాధానాలు చెప్పే స్థితిలో ప్రభుత్వం లేదు.. ఆ సమాధానాలను లెక్కలోకి తీసుకునే స్థితిలో ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యాలు లేవు.

ఎటొచ్చీ అధిక పుస్తకాల ధరలకు అధిక ఫీజులకు బలయ్యేది సామాన్యులైన తల్లిదండ్రులే, ఆ పుస్తకాలను మోస్తూ హమాలీల్లా కష్టించేది పిల్లలే. పిల్లల చేత వయస్సుకు మించి బరువులు మోయిస్తే బాల కార్మిక చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకోవడం చూస్తూనే ఉన్నాం.. ప్రస్తుతం విద్య పేరుతో అదే పని ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యాలు పిల్లలతో చేయిస్తున్నాయి, కాకపోతే ఇది బాలకార్మిక చట్టం క్రిందకి రాదు అంతే తేడా.

ప్రయివేటు విద్యాసంస్థల వసూళ్లు నియంత్రించడానికి ప్రభుత్వాలు చట్టాల రూపకల్పన చేయగల్గుతున్నాయి తప్ప వాటిని సక్రమంగా అమలు చేసే స్థితిలో లేవనేది నిజం. ప్రభుత్వాలు ప్రయివేటు విద్యా సంస్థల పాఠ్యపుస్తకాల పై కఠిన నిబంధనలను అమలు చేయకపోతే తల్లిదండ్రుల జేబులకు చిల్లు మాత్రమే కాక, పిల్లల మానసిక స్థితిపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడి పిల్లలను మానసికంగా శారీరకంగా హింసించినట్టే అవుతుంది, వారి ఎదుగుదల సైతం సరైన రీతిలో ఉండకపోవచ్చునని తెలుపుతున్నారు మానసిక నిపుణులు.

Fees should be Curtailed in Private School