Home మెదక్ ఎరువు..ద(బ)రువు

ఎరువు..ద(బ)రువు

 Fertilizer prices are rising TS Government

ఖరీఫ్ సీజన్ మొదలైంది. అన్నదాతలు తొలకరి కురవడంతో దుక్కులు దున్ని సేద్యపు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ దశలో ఎరువుల ధరలు పెరుగడంతో అన్నదాతలపై ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే సాగు పనుల్లో ఆరంభించిన అన్నదాతలు ఈ అదనపు భారంతో ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు పెట్టుబడి సాయంతో ఆదుకొంటే కేంద్ర ప్రభుత్వం ఆ సంతోషాన్ని ఎంతోసేపు ఉంచలేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. యూరియా ధర మాత్రం యధాతథంగా ఉండగా, మిశ్రమ ఎరువుల ధరలు మాత్రం క్వింటాలుకు సుమారు రూ.50 నుంచి రూ.100 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో మన తెలంగాణ ఆందిస్తోన్న ప్రత్యేక కథనం…
మన తెలంగాణ/పెద్దశంకరంపేట : అన్నదాతలను ఆదుకునేందుకు నిర్దేశించిన పెట్టుబడి సాయం పథకం ఓ వైపు వారిని మురిపిస్తుండగా, మరో వైపు పెరిగిన ఎరువుల ధరలు వారిని కృంగదీస్తున్నాయి. సీజన్ ఆరంభంలోనే ఎరువుల ధరలు రూ.50 నుంచి రూ.200కి పైగా పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 2,10,272 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందు కోసం దాదాపు 1,500 టన్నుల డిఎపి, కాంప్లెక్స్ (మిశ్రమ) ఎరువులు 5,600 టన్నులు, పొటాష్ 2,991 టన్నులు అవసరమవుతాయని భావిస్తోంది. ఇందులో యూరియా మినహాయిస్తే మిశ్రమ ఎరువులే ఎక్కువగా ఉన్నాయి. ఆయితే డిఎపి ఏకంగా రూ.165లు పెరగగా, 20.20.0, 12.36.16, 28.28.0 తో పాటు మిగిలినవి 50 కిలోల బస్తా సగటున సుమారు రూ.వంద వరకు పెరిగాయి. దీంతో మూడెకరాలున్న రైతుకు కనీసం రూ.వెయ్యి వరకు అదనపు భారం పడుతుంది.

ఏడాది కాలంగా రెండుమార్లు పెరిగిన మిశ్రమ ఎరువులు మళ్లీ పెరగడంపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లాలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైనన్ని ఎరువులను నిల్వ చేసుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ, మార్క్‌ఫెడ్ సంస్థలు ముందు జాగ్రత్తతో సీజనుకు ముందు గోదాముల్లో సుమారు పది వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ ఉంచుతున్నారు. దీంతోపాటు ఆయా సహకార సంఘాలు కూడా కొంత మేర తమ వద్ద కొని పెట్టుకోవడంతో జిల్ల్లా రైతులకు కొంత భాగం పాత ధరలకే అందే వీలు చిక్కుతోంది. నిల్వలు ఉన్న చోట రైతులు ప్రస్తుతం పాత నిల్వలతోనే తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇక నాట్లు మొదలయ్యే నాటికి కొత్త ధరలతో మరింత పెట్టుబడి భారాన్ని మోయవలసి ఉంటుంది. ఇదిలా ఉంటే తొలకరి వర్షాలు కురియడంతో గత రెండు రోజుల కిందట జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు పడటంతో రైతులంతా పంట సాగు పనులకు ఉపక్రమించారు. విత్తనాలతో పాటు అవసరమైన ఎరువుల కొనుగోలుపై దృష్టి సారించారు. గతంలో ఎరువుల కోసం దుకాణాల ముందు పడిగాపులు పడిన రోజులు కూడా లేకపోలేదు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకున్నా ధరల పెరుగుదల అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది.

పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇటీవలే ఎకరాకు రూ.4వేలు పంపిణీ చేసింది. సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులు ఎరువులు, మందులు కొనుగోలు చేసుకుంటున్నారు. నగదు ఒకేసారి ప్రభుత్వం చెల్లించడంతో ఒకేసారి ఎరువులను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో ఒకేసారి ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులకు గురుయ్యే అవకాశాలెక్కువగా ఉన్నాయి. రకాన్ని బట్టి 50కిలోల బరువు ఉండే ఒక్కో బస్తా రూ.90 నుంచి రూ.214 వరకు పెరిగింది. ప్రస్తుత వానా కాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, సోయాబీన్ పంటలు సాగు చేస్తున్నారు. ఈ సీజన్‌లో మిశ్రమ ఎరువుల కొనుగోలుపై రూ.1,00,80,000, డిఎపి కొనుగోలుపై రూ.64,20,000, పొటాష్ కొనుగోలుపై రూ.53,83,800 చొప్పున రూ.2,18,83,800 అదనపు భారం పడనుంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించనప్పటికీ ఎరువుల బస్తాల ధరల పెరగడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగని పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిమాణం తగ్గింపు : ఇది వరకు యూరియా ఒక్కో బస్తా బరువు 50 కిలోల వరకు ఉండేది. దీని ధర రూ.295 అయితే ధర అలాగే ఉంచి ఆయా కంపెనీలు బస్తా పరిమాణం తగ్గించాయి. ప్రస్తుతం కొత్త ప్యాకింగ్‌లో బస్తా 45కిలోలతోనే సరిపెడుతున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. దీంతో రూ.265లు ఉండవలసిన ధర రూ.30లకు పెంచకుండానే పరిమాణం తగ్గించారు. ఇది రైతులపై పెనుభారంగా పరిణమిస్తోంది. జిల్లాలో ఏటా సుమారు 60వేల మెట్రిక్ టన్నుల వినియోగిస్తున్నారు. అంటే దాదాపు రూ. రెండు కోట్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది.