Home ఆఫ్ బీట్ కోరంటి @ 102 ఏళ్లు

కోరంటి @ 102 ఏళ్లు

సీజనల్, అంటువ్యాధుల వైద్యశాలగా ప్రసిద్ధి

                  Fever-Hospital

సిటీబ్యూరో: హైదరాబాద్ నగరవాసులకు, తెలంగాణలోని పలు జిల్లాల వాసులకు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తూ సీజనల్, అంటు వ్యాధుల దవాఖానాగా ప్రసిద్ధి చెందిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి 102 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నెల 20వతేది సోమవారం నాటికి 102 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోనుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నగరంలో ప్లేగువ్యాధి ప్రబలి ప్రజలు భారీ సంఖ్యలో మృతి చెందారు. దీంతో నగరంలో గత్తర (కలరా) వచ్చిందంటూ ప్రజలు ఆందోళన చెందారు. ప్లేగు అంటువ్యాధి కావడంతో ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అప్పట్లో ఈ వ్యాధి సోకిందంటే చాలు వారు మృత్యువాత పడినట్లే. ఈ వ్యాధి బారిన పడ్డ వారిని రక్షించేందుకు జనసంచారానికి దూరంగా ఒక ఆసుపత్రిని నెలకొల్పాలని అప్పటి వైద్యాధికారులు భావించారు.

దీంతో 1915లో అధికారులు కాచిగూడ ఈరన్నగుట్టలో కోరంటి దవాఖానాను ఏర్పాటు చేసి, ప్లేగు వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించారు. దీంతో వ్యాధి ప్రబలకుండా ఆరికట్టి ప్రజలను రక్షించారు. అదే ఏడాది అంటువ్యాధులకు సంబంధించిన రోగుల కోసం నల్లకుంటలో హుస్సేన్‌సాగర్ వరదనీటి కాలువ పక్కన ఉన్న విశాలమైన స్థలంలో ప్రత్యేకంగా రేకుల షేడ్లను ఏర్పాటు చేశారు. ఈరన్నగుట్ట నుంచి దవాఖానను నల్లకుంటకు మార్చారు. అప్పట్లో ఏ అంటువ్యాధి ప్రబలినా ఇదే ఆసుపత్రిలో చికిత్సలు అందించేవారు. కాలక్రమేణా అంటువ్యాధులతో పాటు సీజనల్ వ్యాధులైన వైరల్‌జ్వరాలు, అతిసార (డమేరియా), కలరా, డిఫ్తీరియా (గొంతువాపు), టెటానస్ (ధనుర్వాతం), మమ్స్ (గదవబిళ్లలు), చికెన్‌ఫాక్స్ (అమ్మతల్లి), మీజిల్స్ (ఎర్రటిదద్దుర్లు), జాండిస్ (పచ్చకామెర్లు) తదితర వ్యాధులకు ఈ ఆసుపత్రిలో చికిత్సలు ప్రారంభించారు. వీటిలో పాటు మలేరియా, డెంగీ, చికన్‌గున్యా వంటి వాటికి ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. రేబీస్ పాటు ఇటీవల ప్రబలిన స్వైన్‌ఫ్లూ బాధితులకు కూడా ఇక్కడే చికిత్స అందిస్తున్నారు. అలాగే రోగ నిర్ధారణ పరీక్షల కోసం మొట్టమొదటి సారిగా 1960లో ఈ ఆసుపత్రిలో లేబోరేటరీని ఏర్పాటు చేసి ప్రాథమిక పరీక్షలు ప్రారంభించారు.

సర్ రోనాల్ట్‌రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్‌గా పేరు మార్పు : జ్వరాల నివారించే దవాఖానాగా పేరుగాంచిన ఈ ఆసుపత్రిని ఫీవర్ ఆసుపత్రి(కోరంటి) గా పిలువడం ప్రారంభించారు. ఈ మధ్యనే ఫీవర్ ఆసుపత్రి పేరును సర్ రొనాల్ట్‌రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికేబుల్ డీసీజెస్ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐసీడీ)గా అధికారులు మార్చారు. దోమకాటు వల్ల మలేరియా వస్తుందని పరీక్షలు చేసి కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ రోనాల్డ్‌రాస్ ఫీవర్ ఆసుపత్రిగా పిలుస్తున్నారు. ఈ ఆసుపత్రిలో 330 పడకలున్నాయి అదే విధంగా మరో 170 మంది వరకు రోగులకు చికిత్స అందిచేందుకు సదుపాయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆసుపత్రికి దాదాపు 500 నుంచి 12 వందల మంది రోగులు వస్తుంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు రోగాల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. వీరే కాకుండా కుక్కకాటు బారిన పడిన వారికి కూడ ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలోనే ప్రథమ వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు : డెంగీ, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, బ్రుషలోసిస్, లెప్టోస్పైరసిస్ (బ్యాక్టీరియా) వంటి ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణకు రోగుల నుంచి సేకరించిన రక్త నమునాలను గతంతో పూణెలోని ల్యాబ్‌కు పంపించేవారు. దీంతో వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు రావడానికి కనీసం నెలపైనే సమయం పట్టేది. ఈ కారణంగా రోగికి సోకిన వ్యాధి ఏదో వైద్యులకు వెంటనే తెలియపోవడంతో చికిత్స చేయడంలో ఆలస్యం జరిగేది. కొన్ని సందర్భాల్లో రోగి మరణించేవారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో ఓ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని 2004లో ఆసుపత్రి వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రిలో ల్యాబ్ ఏర్పాటుకు కావాల్సిన రూ.2.50 కోట్లు మంజూరు చేశారు. 2005 ఆగస్టు 21న వైరాలజీ నిర్మాణపనులను ప్రారంభిం చారు. 2009 మే 26న ల్యాబ్ నిర్మాణం పూర్తి చేసుకుని పరీక్షలకు సిద్దమైంది. అప్పటి నుంచి డెంగీ,చికెన్‌గున్యా తదితర రోగాలకే కాకుండా పలు రకాల బ్యాక్టీరియా సంబంధిత రోగాలకు ఇక్కడే పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజలను భ్రయభ్రాంతులకు గురి చేసిన స్వైన్‌ఫ్లూ వ్యాధి పరీక్షలు కూడా ఇక్కడనే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యుత్తమ సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిగా(బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌ఏపీ ఆన్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్)గా ఫీవర్ ఆసుపత్రికి 2004లో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది.