Wednesday, April 24, 2024

విద్వేషాలకు ఇది వేళ కాదు

- Advertisement -
- Advertisement -

Fight unitedly against Corona

 

దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని అంతం చేయవలసి ఉన్నది. వీలయినంత తొందరగా మామూలు ప్రపంచాన్ని మళ్లీ తెచ్చుకోవలసి ఉంది. భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా మాత్రమే కరోనా నుంచి కాపాడుకోగలమనేది తిరుగులేని వాస్తవం. వేరే దారి లేదు. ఇందుకోసం అన్ని సామూహిక సన్నివేశాలను రద్దు చేసుకోక తప్పదు. అవి దైవ సంబంధమైనవైనా మతపరమైనవి అయినా మరెంతటి ప్రాధాన్యం కలిగినవైన్నప్పటికీ, ప్రాణాలుంటే కదా ప్రార్థన చేయగలిగేది! ఇందుకనుగుణంగా శ్రీరామ నవమి పండుగకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, నమాజులు కూడా ఇళ్లల్లోనే చేసుకోవాలని ఆయా మతాల అనుయాయులకు చెందిన నాయకులు ఎప్పుడో విజ్ఞప్తి చేశారు. చాలా వరకు వారు దీనిని పాటిస్తున్నారు.

సమయ సందర్భాలు కలిసి రాకనో అప్రమత్తత కొరవడిన కారణంగానో ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలో సంభవించిన ఒక ఘటన ఒకవైపు దేశంలోని కరోనా వ్యాప్తికి కొంత మేరకు దారి తీయగా మరో వైపు దానిని మించిన మత విద్వేష ప్రచార కరోనా తలెత్తడం ఆందోళనకరం. అసలే మితవాద, మతవాద రాజకీయాలు రాజ్యం చేస్తున్న దేశంలో ఇటువంటివి ఈ విపత్కర సమయంలో చోటు చేసుకోడం ఎంతైనా ఖండించదగినది. నిజాముద్దీన్‌లోని తబ్లిఘీ జమాత్ అనే పురాతన సంస్థ కేంద్రమైన మర్కజ్ మసీదులో ఈ నెల మార్చి 13 నుంచి మతపరమైన సభలు జరిగాయి. ఈ సభలకు ఇండోనేషియా నుంచి పలువురు మత ప్రచారకులు సహా భారీ సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. అప్పటికే కరోనా భయం దేశంలో పాకింది. హోలీ వేడుకలుపైన కూడా పరిమితంగానైనా ఆంక్షలు అమలయ్యాయి.

మర్కజ్‌లో సమావేశ నిర్వాహకులు గాని, హాజరయిన వారుగాని ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోడమో, పట్టించుకున్నా మాస్కులు ధరించడం వంటి కనీస జాగ్రత్తలతో సరిపెట్టడమో జరిగినట్టు తెలుస్తున్నది. ఈ కార్యక్రమానికి హాజరయి తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని స్వస్థలాలకు వచ్చిన వారిలో వైరస్ బయటపడింది. తెలంగాణలో ఒక్క రోజే వారిలో పలువురు మరణించారు. దీనితో సహజంగానే మర్కజ్ ఉదంతం పతాక శీర్షికలకెక్కింది. ఇదంతా సహజంగా జరిగేదే. అయితే లవ్ జీహాద్ మాదిరిగానే దేశంలో కరోనా జీహాద్ మొదలయిందంటూ ట్వీట్లతో సహా ఆ మత వర్గాన్ని బోనులో ఉంచుతూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారమే బాధ కలిగిస్తున్నది. మర్కజ్‌లో తాము నిర్వహించిన కార్యక్రమం ఏడాది క్రితమే నిర్ణయించుకున్నదని ఇందులో పాల్గొన్న విదేశీయులందరికీ భారతీయ వీసాలున్నాయని నిర్వాహకులు తెలియజేశారు. ప్రధాని మోడీ ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలన్నింటినీ తాము పాటిస్తున్నామని కూడా తెలిపారు.

ప్రధాని మోడీ మార్చి 22 ఆదివారం నాడు దేశమంతటా జనతా కర్ఫూ ప్రకటించిన వెంటనే తమ కార్యక్రమాన్ని నిలిపివేశామని అప్పటికే రైళ్లు సహా రవాణా సౌకర్యాలన్నీ ఆగిపోయాయని కాలు కదపడానికి వీల్లేక మసీదులో భారీ సంఖ్యలో జనం ఉండిపోయారని మర్కజ్ యాజమాన్యం వివరించింది. దీనిని బట్టి ఇదంతా అనుకోకుండా, యాదృచ్ఛికంగా జరిగిందేగాని దురుద్దేశపూర్వకంగా చేసిందనిపించడం లేదు. విచిత్రంగా ఢిల్లీ పాలక పక్షం ఆప్ జాతీయ అధికార పార్టీ బిజెపి రెండూ మర్కజ్ కార్యక్రమ నిర్వాహకులను నిందించడంలో ఒక్కటయ్యాయి. కరోనా సంక్షోభం మధ్య 2500 మందితో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం నేరమనే అభిప్రాయానికి వచ్చాయి. ఆప్ ప్రభుత్వం మర్కజ్ మసీదు మౌలానాపై కేసు పెట్టింది. మార్చి 31న మసీదును పూర్తిగా మూసివేయించి అక్కడున్నవారందరినీ తరలించారు. ఇక్కడ ఆగి ఇతర ఇటువంటి సందర్భాలను గురించి కూడా ప్రస్తావించుకోవలసి ఉంది.

ప్రధాని మోడీ లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాతనే మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార సభ భారీగా జరిగింది. లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన రెండు రోజుల తర్వాతనే షిర్డిలో భారీ సంఖ్యలో భక్తులు ఒక చోట చేరారన్న సమాచారం గమనించదగినది. అలాగే లాక్‌డౌన్‌లోనే యుపి సిఎం ఆదిత్యనాథ్ అయోధ్యలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యాప్తంగా తెలిసో తెలియకో అనేక ఉల్లంఘనలు సంభవించి ఉంటాయి. అంతెందుకు, లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాతనే పుట్టలు పలిగినట్టు వలస కార్మికులు ఢిల్లీని చుట్టుముట్టిన వాస్తవం కళ్లముందున్నదే. అందుచేత ఇటువంటప్పుడు అందరూ అన్ని వర్గాల వారు మతాల వారు కలిసి విపత్తును ఎదుర్కోడానికి బదులు ఒకానొక వర్గం వారిపై విద్వేష భావజాలాన్ని రెచ్చగొడుతున్నారనే అభిప్రాయానికి చోటు కల్పించడం జాతికి ఎంత మాత్రం మంచిదికాకపోగా చెప్పనలవికాని హాని చేస్తుందని గ్రహించి, నిగ్రహించవలసి ఉంది.

 

Fight unitedly against Corona
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News