Wednesday, March 22, 2023

సింగరేణిలో సిఎం హామీల అమలు కోసం పోరుబాట

- Advertisement -

cpi

* గనుల వద్ద ప్రతిపక్షాల ఆందోళనలు షురూ
* హామీలు అమలు చేయాలని అధికారులకు వినతి పత్రాలు
* కదలికలు లేని కారుణ్య నియామకాలు
* మార్గదర్శకాలు లేని ఇంటి రుణాలు
* ఆచరణకు నోచుకోని బినామీ పేర్ల మార్పు
* ప్రత్యక్ష కార్యాచరణతో ముందుకు
సాగుతున్న ప్రతిపక్ష కార్మిక సంఘాలు

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ విజయం సాధించిన తరువాత గత అక్టోబర్ 7న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పలు హామీ ల వరాలు కురిపించగా వాటిని అమలు చేయాలని ప్రతిపక్ష కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. సిఎం ఇచ్చి న హామీల్లో ప్రధానమైనవాటిని పరిష్కరించకుండా నిర్లక్షం చేస్తున్నారని ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఇందులో భాగంగా గురువారం ఎఐటియుసి, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గనుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లకు వినతి పత్రాలను అందజేశారు. సిఎం కెసిఆర్ 10 అంశాలపై వాగ్దానాలు చేయగా కొన్నింటిని యాజమాన్యం ఆమోదించగా ప్రధానమైన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రతిపక్ష సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలో ఎఐటియుసి నాయకులు ఆందోళన  కార్యక్రమాలు చేపట్టి ఆయా జిఎంలకు హమీలు అమలు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు. కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కారుణ్య నియమాకాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. సిఎం ప్రకటన తరువాత సింగరేణి బోర్డులో సైతం ఎలాంటి చర్చ జరగలేదు. సింగరేణి మెడికల్ బోర్డును సులభతరం చేసేందుకు మరో 23 రకాల జబ్బులను పరిగణలోకి తీసుకుంటారని, సిఎం హామీ ఇచ్చినా అమలు కావడం లేదు. 2016 అక్టోబర్ 6న సిఎం కెసిఆర్ వారసత్వ ఉద్యోగాలను అమలు చేస్తామని ప్రకటించడంతో 12 వేల మంది కార్మికులు తమ వారసుల కోసం ధరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఓ నిరుద్యోగి కోర్టులో కేసు వేయడంతో వారసత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే దాదాపు 5వేల మంది కార్మికులు ఉద్యోగ విరమణ పొందగా వారసత్వ ఉద్యోగాలకు బదులు కారుణ్య నియామకాలు చేపడుతామని సిఎం హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. సింగరేణి వ్యాప్తం గా సుమారు 20 వేల మంది కార్మికులు బినామీ పేర్లపై ఉద్యోగం చేస్తున్నారని, వారి సొంత పేర్లను మోదు చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని సిఎం హామీ ఇచ్చినా ఆచరణలోకి రాలేదు. ప్రస్తుతం ఉన్న పేరుపై సొంత పేరు మార్చుకోవడం ద్వారా కార్మికుడి పిఎఫ్ కోడ్‌తో పాటు సిఎం పిఎఫ్ నంబర్ ఈపిఆర్‌లో మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు సొంతగా ఇంటిని నిర్మించుకునేందుకు రూ. 10 లక్షల వడ్డీలేని రుణాన్ని కేటాయించాలని, ముఖ్యమంత్రి ఆదేశించినా సింగరేణిలో అమలుకు నోచుకోలేదు. సింగరేణి వ్యాప్తంగా 52 వేల మంది కార్మికులు పని చేస్తుండగా ఇందులో 80 శాతం మంది కార్మికులు కంపెనీ నిర్మించిన క్వార్టర్లలో ఉంటుండగా మిగతా 20 శాతం మంది సొంత ఇల్లు, అద్దె ఇళ్లలో ఉంటున్నారు. రూ.10లక్షల రుణానికి సంబంధించి మార్గదర్శకాలను యాజమాన్యం ఇప్పటి వరకు తయారు చేయకపోవడం వలన కార్మికులు ఇబ్బందులకు గురువుతున్నారు. ఇప్పటికే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఎఐటియుసి), నాయకులు గత నెల 20న అన్ని జిఎం కార్యాలయాల ఎదుట సిఎం హామీలను అమలు చేయాలని ధర్నాలు చేశారు. అదే విధంగా సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్‌ఎంఎస్), సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టియుసి)తో పాటు సిఐటియు నాయకులు గురువారం పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష కార్మిక సంఘాలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నాయి. సింగరేణి యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే దిశలో ఆందోళన బాట పట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News