Home లైఫ్ స్టైల్ పేదల ఆపన్నహస్తం మనం సైతం

పేదల ఆపన్నహస్తం మనం సైతం

film actor kadambari kiran exclusive interview

ఆయన ఒక తెలుగు నటుడు. హాస్య ప్రధానమైన, సహాయ పాత్రలు చేస్తూ టివి, సినిమాల్లో నటిస్తున్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ, ఇప్పటి వరకూ 270కి పైగా సినిమాల్లో నటిస్తూనే, పేదల కోసం ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది పేదవారికి ఆర్థిక సహాయం చేస్తున్నాడు. నేను బతికున్నంతకాలం సాధ్యమైనంత వరకూ పేద వాళ్లకు సాయం చేస్తానంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. పేదరికం, ఆకలి, ఆక్రోశం నుంచి పుట్టిందే మనం సైతం అంటూ మానవత్వాన్ని చాటుకుంటున్న సినీ నటుడు కాదంబరి కిరణ్ సకుటుంబంతో ముచ్చటించాడు…

‘మనం సైతం’ స్థాపించాలని ఆలోచన ఎలా వచ్చింది..
పేదరికం, ఆకలి, ఆక్రోశం నుంచి పుట్టిందే మనం సైతం. 2014 సెప్టెంబర్ 22న ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ సంస్థ ఉద్దేశం కుల మత ప్రాంత తేడా లేకుండా సాధ్యమైనంత వరకూ పేదవాళ్లకు సహాయం చేయడం. నేను చిన్నప్పటి నుండి పేదరికంలో కష్టాలు ఎలా ఉంటాయే అనుభవించిన వాడిని. అలాంటి పేదరికంలో ఉన్న ప్రజలకు చేయుతనివ్వడం ఎలా అనే ఆలోచన నుండి పుట్టిందే మనం సైతం. సహాయం చేసిన వారికంటే పొందిన వాళ్లకు అది ఎప్పుడూ గుండెల్లో నిలిచిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్లకు కాదంబరి ఉన్నాడన్న ధైర్యం ఇవ్వాలనుకున్నాను. నేను బతికున్నంతకాలం నాకు సాధ్యమైనంత వరకూ పేద వాళ్లకు సహాయం చేస్తూనే ఉంటాను.

మీరు నిస్సహాయుల్ని ఎలా గుర్తిస్తారు
రోజు వారి జీవితంలో ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటాం. మాకున్న పరిచయాలు, పేపరు, టీవీలు చూస్తుంటాం. సోషల్ మీడియా లాంటివి నిస్సహాయుల్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంటాయి. వారి గురించి తెలుసుకోగానే వారి పూర్తి వివరాలు ఆధార్ కార్డు వంటివి సేకరించి వారి పరిస్థితిని తెలుసుకుంటాను. అప్పుడు ఒక్కక్కరుగా ఆ ప్రాంతంలో ఆ సమస్య ఉంది నేను కొంత ఇస్తున్నాను మీరు కూడ సహాయం చేయాలని ప్రచారం చేస్తాం. అలా ఒక్కొక్కరుగా తలా కొంత పోగుచేసి బాధితుడికి అండగా నిలబడుతాం.

ఇప్పటి వరకూ ఎంత మందికి సహాయం చేశారు
మనం సైతం సంస్థ ద్వారా ఇప్పటి వరకూ 80 మందికి చేయుతనందించాం. అన్ని రాష్ట్రాలకు మనం సైతం ఆదుకుంటుంది. అనాథలకు చేయూతనివ్వడం. పేద పిల్లలకు ఫీజులు కట్టడం, సమస్యలు వచ్చి డబ్బు కట్టలేని పరిస్థితిలో హాస్పిటల్ లో ఉన్నవారికి సాయం చేస్తున్నాం.
మీ భార్యా పిల్లలు ఎలా సహకరిస్తారు
మా భార్య కళ్యాణి కమిటీలో మెంబర్. ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నారని చెప్పగానే వెళ్లండి అంటుంది కాని మనకెందుకు వద్దు అనలేదు. పిల్లలు నుంచి మంచి సహకారం ఉంటుంది. వాళ్లు కూడా వారికి తోచినంత వారు మంచి పనులు చేస్తున్నారు.

మీరు చేసిన మంచి పనుల గురించి..
భువనగిరిలో 14 సంవత్సరాల పిల్లలు దీపావళి రోజున బిల్డింగ్ పై పతంగులు ఎగరేస్తూ కరెంట్ వైర్లకు తగిలి సగం కాలిపోయారు. హాస్పిటల్ లో బిల్లు కట్టలేని పరిస్థితి వాళ్లది. ఆ విషయం తెలియగానే అక్కడికి వెళ్లి డాక్టర్లతో మాట్లాడి ఫీజు తగ్గించి అక్కడే 30 వేలు జమ చేసి కట్టి వచ్చాను. అల్లరి సుభాషిణికి కేన్సర్ వస్తే ఫీజు 4 లక్షలు కట్టాలన్నారు. ఆమె స్టోరీని న్యూస్ ఛానెళ్లలో పెట్టి ప్రచారం చేస్తే నాలుగు లక్షలు వచ్చాయి.అప్పుడు ఆమెకి ఫీజు కట్టాము. ఇలా ఎంతో మంది నిస్సహాయులకు వృద్ధులకు సహాయం చేస్తున్నాం. ఫీజులు కట్టడమే కాదు హాస్సిటల్ లో ఆధిక ఫీజుల గురించి డాక్టర్లతో మాట్లాడి బిల్లు తగ్గిస్తుంటాం. ప్రస్తుతం కేరళ బాధితుల సహాయార్థం ఛాంబర్ ముందు టెంట్ వేశాం.

నేపథ్యం..
మాది తూర్పు గోదావరి జిల్లా. కాకినాడ గురిజాన పల్లే, మా నాన్న సాల్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసేవారు. మా అమ్మ గృహిణి. నేను బికాం, బిఎస్‌సి చదువుకున్నాను. 1983 వరకూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే . మా అమ్మమ్మ వాళ్లు హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. 1977లో సినిమాల మీద ఆసక్తితో నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడి పోయాను.

మనం సైతంలో సినీ ప్రముఖుల పాత్ర ఉందా..
మనం సైతంలో సినీ ప్రముఖులే కాదు అందరి పాత్ర ఉంటుంది. సహాయం చేసే వారందరికీ మనం సైతం స్వాగతం పలుకుతుంది. మంత్రి కెటిఆర్, ఎంపీ సంతోష్, తలసాని శ్రీనివాస యాదవ్, దాసరి నారాయణరావు, చిరంజీవి, ఐఏఎస్, ఐపిఎస్‌లు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఎందరో మనస్సున్న వారందరు ముందుకు వచ్చారు. మనం సైతం నిస్వార్థమైన సంస్థ. ఇది వ్యక్తిగత పేరు కోసం కాదు పేద ప్రజలకు చేయూత నిచ్చే సంస్థ అని అందరూ సహకారం అందిస్తున్నారు. నా కుటుంబం పేదవారే. నా లక్షం నా గమ్యం పేదవారి అభివృద్ధి. ఎప్పుడు పుట్టాం ఎప్పుడు చనిపోయాం అన్నది కాదు బతికున్నంత కాలం ఎలా బతికాం ఏం సాధించాం అన్నది ముఖ్యం. ఆర్థికంగా ఉన్నవారంతా పేద పిల్లలకు ప్రజలకు చేయూతనివ్వండి.

మీ సినిమా ప్రస్థానం ఎలా మొదలైంది..
నేను చిన్నప్పటి నుండి వేషాలు వేసేవాడిని . అలా సినిమాల పట్ల ఆసక్తి పెరిగింది. మూడు సంవత్సరాలు సినిమాలో అవకాశం కోసం ఎదురుచూశాను. షూటింగ్‌లకు రోజూ ఉస్మానియా యునివర్సిటీ నుండి ఇందిరాపార్క్ వరకూ ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాడిని. అలా ఒక మూడు సంవత్సరాలు సినిమా ఆర్టిస్టులకు టీ, బిస్కెటు అందించాను. షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు నటించే వాళ్లను చూసి వాళ్లు చేసే ప్రోగ్రామ్స్ చూసి నటన నేర్చుకున్నాను.

మీ సినిమాల్లో అవకాశం అంతా సులభం కాదు అంటారు. మరీ మీ సినిమా కష్టాల గురించి…
అప్పుడు చెన్నైలో స్టూడియో ఉండేది. ఎప్పుడైనా హైదరాబాద్ షూటింగ్‌లకు ఇక్కడకు వచ్చేవారు. కొన్ని చిన్నచిన్న షాట్లకు మమ్మల్నీ పెట్టుకునేవారు. కాని మాకు డబ్బులు ఇచ్చేవారు కాదు. అడిగితే అన్నం పెడుతున్నాం కదా ఇంకేంటి చాలదా! అన్నట్లుగా మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. కొంత కాలం తర్వాత ‘అచుత్ ’ హీరోగా కథా స్రవంతి సీరియల్ తీస్తే మంచి విజయం సాధించింది. అప్పటి నుండి విజయాలు వస్తున్నాయి. కాని గుర్తింపు రావట్లేదు. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మేము ఎవరినీ ప్రశ్నించకూడదు అనేవారు. ఎందుకంటే అన్నింటికీ అడ్డు పేదరికమే.

అలిశెట్టి ప్రభాకర్,నగ్నముని, దేవీప్రియ మేమంతా స్నేహితులం. గొప్ప జర్నలిస్ట్ జి.కృష్ణా సార్ నాకు గురువు. వాళ్ల అబ్బాయిలతో స్నేహం ఉండేది. ఆయన గొప్ప వ్యక్తి చాప మీద పడుకునేవాడు. తనకంటూ సొంత ఆస్తి సంపాదించుకోలేదు. అద్దె ఇంట్లోనే ఆయన శ్వాస విడిచారు. ఒక సందర్భంలో అలిశెట్టి ప్రభాకర్ అన్న మాట ఎప్పటికి నన్ను కదిలిస్తునే ఉంటుంది. మనకు ఇళ్లు లేదని అంటే “ఇళ్లు లేకపోవడమేంటి ఆరడుగుల బొంద (ఇళ్లు ) మనకోసం ఎదురుచూస్తుంది” అనేవాడు ఆయన మాటలు నాకు స్ఫూర్తిగా నిలిచాయి.

మీరు దర్శకత్వం వహించిన సినిమాలు, సీరియల్స్…
మూవీ ఆర్టిస్టుగా 14 సంవత్సరాలు పని చేశాను. తెలుగు టెలివిజన్‌లో కొంత కాలం పనిచేశాను. జెమిని టెలివిజన్‌లో “శాన్‌మేరి” లాంటి వెయ్యికి పైగా ప్రోగ్రామ్స్ చేశాను. తరువాత మల్లాది నవల “బ్లఫ్ మాస్టర్‌” కు నేను దర్శకత్వం వహించాను. అది నాకు గొప్ప పేరు తెచ్చిపెట్టింది. 1996 లో కుర్రాళ్ల రాజ్యం సినిమా తీశాను. అప్పటి నుండి నా సినిమా జీవితం మొదలైంది. ఇప్పటికి 270 సినిమాలు చేశాను. నా దగ్గర పని చేసిన వాళ్లు చాల మంది డైరెక్టర్ల్, హీరోలు, కళాకారులు అయ్యారు.

                                                                                                                                                – బొర్ర శ్రీనివాస్