Home రాష్ట్ర వార్తలు సినీ మోజుతో అభయ్ హత్య

సినీ మోజుతో అభయ్ హత్య

ముక్కును ప్లాస్టర్‌తో మూసివేయడంతో చనిపోయిన బాలుడు
ముగ్గురు నిందితుల అరెస్ట్, మీడియా ముందు ఉదంతాన్ని వివరించిన కమిషనర్

policeసిటీబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యా ర్థి అభయ్ (15) కిడ్నాప్, హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అభయ్ హత్యకు రెండు రోజుల ముందు యూట్యూబ్‌లో వారు చూసిన ఓ క్రైమ్ సినిమానే కిడ్నాప్‌నకు పురిగొ ల్పింది. అభయ్ మూతికి ప్లాస్టర్ చుట్టే క్రమంలో ముక్కుపై నుంచి కూడా చుట్టి రూమ్‌లో పడేయడంతో ఊపిరాడక అతడు మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరా లను నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం విలే కరుల సమావేశంలో వెల్లడించారు. మొదటి నిందితుడు   తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకలూర్ గ్రామానికి చెందిన శేషుకుమార్ అలియాస్ సాయి (20) షాహినాయత్ గంజ్‌లోని అభయ్ ఇంటి పక్కనే నివాసముంటున్న హనుమాన్‌దాస్ ఇంట్లో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే అభయ్‌తో పరిచయం కలిగింది. రెండు నెలల క్రితం శేషుకుమార్ ఫేస్‌బుక్ ద్వారా ‘బాలుపౌల్’ అనే ఓ సినిమా హీరో గురించి తెలుసుకున్నాడు. అతడిలా తాను కూడా సినిమాలలో నటించాలనే ఆశ మొదలైంది. ఉద్యోగం మానేసి పక్కనే ఉన్న గోషామహల్‌లోని హిందీనగర్‌లో నెలకు రూ.7000లకు ఒక రూమ్‌ను అద్దెకు తీసుకున్నాడు. తన స్నేహితులైన రెండో నిందితుడైన శ్రీకాకుళం జిల్లా మలియపుట్టి మండలం జడుపల్లి గ్రామానికి చెందిన పి.రవి (20), మూడో నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం రట్టకన్న గ్రామానికి చెందిన యన్.మోహన్ (23)లను గత నెలలో పిలిపించుకున్నాడు. ముగ్గురు కలిసి సినిమాలలో నటించడానికి కావాల్సిన డబ్బును సంపాదించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే డబ్బు ఎలా సంపాదించాలనే విషయంపై ముగ్గురు కలిసి ప్రతిరోజు చర్చించుకునేవారు. ఇలా నెలరోజులు గడిచాయి. ఈ నెల 14న కూడా డబ్బు సంపాదనపై చర్చించుకున్నారు. అదే రోజు ముగ్గురు కలిసి రూమ్‌లో సెల్‌ఫోన్ ద్వారా యూట్యూబ్‌లో “ఒక రోమాంటిక్ క్రైమ్ కథ” అనే తెలుగు సినిమాను చూశారు. ఆ సినిమాలో డబ్బు సంపాదన కోసం చైన్‌స్నాచింగ్‌లు, కిడ్నాప్‌లకు పాల్పడిన సన్నివేశాలు ఉన్నాయి. అదే మాదిరిగా తాము కూడా డబ్బు సంపాదించాలని ధన వంతుల పిల్లలను కిడ్నాప్ చేయాలనే ఆలోచనకు వచ్చారు. తనకు పరిచయం ఉన్న అభయ్ అనే పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేయడం ద్వారా అతని తండ్రి నుంచి డబ్బులు రాబట్టవచ్చని శేషుకుమార్ చెప్పడంతో అతని ఇద్దరు స్నేహితులు రవి, మోహన్‌లు సమ్మతించారు. ఈ నెల 16న సాయంత్రం 4.30 గంటలకు అభయ్ గోడేకికబర్‌లోని టిఫిన్ సెంటర్‌కు తన స్కూటీపై వచ్చాడు. ఈ విషయం పసిగట్టిన శేషు అతని వద్దకు వెళ్లి తన గది వరకు లిఫ్ట్ ఇవ్వాలని కోరడంతో అభయ్ సరేనని వాహనాన్ని శేషుకు ఇచ్చి తాను వెనకాల కూర్చున్నాడు. సాయంత్రం 5 గంటలకు శేషు గదికి చేరుకున్నారు. అప్పటికే రవి, మోహన్‌లు అక్కడ ఉన్నారు. అభయ్‌కి కూల్‌డ్రింక్ ఇచ్చి అతడిని కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. తనను చంపవద్దని అభయ్ వేడుకున్నాడు. కావాలంటే తన సెల్‌కు వచ్చిన చిన్నమ్మ నెంబర్‌కు ఫోన్ చేస్తే తన తండ్రి డబ్బులు ఇస్తాడని అభయ్ చెప్పాడు. స్కూటీని ఎవరైనా చూస్తే కిడ్నాప్ గుట్టు రట్టు అవుతుందని భావించిన నిందితులు అభయ్ కాళ్లు, చేతులు తాడుతో కట్టేశారు. ఆ తరువాత మూతికి ప్లాస్టర్ వేశారు. దానిని ముక్కు పైనుంచి బిగించిన సంగతి గమనించలేదు. ఆ స్థితిలోని అభయ్‌ని గదిలోనే పడేసి స్కూటీ మీద దారుసలాంలోని ఓల్గా హోటల్‌కు వెళ్లారు. అక్కడ దానిని పార్క్ చేసి తిరిగి తమ రూమ్‌కు చేరుకున్నారు. ముక్కుకుకూడా ప్లాస్టర్ వేయడంతో అప్పటికే అభయ్ ఊపిరాడక చనిపోయాడు. దీంతో కిడ్నాపర్లు ఖంగుతిన్నారు. ముందుగా శవాన్ని అక్కడి నుంచి మార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారు. ఆదరబాదరగా అట్టపెట్టెలో శవాన్ని పెట్టి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అల్ఫా హోటల్ దగ్గర రోడ్డుపై వదిలి వెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అభయ్ చనిపోయినా వారికి జాలి, భయం కలగలేదు. డబ్బుపై ఆశ చావలేదు. అభయ్ ఇచ్చిన సెల్‌నెంబర్‌కు ఫోన్ చేసి అతడిని తాము కిడ్నాప్ చేశామని రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని అభయ్ తండ్రి రాజ్‌కుమార్ చెప్పడంతో కనీసం రూ.5 కోట్లయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా డబ్బు కోసం చర్చలు సాగుతుండగానే ఆ పార్శిల్ వద్దకు పోలీసులు చేరుకోవడంతో అభయ్ శవం బయటపడింది. దాంతో డబ్బుపై ఆశ వదులుకుని వారు విజయవాడ వెళ్లిపోయారు. అక్కడ రైల్వే ట్రాక్‌పై తమ సెల్‌ఫోన్‌లను పడేశారు. అక్కడి నుంచి ఒరిస్సాలోని బరంపూర్‌కు వెళ్లేందుకు ఇచ్చాపురం చేరుకున్నారు. అక్కడ మాటు వేసిన టాస్క్‌ఫోర్స్ డిసిపి లింబారెడ్డి, ఇన్‌స్పెక్టర్ రాజావెంకట్‌రెడ్డిలకు ముగ్గురు నిందితులు చిక్కారు. సినిమాలలో నటించేందుకు కావాల్సిన డబ్బును సంపాదించాలనే దురాశతోనే అభయ్‌ను కిడ్నాప్ చేశామని, తమ ప్లాన్ బెడిసికొట్టడంతో శవాన్ని పడేసి పారిపోయామని నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
100 సిసి ఫుటేజ్‌లలో ఆధారాలు సేకరించాం
కిడ్నాప్ జరిగిన ప్రదేశం నుంచి సికింద్రాబాద్ వరకు ఏర్పాటుచేసిన 100 సిసి కెమెరాలలో నిందితుల ఫుటేజ్‌లు ఉన్నాయని,వాటిని సేకరించామని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. దీని ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడుతుందన్నారు. సిసిటివి ప్రాజెక్ట్ నగరంలో విస్తృతంగా అమలు కావడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు.