Friday, March 29, 2024

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

- Advertisement -
- Advertisement -

Power Authorities

 

ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగలు విభజనపై ఇదే చివరి సమావేశమని జస్టిస్ ధర్మాధికారి స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచన మేరకు ఆదివారం సమావేశం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారుల అభిప్రాయాలను, అభ్యంతరాలను జస్టిస్ ధర్మాధికారి స్వీకరించారు. వారందించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వారం రోజుల్లో అనుబంధ నివేదికను ఇవ్వనున్నామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ అనేక పర్యాయాలు రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం గత నెల 24న తుది నివేదికను అందించడం జరిగింది.

ఈ నివేదిక ప్రకారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు విడుదల చేసిన ఎపి స్థానికత కలిగిన 1157 మందిలో అవకాశం ప్రకారం 655 మందిని ఎపికి, తెలంగాణ 502 మంది తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరాలను తెలిపితూ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంతో పాటు అక్కడి ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే తుదిగా ఇచ్చిన ఉత్తర్వులలో మీకు ఎలాంటి అభ్యంతరాలైనా ఉంటే కమిటీ ముందుకు తీసుకెళ్ళాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ధర్మాధికారి కమిటీ డిల్లీలో ఆదివారం రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తుది నివేదికలో తెలిపినట్టుగా తెలంగాణ విడుదల చేసిన వారిని ఎవ్వరినీ తీసుకోమని, ఆ కేటాయింపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ తరపునవారు వెల్లడించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

పూర్తి వివరాలను పరిశీలించిన మీదట మరో వారం రోజుల్లో తుది నివేదికను వెల్లడిస్తామని, ఆ నివేదిక ప్రకారం కేటాయింపులను అందరూ అంగీకరించాల్సిందేనని జస్టిస్ ధర్మాధికారి సూచించినట్టు విద్యుత్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇంధ వనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ధర్మాధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సమావేశానికి తెలంగాణ విద్యుత్ శాఖ సిఎండి ప్రభాకర్‌రావు, ఎస్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి, ఎన్‌పిడిసిఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జెఎండి శ్రీనివాస్‌రావు, హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ అశోక్ కుమార్, తెలంగాణ ఇంజనీర్స్ సంఘం అధ్యక్షుడు శివాజీ, ప్రధాన కార్యదర్శి రామేశ్వర్‌శెట్టి, అకౌంట్స్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Final report on division of Power Authorities
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News