Home తాజా వార్తలు ఫార్మాకు తోడ్పడండి

ఫార్మాకు తోడ్పడండి

Pharma City

 

హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పార్కు

జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా కేంద్రం గుర్తించింది, దీని వల్ల రూ. 64వేలకోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం
సుమారు 5లక్షల 60వేల మందికి ఉపాధి కలుగుతుంది, మౌలిక వసతులకు రూ.1318కోట్లు, సాంకేతిక సదుపాయాలకు రూ. 2,100కోట్లు ఇవ్వండి, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్‌లకు మంత్రి కెటిఆర్ లేఖలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటికి పెద్ద ఎత్తున అర్ధిక సహాయం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మా సిటీని జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (నిమ్జ్)గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో కేంద్రం, నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా కల్పించాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖల్లో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పన కోసం గ్రాంట్ రూపంలో అర్ధిక సహాయం ప్రకటించాలని కోరుతూ కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు, ఫార్మాసిటీ అవసరమైన సహజ వాయువు (నాచురల్ గ్యాస్)ను ప్రిఫరెన్సియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాల్సింగా కోరుతూ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మంత్రి కెటిఆర్ మరొక లేఖ వ్రాసారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మా పార్కు అని అన్నారు. దేశంలోని ఫార్మా రంగ అభివృద్ధికి ఈ పార్క్ దోహదం చేస్తుందని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఫార్మాసిటీని గుర్తించిందని లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీంతోపాటు జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్‌గా సూత్రప్రాయంగా గుర్తించినదన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మా సిటీకి దేశీయ మరియు అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తుందని, హైదరాబాద్ ఫార్మా సిటీ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమ స్పూర్తి మేరకు హైదరాబాద్ ఫార్మా సిటీ అంతర్జాతీయ ఫార్మా రంగంలో భారతదేశం లీడర్ పొజిషన్ మరింత బలోపేతం చేస్తుందని, దేశీయా ఫార్మా తయారీ రంగానికి కీలకం అవుతుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీకి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ సవివరంగా లేఖ రాశారు. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు రాసిన లేఖలో హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపైన వివరాలు అందించారు. హైదరాబాద్ ఫార్మా సిటీ జీరో లిక్విడ్ డిచార్జ్ (శూన్య ద్రవ వ్యర్దాల) పద్ధతిలో కాలుష్య రహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. ఫార్మా సిటీ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీ, లాజిస్టిక్స్ పార్క్, ఫార్మా ట్రైయినింగ్ మరియు టెస్టింగ్ పరిశోధనాశాలలు, కామన్ డ్రగ్ డెవలప్మెంట్ సెంటర్ వంటి సౌకర్యాలతో పాటు ఫార్మా రంగంలోని స్టార్టప్ లకు ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొత్తం 19,333 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ పూర్తయిందని మొదటి దశలో భాగంగా 8,400 ఎకరాలకు డిటైల్ డిజైన్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటుచేసి మొదటి దశ పనులను ప్రారంభించిందని తెలిపారు. ఫార్మాసిటీ ద్వారా సుమారు రూ. 64,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉన్నదని, ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 5 లక్షల 60 వేల మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉన్నదని తెలిపారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఫార్మాసిటీకి నిమ్జ్ పాలసీ మార్గదర్శకాల మేరకు బహిరంగ మౌలిక వసతుల కల్పన కోసం రూ. 1318 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా అందించాలని కోరారు. దీంతోపాటు అంతర్గత మౌలిక వసతుల కల్పన, కామన్ ఎప్లూయంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ వంటి సాంకేతిక మౌళిక వసతుల సదుపాయాల కోసం మరో 50 శాతం ఖర్చు (సూమారు 2100)కోట్ల సహాయం అందించాలని కోరారు.

ఫార్మా సిటీలో ఏర్పాటు చేయనున్న కంపెనీల ఇంధన అవసరాలకోసం సహజవాయువును ప్రిఫరెన్సియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు బొగ్గును ఇంధనంగా వాడుతున్నాయని, అయితే గ్రీన్ ఇండస్ట్రియల్ కాన్సెప్ట్ (కాలుష్య రహిత పద్ధతిన) ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం సహజ వాయువు వాడాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం ఉన్న పద్ధతితో పోల్చుకుంటే ఇది కొంత ఖర్చుతో కూడుకున్న నేపథ్యంలో ఫార్మా రంగ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకు సహజ వాయువు సరఫరా చేయాల్సిందిగా కెటియార్ తన లేఖలో కోరారు. ఫార్మాసిటీలోని యూనిట్లకు అవసరం అయిన 3.4 ఎంఎంఎస్‌సిఎండి ( మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిర్ మీటర్ పర్ డే) కేటాయించాలని కోరారు.

Financial support should be provided to Pharma City