మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : రేషన్ దుకాణాల్లో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు గాను ప్రభుత్వం బయోమెట్రిక్ (ఈపాస్) విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేషన్ దుకాణాల్లో ఈపాస్ విధానాన్ని ఫిబ్రవరి నెల నుంచి వినియోగించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈపాస్ విధానం ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ షాపు డీలర్లకు ఈ యంత్రాలను వినియోగించేందుకుగాను శిక్షణ ఇచ్చారు. అంతే కాకుం డా వారికి బయోమెట్రిక్ యంత్రాలు అందజేశారు. ఇందులోభాగంగా మంచిర్యాల జిల్లాలోని 18 మండలాల్లో 423 దుకాణాల్లో కలిపి మొత్తం 2,12,566 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 1,97,234 ఆహార భద్రత కార్డులు, 192 ఆంత్యోదయ, 15,050 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. ప్రతినెల జిల్లాలో 40,824 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తారు. ఇకపై లబ్ధిదారులు రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రల ద్వారా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేయక పోయినప్పటికీ బినామీల పేరిట రిజిస్ట్రర్లలో పేర్లు రాసి వారికి ఇవ్వకుండా వారి పేరిట గల బియ్యాన్ని స్వాహా చేస్తూ అక్రమాలకు పాల్పడేవారు. డీలర్ల అక్రమాలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వ సబ్సిడీ బియ్యం పేదలకు నేరుగా అందే విధంగా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసింది. మిగిలిన కోటా వివరాలు ఈ-యంత్రాలలో పొందుపరుస్తారు.
మిగులు బియ్యాన్ని ప్రభుత్వానికి డీలర్లు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. జిల్లాలోని 423 మంది డీలర్లతో పాటు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వేలిముద్రలను సేకరిస్తారు. సాధారణంగా రేషన్ దుకాణాల్లో డీలర్లు కాకుండా బినామీలే ఎక్కువగా సరఫరా చేస్తుంటారు. ఇప్పటి వరకు ఎవరు బియ్యం తీసుకున్నా తీసుకోకపోయిన లిఖిత పూర్వక రిజిస్టర్లు మాత్రమే లెక్కలకు సాక్షాలుగా ఉండేవి. ఈపాస్ విధానం వలన రేషన్ షాపులో ఎవరైన ఇద్దరే వ్యక్తులు సరుకులను పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. వీరు కాకుండా ఇతరులు పంపిణీ చేస్తే ఈ యంత్రాలు పని చేయవు. లబ్ధిదారులు కూడా బియ్యం తీసుకోవాలంటే వారి ఆహార భద్రత కార్డుపై ఉన్న లబ్ధిదారులు మాత్రమే వేలిముద్రల ఆధారంగా సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు లేకపోతే వారిపేరున సరుకులు పంపిణీ చేయడం జరగదు. ఒకవేల లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా బియ్యం తీసుకోనట్లయితే ఇక వారికి ఆ నెల బియ్యం పంపిణీ చేయడం జరగదు. ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. 15లోగా బియ్యం తీసుకోకపోయినట్లయితే యంత్రాలు పని చేయక మిగులు కోటా కింద చూపిస్తాయి. మొదట్లో ప్రభుత్వం బియ్యం తీసుకునేందుకు కొద్దిపాటి వెసులుబాటు కల్పించినప్పటికీ జూన్ తరువాత బియ్యం పంపిణీ నిలిపివేస్తారు. ఈ యంత్రం ద్వారా బియ్యం తీసుకున్న ప్రతి లబ్దిదారునికి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో పూర్తి వివరాలు పొందు పరుస్తారు. మరోవైపు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణానికి వెళ్లే స్టాక్ వివరాలు కూడా యంత్రంలో పొందు పరుస్తారు. బయోమెట్రిక్ యంత్రాలు ఇంటర్‌నెట్‌తో నడుస్తున్నందు వలన మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదరయ్యే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్ సౌకర్యం లేకపోవడం వలన బయోమెట్రిక్ యంత్రాలు పని చేయడం కష్టతరంగా మారింది. ఈవిషయమై జిల్లా పౌరసరఫరాల అధికారిని వివరణ కోరగా ఫిబ్రవరి నెల నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తానన్నారు. ఇప్పటికే ఈ యంత్రాలపై డీలర్లకు అవగాహన కల్పించామని, కుటుంబ సభ్యుల పేర్లు వారి ఆధార్ నెంబర్లు కూడా సేకరించి యంత్రాలను పొందుపర్చామన్నారు. ఇంటర్‌నెట్ సౌకర్యం లేని గ్రామాలకు నెట్ సౌకర్యాన్ని విస్తరింపజేసి, సరుకులను అందిస్తామన్నారు.