Home కలం సౌందర్య కవి ఫిరాక్

సౌందర్య కవి ఫిరాక్

Farik-Ghorakpuri

అనేవాలీ నస్లేం తుమ్ పర్ ఫక్ కరేగీ హమ్ అస్రోం
జబ్ ఉన్ కో యే ధ్యాన్ ఆయేగా కె తుమ్ నే ఫిరాక్ దేఖా థా

(మీరు ఫిరాక్ ను చూశారని తెలిసినప్పుడు, రానున్న తరాలు మిమ్మల్ని చూసి గర్విస్తాయి నా సహచరులారా) అని గర్వంగా చెప్పుకున్న లౌకిక వాది, గొప్ప కవి ఫిరాక్ గోరఖ్ పురి.

ఫిరాక్ గోరఖ్ పురి అసలు పేరు రఘుపతి సహాయ్. తూర్పు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో 1896లో కాయస్థ సంపన్న కుటుంబంలో జన్మించారు. తన కలం పేరు ఫిరాక్ అని పెట్టుకున్నారు. గోరఖ్ పూర్ కు చెందిన కవికాబట్టి ఆయన పేరు గోరఖ్ పురి అయ్యింది. చాలా మంది ఉర్దూ కవులు ఇలా తమ పేర్లతో పాటు తమ ఊరును కూడా పేరుతో చేర్చడం మామూలే. గోరఖ్ పూర్ లో ఒకప్పుడు ముస్లిములు దసరా సందర్భంగా రావణుడి బొమ్మలు తయారు చేసేవారు. హిందువులు ముహర్రం సందర్భంగా తాజియాలు తయారు చేసేవారు.
కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. లౌకికతత్వం మరణశయ్యపై చేరుతుంటే హిందూ త్వం కొత్త ఉత్సాహంతో చెలరేగిపోతోంది. ఈ నేపథ్యంలో గోరఖ్ పూర్ లో మనకు ముస్లిం యోగులు కనిపించడం లేదు. ది వైర్ పత్రిక గోరఖ్ పుర్ ముస్లిం యోగుల గురించి అద్భుతమైన సమాచారాన్నిచ్చింది.
గోరఖ్ పూర్ , ఆ నాటి హిందూ ముస్లిమ్ సమైక్య, గంగా జమునా సంస్కృతిని గుర్తు చేసే పేరు ఫిరాక్ గోరఖ్ పురి. చాలా చిన్న వయసులోనే ఫిరాక్ ఉర్దూ కవిత్వం పట్ల ఆకర్షితుడయ్యాడు. చిన్న వయసులోనే ఉర్దూలో కవిత్వం చెప్పాడు. ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాహిర్ లూధియాన్వి, కైఫీ ఆజ్మీ వంటి గొప్ప కవుల కాలం అది. ఫిరాక్ కమ్యునిస్టు భావాలు బలంగా ఉన్నప్పటికీ, అభ్యు దయ రచయితల సంఘం కవులతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, అభ్యుదయ రచ యితల సంఘంలో సభ్యుడుగా ఎన్నడూ లేడు. ఫిరాక్ తండ్రి మున్షీ గోరఖ్ ప్రసాద్ న్యాయవాది. ఆయన కూడా ఉర్దూలో కవిత్వం రాసేవారు. ఇబ్రత్ అన్న కలంపేరుతో ఆయన రాసేవాడు. తండ్రి మాదిరిగానే ఫిరాక్ కూడా ఉర్దూ కవిత్వం పట్ల మొగ్గు చూపడమే కాదు, గొప్ప కవిగా పేరు సంపాదించాడు.
ఫిరాక్ గోరఖ్ పురి ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషుల్లో ఎం.ఏ. చేశాడు. చాలా చిన్న వయసు లోనే ఆయనకు పెళ్ళయిపోయింది. బహుశా 18 సంవత్సరాల వయసులో. భార్య కిశోరి దేవి వయసు ఇంకా తక్కువ. ఈ పెళ్ళి పట్ల ఫిరాక్ చాలా అసంతృప్తిగా ఉండేవాడు. తనకు చూపించిన అమ్మాయి వేరు, పెళ్ళి చేసిన అమ్మాయి వేరని చెప్పేవారు. ఫిరాక్ వైవాహిక జీవితం విషాదమే. భార్య నిరక్షరాస్య. అందువల్ల ఫిరాక్ వంటి కవికి తగిన జోడిగా నిలబడలేక పోయింది. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగసంతానం. కాని పెద్ద కూతురు, కొడుకు ఇద్దరు చనిపోవడం మరింత విషాదం. ఆయనకు తన విషాదాన్ని పంచుకునే వారు కూడా ఎవరు దొరకలేదు. తన వైవాహిక జీవితం గురించి రాస్తూ ఆయన ఇలా అన్నాడు:
‘‘నా స్థానంలో ఎవరు ఉన్నా రెండవ వివాహం చేసుకోవాలని అనుకునేవారు. లేదా నిస్సహాయంగా పరిస్థితికి రాజీపడిపోయేవారు. కాని నేను అలా చేయలేదు. అందువల్ల నా జీవితం మొత్తం ఒంటరితనం, బాధామయం అయిపో యింది. నన్ను తనవాడిగా భావించేవారెవరైనా ఉంటే బాగుండును అనుకున్నాను.“
‘‘శివ్ కా విష్ ఫాన్ తో సునా హోగా
మైం భీ ఆయ్ దోస్త్ పీగయా ఆంసూ“
(శివుడు విషాన్ని తాగిన సంఘటన విని ఉంటావు. మిత్రమా, నేను కూడా కన్నీళ్ళు తాగేశాను)/ దిల్ జో మారాగయా ఫిరాక్ తో క్యా
జిందగీ భర్ ఇసీ కా మాతమ్ హో
(గుండె చచ్చిపోతే పోనీ, జీవితాంతం ఆ విషాదాన్ని మోస్తావా) రఘుపతి సహాయ్ 1918 నుంచి ఫిరాక్ అన్న కలంపేరుతో రాయడం మొదలు పెట్టాడు. ఉన్నత విద్యావంతుడు కాబట్టి ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసుకు, ఆ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసు కు ఎంపికయ్యాడు. కాని బ్రిటీషు ప్రభుత్వం కింద పనిచేయడానికి, ఈ సర్వీసుల్లో చేరడానికి మనస్కరించలేదు. జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు. కాంగ్రేసుకు సన్నిహితమ య్యాడు. ఆనంద్ భవన్ కుటుంబంలో ఒకరిగా మారిపోయాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రేసుకు అండర్ సెక్రటరీగా పనిచేయాలని జవహర్ లాల్ నెహ్రూ 1923లో కోరడంతో కాంగ్రేసు కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించాడు. అనేకపర్యాయాలు జైలుకెళ్ళాడు. ఉర్దూలో అద్భుతమైన కవిత్వం రాసిన ఫిరాక్ ఇంగ్లీషు భాషపై తిరుగులేని అధికారం కలవాడు. ఏ విషయాన్నయినా నిర్మొహ మాటంగా చెప్పడం ఆయనకు అలవాటు. భారతదేశంలో రెండున్నర వ్యక్తులకు మాత్రమే ఇంగ్లీషు వచ్చని, అందరికన్నా ముందు ఫిరాక్, రెండవవాడు డా. యస్. రాధాకృష్ణన్ అని అంటూ జవహర్ లాల్ నెహ్రూ కేవలం సగం మాత్రమే అన్నాడట. మీర్ తకీ మీర్, మీర్జా గాలిబ్ ల తర్వాత గొప్ప కవిగా పిరాక్ ను జోష్ మలిహాబాదీ చెప్పేవాడు.పిరాక్ గోరఖ్ పురి అలహాబాద్ యూనివర్శిటీ లో ఇంగ్లీషు లెక్చరర్ గా చేరాడు. మహాత్మాగాంధీ సహాయనిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అలహాబాద్ యూని వర్శిటీలో ఉన్నప్పుడే అద్భుతమైన ఉర్దూ కవిత్వం రాయడమే కాదు, గులె రానా వంటి గొప్ప రచన చేసి జ్ఞానపీఠ్ అవార్డు పొందాడు. 1960 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ కు కూడా ఆయన రిసెర్చ్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.
ఈ విషయాల గురించి స్వయంగా ఆయనే రాస్తూ ”బ్రిటీషు ప్రభుత్వం ఇండియన్ సివిల్ సర్వీసుకు నన్ను ఎంపిక చేసి డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం ఇచ్చింది. కాని నేను ఆ ఉద్యోగం మానేసి సహాయనిరాకరణ ఉద్యమంలో చేరాను. మౌలానా హస్రత్ మోహానీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, రఫీ అహ్మద్ కిద్వాయ్ లతో పాటు నేను చాలా సార్లు జైలుకెళ్ళాను. మా నాన్నగారు చనిపోయారు. నా తమ్ముడు కూడా చనిపోయాడు. పండిట్ నెహ్రూ నన్ను అండర్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. నా నెల జీతం 250 రూపాయలు. నేను ఈ కాలంలో మున్షీ ప్రేమ్ చంద్, కవి మజ్నూన్ గోరఖ్ పురిల తో చాలా గొప్ప సమయాన్ని గడిపాను.
ఆగ్రా జైలులో నేను హజ్రత్ నియాజ్ ఫతేపురీ ని కలిశాను. ఆయన గొప్పవ్యక్తి. ఆయన వల్లనే కవిత్వం పట్ల మరింత ఆసక్తి కలిగింది. 1922 నుంచి 1927 వరకు కాంగ్రేసు పార్టీ కోసం పనిచేశాను. ఈ కాలంలో చిత్తరంజన్ దాస్, గాంధీజీ, మౌలానా ఆజాద్ వంటి ప్రముఖుల గురించి తెలుసుకునే అవకాశం లభించింది. ఉర్దూ, ఇంగ్లీషు భాషలో నా ప్రావీణ్యం చూసి గాంధీజీ గుజరాత్ విద్యాపీఠ్ లో చేరమని చెప్పారు. 1930లో అలహాబాద్ విశ్వవిద్యాల యంలో లెక్చరర్ గా చేరాను. 1958లో రిటైర్ అయ్యాను.“
ఫిరాక్ గోరఖ్ పురి జీవితాంతం లౌకిక విలువల కోసం పోరాడిన కవి. ఉర్దూ ముస్లిముల భాషగా ప్రభుత్వాలు ముద్ర వేసే ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసించాడు. ఉర్దూ భాషాభివృద్ధికి నిధులు కేటాయించేలా ఒత్తిడి చేసేవాడు. యాభై సంవత్సరాల పాటు ఫిరాక్ సాహెబ్ రాసిన కవిత్వంలో రూహో ఖయానత్, గులె రానా, నగ్మా నుమా వంటి అనేక అద్భుతమైన రచనలున్నాయి. దీర్ఘకాలం జబ్బుపడిన ఫిరాక్ 1982లో మరణించారు.
సర్ జమీన్ హింద్ పే అక్వామ్ ఆలమ్ కే ఫిరాక్
ఖాపిలే బసతే గయే హిందూస్తాం బన్తా యగా
(భారత భూమిపై ప్రపంచ జాతుల బిడారులు వచ్చి స్థిరపడసాగాయి. భారతదేశం రూపొంద సాగింది)
ఫిరాక్ దీర్ఘకవిత ”అధిరాత్ కో“ (అర్ధరాత్రి) ఒక కళాఖండంగా పేరుపొందింది. 1944లో ఆయన రాసిన ఈ కవిత అర్ధరాత్రి దృశ్యాన్ని, ఏదో కోల్పోయిన భావాన్ని అద్భుత అనుభూతిగా అంది స్తుంది. ఇది కేవలం ఒక అర్ధరాత్రి కాన్వాసు మాత్రమే కాదు, ఇందులో ప్రపంచ పరిణామాలు, బెర్లిన్ వైపు విజయోత్సాహంతో సాగిన రష్యన్ సైనికులను కూడా ప్రస్తావిస్తుంది.
ఫిరాక్ ఇంటికి యూనివర్శిటీ విద్యార్థులు తరచు వెళ్ళేవారు. ఆయన కూడా చాలా సాదరంగా ఆహ్వానించి వారికి కవిత్వం గురించి మాట్లాడేవారు. విద్యార్థుల్లో ఎవరో ఒక తుంటరి వాడు ఆయనకు కోపం వచ్చేలా కవిత్వం గురించి ఏదో ఒక వ్యాఖ్య చేసేవాడు. ఆయనకు ఎలాంటి మొహమాటాలు లేవు. వెంటనే లేచి అందరినీ బయటకు పొండని గెంటేసేవాడు.
సామాజిక కట్టుబాట్లు, ఎవరేమనుకుం టారన్న శషభిషలు ఫిరాక్ ఎన్నడూ పట్టించుకో లేదు. 1939లో ప్రముఖ ఉర్దూ పత్రిక మదీనా ఒక ప్రత్యేక సంచిక కోసం వ్యాసం పంపమంటే ఆయన ఉర్దూ సాహిత్యంలో ప్రేమ కవితలపై రాసి పంపాడు. ఈ వ్యాసం తర్వాత పుస్తక రూపంలో కూడా వచ్చింది. ఇందులో ఫిరాక్ రాసిన కొన్ని మాటలు గమనార్హమైనవి. సామాజిక కట్టుబాట్లు, దుస్సాంప్రదాయాలపై తిరుగుబాటులో భాగం గానే స్వలింగ సంపర్కం కూడా చోటు చేసుకుం టుందని రాశాడు.
ఫిరాక్ గోరఖ్ పురి కవిత్వం, కథలు, నవలలు కూడా రాశారు. ఉర్దూ పర్షియన్ ఇంగ్లీషు భాషల్లోనే కాదు, హిందీ బ్రజ్ భాష, సంస్కృతం కూడా బాగా తెలిసిన ఫిరాక్ రచనల్లో భారతీయ బహుళత్వం, శాంతియుత సహజీవన భావాలు భారత సంస్కృతి సంప్రదాయాల విలువలుగా కనిపిస్తాయి. 1968లో పద్మభూషణ్ పొందిన రఘుపతి సహాయ్ ఫిరాక్ గోరఖ్ పురీ ముప్పయిల నుంచి అరవై డెబ్బయిల వరకు భారతదేశంలో విస్తృతంగా కనిపించిన సోషలిస్టు, సహనశీల, లౌకిక, సంస్కరణా వాదాలకు ప్రతీకగా నేటికి తన కవిత్వం రూపంలో మన ముందున్నారు.